ప్రధానమంత్రి నరేంద్రమోదీ 2016లో చేసిన నోట్ల రద్దు ప్రకటన భారత ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసింది. చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేస్తున్నట్లు హడావిడిగా మోదీ ప్రకటించారు. 2000 రూపాయల నోట్లను కొత్తగా తెస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయాన్ని దేశంలోని చాలా మంది ఆర్థికవేత్తలు, మేధావులు, రాజకీయ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకించాయి.
కానీ బీజేపీ ప్రభుత్వం అవినీతిని కట్టడి చేయాలన్నా, నల్లధనాన్ని రూపుమాపాలన్నా, నోట్లరద్దే సరైన మార్గమని ఒక వర్గం మీడియా ద్వారా విపరీతంగా ప్రచారం చేసింది. నోట్ల రద్దు ప్రభావంతో దేశ ఆర్థిక వ్యవస్థ తిరోగమనం బాట పట్టింది. చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చిన్న చిన్న వ్యాపారాలు తీవ్రంగా ఒడిదుడుకులకు లోనయ్యాయి. అనేక పరిశ్రమలు మూతపడ్డాయి. ఎంతోమంది ఉపాధి అవకాశాలు లేక రోడ్డున పడ్డారు.
నెమ్మదిగా ఆర్థిక వ్యవస్థ కోలుకుంటుంది అనుకునేలోపే కేంద్రం లాక్డౌన్ ప్రకటించింది. దాంతో మళ్లీ ఆర్థిక పరిస్థితి కుదేలు అవ్వడం మనం అందరం చూసిందే. ఆర్థిక వ్యవస్థ ఒక్కసారి తిరోగమనం బాట పడితే మళ్ళీ కోలుకోవడానికి ఏండ్లు పడుతుంది.
నోట్ల రద్దు అనే ఒక్క నిర్ణయం దేశంలో ఇంత గందరగోళం పరిస్థితులకు కారణం అయ్యింది. ఇప్పుడు మళ్ళీ 2000 రూపాయల నోట్లను క్లీన్ నోట్ పాలసీలో భాగంగా వెనక్కి తీసుకుంటున్నట్లు రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా ప్రకటించింది. దీని ప్రభావం చిన్న పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, రియల్ ఎస్టేట్, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే సామాన్యులపైన ఉండనుంది.
అప్పడు రెండువేల రూపాయల నోట్లు ప్రవేశపెట్టడం మంచి నిర్ణయం అని ప్రకటించి ఈ రోజు వెనక్కి తీసుకోవడం ఏమిటని దేశంలోని ప్రతిపక్షాలు కేంద్రాన్ని నిల తీస్తున్నాయి. దీని వెనుక ఏమైనా రాజకీయ కోణం ఉందా అనే అనుమానాలు సామాన్యులకు కలుగుతున్నాయి.
నోట్ల రద్దు వలన మాత్రమే అవినీతి, నల్లదనం వెలికితీత జరిగితే రూ.500, రూ.1000 నోట్ల రద్దు తర్వాత నల్లధనం మొత్తం బయటికి వచ్చి ఉండాలి కదా! కానీ ఆలా జరిగిందా? ఇప్పడు రద్దు అయిన నోటు రూ.2,000ను మార్చుకోవడానికి మే 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువు ఇచ్చారు. ఒకరికి రోజుకు 20 వేల రూపాయల వరకు మార్చుకోవడానికి మాత్రమే అవకాశం ఉంది. ఈ నిబంధన కూడా సామాన్యులను ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు సామాన్యులకు మేలు చేయాలి కానీ సమస్యలు సృష్టించకూడదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం తీసుకుంటున్న అనాలోచిత, తొందరపాటు నిర్ణయాల వల్ల బలి అవుతున్నది మాత్రం సామాన్యుడే.
-స్కంధ ధన్విక్