మాదిగ సామాజికవర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్య అవకాశం కల్పించే అంశంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. తాజాగా రాజ్యసభ రేసులో ముందు వరుసలో ఉన్న పేద వర్గానికి చెందిన దొమ్మటి సాంబయ్య పేరును కాదని, సంపన్నుడైన వేం నరేందర్‌రెడ్డిని పెద్దల సభకు పంపుతూ పాలకుడు తన సహజ స్వభావాన్ని చాటుకున్నారు. అటు లోక్‌సభ, రాజ్యసభ, ఇటు శాసనమండలిలో మాదిగలు ప్రాతినిధ్యం కోల్పోవడం చూస్తే ‘హస్తం’ పాలకుల తీరు స్పష్టంగా అర్థమవుతున్నది. బీఆర్ఎస్ హయాంలోనే బడుగులను రాజ్యసభకు పంపడం మనం గమనించాలి.
సీఎం రేవంత్‌రెడ్డి వైఖరి ‘ఏరు దాటేదాకా ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న’ అనే చందంగా ‘మార్పు’ కనిపించింది. మాదిగ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం ఇవ్వకుండానే తన ‘క్యాబినెట్’ను రూపొందించడం ఇందుకు మొదటి ఉదాహరణ. లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా, అందులో పెద్దపల్లి, నాగర్‌కర్నూల్, వరంగల్ నియోజకవర్గాలు ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నాయి. ఈ స్థానాల నుంచి రాజకీయ, ఆర్థిక పలుకుబడి కలిగిన ఇద్దరు మాలలతో పాటు బైండ్ల సామాజిక వర్గానికి చెందిన మహిళను కాంగ్రెస్ బరిలో నిలిపింది. హోరాహోరీగా జరిగిన ఆ ఎన్నికల సమరంలో మూడు రిజర్వ్డ్ స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు పట్టం కట్టారు. వెరసి మాదిగలు పార్లమెంట్ మెట్లు ఎక్కే అవకాశం తొలిసారిగా కోల్పోయారు.
నామినేటెడ్ పదవుల భర్తీలోనూ మాదిగలకు చుక్కెదురైంది. మొత్తం 34 మందితో కూడిన తొలి జాబితాను ప్రభుత్వం ప్రకటించగా, అందులో కేవలం మాదిగ సామాజిక వర్గానికి ఒక్క పదవిని మాత్రమే కేటాయించారు. అది కూడా సంప్రదాయబద్ధంగా వస్తున్న ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి. ప్రభుత్వంలో కీలకమైన భాగస్వామ్యం ఇవ్వకుండా..మాదిగలను యూనివర్సిటీ వీసీ (వైస్ ఛాన్సలర్), ప్రిన్సిపాల్ వంటి పదవుల్లో కూర్చోబెట్టానంటూ స్వయంగా సీఎం పలుమార్లు ప్రకటిస్తుండటం అవమానకరంగా ఉన్నది.
ఒకపక్క సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు..మరోపక్క తెలంగాణలో దళితుల జనాభాలో మాదిగల సంఖ్య అత్యధికంగా ఉండటంతో ఎస్సీ ఉప వర్గీకరణ అమలుకు అనివార్యత ఏర్పడింది. జనాభా నిష్పత్తి ప్రకారం 11 శాతం దక్కాల్సిన రిజర్వేషన్లను 9 శాతానికి కుదించడం న్యాయమేనా? వర్గీకరణ చట్టం చేయకుండానే హడావుడిగా గ్రూప్ 1, 2, 3తో పాటు ఇతర శాఖల్లో ఉద్యోగ నియామకాలు చేపట్టడం వల్ల మాదిగ, ఉప కులాలకు నష్టం జరిగిన మాట వాస్తవం కాదా? ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి. ఎమ్మెల్సీ పదవుల భర్తీలోనూ మాదిగలకు కాంగ్రెస్ మొండి చేయి చూపింది. నమ్మి కాంగ్రెస్ వెంట నడిచిన మాదిగలకు ‘వంచన’ను కానుకగా అందించింది. రష్యన్ నాయకుడు లెనిన్ అన్నట్టు ‘ఏ నినాదం వెనుక ఏ వర్గ ప్రయోజనం దాగి ఉన్నదో తెలుసుకోనంత కాలం ప్రజలు మళ్లీ మళ్లీ మోసపోతూనే ఉంటారు’. ఇది తెలంగాణ ప్రజలు గుర్తించాలి.
– నరేశ్ పాపట్ల , 9505475431