e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, January 22, 2022
Home ఎడిట్‌ పేజీ సేంద్రియ హరిత విప్లవం

సేంద్రియ హరిత విప్లవం

మొదటి హరిత విప్లవ కాలంలో ప్రారంభమైన రసాయన ఎరువుల వాడకం హద్దులు దాటింది. వాటికి ఇచ్చే సబ్సిడీలు ప్రభుత్వానికి తలకు మించిన భారంగా మారాయి. అశాస్త్రీయంగా, విచక్షణరహితంగా ఈ ఎరువులు వాడటం వల్ల భూములు సాగుకు పనికి రాకుండా పోతున్నాయి. ప్రజల ఆరోగ్యం దెబ్బతింటున్నది. దీనికి పరిష్కారం సేంద్రియ వ్యవసాయమే. అర్ధ శతాబ్దం నాటి మొదటి హరిత విప్లవంతో దేశం ఆహారరంగంలో స్వయంసమృద్ధి సాధించినప్పటికీ రసాయన ఎరువులు, పురుగు మందుల వాడకం దుష్ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ లోపాన్ని సవరించుకునేలా రెండో హరిత విప్లవం రావాలి.

భారతీయ భూ విజ్ఞానశాస్త్ర సంస్థ ‘ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సాయిల్‌ సైన్స్‌’ ఇటీవలి నివేదిక ప్రకారం- 19 రాష్ర్టాల్లో సగానికి పైగా రాష్ర్టాలు భూసార క్షీణతను ఎదుర్కొంటున్నాయి. రెండుకుపైగా పంటలు వేసినప్పుడు ఆ నేలల్లో ప్రధాన పోషకాలు లోపిస్తున్నాయి. వాటిని అందించటం కోసం రసాయన ఎరువులను వాడటం వల్ల ఆహార పంటల నాణ్యత తగ్గుతున్నది. చీడపీడలను ఎదుర్కొనే సూక్ష్మధాతు పోషకాలు ఆ పంటల్లో లేకుండా పోతున్నాయి. ఆహారధాన్యాల్లో శరీరానికి శక్తినిచ్చే అనేక మూలకాలు ఉండటం లేదని వెల్లడైంది. ముమ్మరంగా పంటల సాగు, కేవలం రసాయన ఎరువులు వాడటం, భూసార పరీక్షల ఫలితాల ప్రకారం నేలల యాజమాన్యం లేకపోవటం వల్ల ప్రస్తుతం సాగులో ఉన్న 70శాతానికి పైగా భూములు నిస్సారమయ్యాయి. నేలల్లో సేంద్రియ కర్బనం తగ్గిపోయి నేలలు మృత్తిక క్షయానికి గురవుతున్నాయని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్‌), నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ సైన్సెస్‌ సంయుక్తంగా చేపట్టిన పరిశోధనల్లో వెల్లడైంది. దేశంలోని 50 శాతం నేలల్లో నత్రజని, 49 శాతం నేలల్లో భాస్వరం, 9 శాతం నేలల్లో పొటాష్‌ లోపించాయి. మరోవైపు దేశంలోని పలుప్రాంతాల్లో కొన్ని పోషకాల నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఉదాహరణకు: తెలంగాణ, ఏపీలలో పొటాష్‌ నిల్వలు ఎక్కువ ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో పొటాష్‌ ఎరువులు ఒక మోస్తరుగా వాడితే సరిపోతుంది. కానీ ఎక్కువ మొత్తంలో వాడటం వల్ల ఎరువులు వృథా కావడమేగాక రైతులకు పెట్టుబడి ఖర్చులూ పెరుగుతున్నాయి. భూసార పరీక్షలు, వాటి ఆధారంగా పోషక యాజమాన్యం చేపట్టడం వల్ల ఈ సమస్యల్ని తగ్గించవచ్చు.

- Advertisement -

దేశ జనాభా పెరుగుదల నేపథ్యంలో రెండో హరిత విప్లవానికి బీజావాపన చేయాల్సిన అవసరం ఉరుముతోంది. అయితే, నానాటికీ క్షీణిస్తున్న భూసారం పూర్తి ప్రతిబంధకంగా ఉంది. దీనిని అధిగమించటానికి దేశవ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాల్ని బట్టే పంట రకాలపై నిర్ణయం తీసుకోవాలి.

అనేక దేశాలు నేల ఆరోగ్యాన్ని కాపాడే చర్యలు ప్రారంభించాయి. 12 ప్రధాన పంటల్లో సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టిన చైనా 5 నుంచి 30 శాతం నత్రజని వాడకాన్ని తగ్గించింది. దీనివల్ల 15 శాతం అధిక దిగుబడులు సాధిస్తోంది. భూసార లేమి తాండవించే ఆఫ్రికా దేశాలు ఆహార పంటలతో పాటు అటవీ మొక్కలను పెంచటం ద్వారా మేలైన దిగుబడులు పొందుతున్నాయి. వరిలో నత్రజని ఎరువులను పొలమంతా వెదజల్లకుండా అవసరమున్న చోట మాత్రమే నేరుగా వేసే టెక్నాలజీని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ (ఐఆర్‌ఆర్‌ఐ) అభివృద్ధిపరిచింది.

సేంద్రియ ఎరువులు కీలకం
భూసార పరిరక్షణ కోసం ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) 2011లో ‘ప్రపంచ మృత్తిక నిర్వహణ’ను ప్రారంభించింది. నేల ఆరోగ్య నిర్వహణకు ఉత్తమ పద్ధతులను అన్ని దేశాలకు అందిస్తోంది. ఇదే ధ్యేయంతో ఐక్యరాజ్యసమితి 2011ను ‘అంతర్జాతీయ మృత్తిక సంవత్సరం’గా ప్రకటించింది. దేశంలో మూడొంతుల భూములు నిస్సారంగా మారాయని గ్రహించిన భారత్‌, నేలల ఆరోగ్య నిర్వహణ కీలకమని గుర్తించి 11వ పంచవర్ష ప్రణాళికలో (2007-12) దాన్ని ప్రాధాన్యాంశంగా చేర్చింది. ఈ నేపథ్యంలో భూసార పరీక్షలు నిర్వహించి, వాటి ఫలితాల ఆధారంగానే ఎరువులు వాడేలా చూడాలి. సేంద్రియ ఎరువులకు ప్రాధాన్యమివ్వాలి. తక్కువ ఉత్పత్తి కారకాలతో సుస్థిర దిగుబడులు సాధించాలంటే- నేలల ఆరోగ్య నిర్వహణతోపాటు సేంద్రియ ఎరువుల వాడకానికి ప్రభుత్వాలు సరైన నిధులు కేటాయించాలన్న స్వామినాథన్‌ సిఫారసు శిరోధార్యం. రెండో హరిత విప్లవానికి అదే బంగారు బాట.

సూక్ష్మధాతు పోషక ఎరువులను, జీవన ఎరువులను త్వరలోనే జాతీయ ఎరువుల విధానంలో చేరుస్తామన్న కేంద్రం ఆ దిశగా ముందడుగు వేయలేదు. ఇప్పటికైనా రాష్ర్టాలతో కలిసి సమగ్రచర్యలు చేపట్టాలి. సేంద్రియ పోషకాలను నేలకు అందించే పప్పుధాన్యపు పంటలను అంతర పంటలుగా, మిశ్రమ పంటలుగా వేసేలా రైతులను ప్రోత్సహించాలి. దీనివల్ల పప్పుధాన్యాల దిగుబడి పెరగటమేగాక నేలల్లో సారం, పోషకాల మోతాదు పెరుగుతాయి. సేంద్రియ ఎరువుల లభ్యత తక్కువగా ఉన్నందున, పట్టణప్రాంతాల్లో ఎక్కువగా ఉత్పత్తి అవుతున్న మురుగు వ్యర్థాలను విలువైన ఎరువులుగా మార్చే వ్యూహాలు రచించాలి. పరిశ్రమల నుంచి వచ్చే జీవవ్యర్థాలను కంపోస్టుగా మార్చి సబ్సిడీతో రైతులకు అందించాలి. ప్రతి మున్సిపాలిటీ కంపోస్ట్‌ కేంద్రాలు నెలకొల్పేలా చర్యలు తీసుకోవాలి. గ్రామపంచాయతీలు కమ్యూనిటీ బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసుకొనేలా ప్రోత్సహించాలి.

ప్రస్తుతం సేంద్రియ ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల డిమాండ్‌ ఉంది. రెండు మూడేండ్లలో అది రూ.6-7 లక్షల కోట్లకు చేరవచ్చు. ఈ అవకాశాన్ని భారత్‌ అందిపుచ్చుకోవాలి. సేంద్రియ పదార్థాల అమ్మకపు ధరలు ఎక్కువ కాబట్టి సాగు లాభదాయకంగా ఉంటుంది. వీటికయ్యే ఉత్పత్తి ఖర్చులు తక్కువ, పని దినాలు ఎక్కువ. అందువల్ల ఉపాధి రోజులూ పెరుగుతాయి.

క్రమపద్ధతిలో విస్తరణ
సేంద్రియ సాగును పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ప్రస్తుత సహజ ఎరువుల రకాలు సరిపోవు, పశువుల పేడ, కంపోస్టు పంటల వ్యర్థాలు, పచ్చిరొట్ట ఎరువులు, జీవన ఎరువులు మొత్తం కలిపినా ఒక సంవత్సరంలో పంటలకు అవసరమయ్యే పోషకాలను అందించలేవు. 2025 నాటికి 4.5 కోట్ల టన్నుల పోషకాలు కావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సేంద్రియ వనరుల పోషకాలు 50 లక్షల టన్నులకు మించవు. 2025 నాటికి 78 లక్షల టన్నుల ఉత్పత్తి ఉండవచ్చని అంచనా. కాబట్టి దశల వారీగా సేంద్రియ సాగును ప్రోత్సహించాలి. మూడొంతులు ఉన్న మెట్ట, అటవీ, కొండ, గిరిజన ప్రాంతాల్లో రసాయన ఎరువుల వాడకం ఇప్పటికీ తక్కువే. అక్కడ జరుగుతున్నది సేంద్రియ సాగే. కొన్ని సూచనలు, సాగులో మార్పులతో వాటిని సేంద్రియ ఉత్పత్తులుగా విక్రయించవచ్చు. ప్రజాపంపిణీ వ్యవస్థ, దవాఖానలు, మధ్యాహ్న భోజన పథకం, రైల్వేల్లో సేంద్రియ ఆహార ఉత్పత్తులను ముందుగా పరిచయం చేయాలి.

రసాయనాలతో ఆర్యోగానికి చేటు
రసాయన ఎరువులు, పురుగుమందుల విపరీత వాడకంతో భూములు సారం కోల్పోవటమేగాక తినే ఆహారం, తాగే నీరు కలుషితమయ్యాయి. భారత ఆహార భద్రత ప్రమాణాల సంస్థ అధ్యయనంలో తిండిగింజలపై, కూరగాయలపై క్యాన్సర్‌ కారకాలు, నాడీవ్యవస్థను దెబ్బతీసే పురుగుమందుల అవశేషాలు అనేకం ఉన్నట్లు తెలిసింది. సిమ్లా ఆపిల్స్‌, మహారాష్ట్ర ద్రాక్ష, కేరళ యాలకులు సైతం ప్రమాదకరమని తేలాయి. వ్యవసాయ ప్రధాన రాష్ట్రమైన పంజాబ్‌లో రకరకాల అనారోగ్య సమస్యలు పెచ్చరిల్లాయి. అక్కడ సగటున రోజుకు 18 మంది క్యాన్సర్‌ బారిన పడుతున్నారు.

(వ్యాసకర్త: డాక్టర్‌ పిడిగెం సైదయ్య , 77805 09322 , అసోసియేట్‌ ప్రొఫెసర్‌, తెలంగాణ హార్టికల్చరల్‌ యూనివర్సిటీ)

Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement