‘సూడు సూడు నల్గొండ, గుండె మీద ఫ్లోరైడ్ బండ..’ అని నాడు ఉమ్మడి పాలనలో నిరక్ష్యానికి గురైన నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజలపై పాటలు రాసుకున్న సందర్భం అది. ఆ రోజుల్లో బోర్లు, బావుల భూగర్భ జలాల్లో ఫ్లోరైడ్ నిండిపోయి, పండే పంటల్లో కూడా ఫ్లోరైడ్ ఉండేదంటే నాటి సమస్య తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
ఉమ్మడి రాష్ట్ర పాలనలో ఫ్లోరైడ్ భూతంతో లక్షా యాభై వేల మంది నల్లగొండ బిడ్డల నడుములు వంగిపోయా యి. అయినా నాటి పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. తలాపునే నాగార్జునసాగర్ ఉన్నా ఫ్లోరైడ్ సమస్య నివారణ కోసం ఏమీ చేయలేకపోయారు నాటి నాయకులు. బొక్కలు వంగిపోయిన బిడ్డలను వదిలేసి కూలీ పనులకు పోతే, వాళ్లు ఎక్కడ కింద పడుతారోనన్న భయం తల్లిదండ్రులది. అందుకే ఆ పిల్లలను పశువుల కొట్టా ల్లో కట్టేసి కూలీ పనులకు వెళ్లేవారు తల్లిదండ్రు లు. ఆ తల్లులు తల్లడిల్లే గోసను చూసి కూడా అప్పటి పాలకుల మనసు చలించలేదు. ఫ్లోరైడ్ రక్కసి నల్గొండ జిల్లాను అతలాకుతలం చేస్తు న్నా ఆ నాయకులు మిన్నకుండిపోయారు.
తాగునీటిలో ఫ్లోరైడ్ మూలంగా ఫ్లోరోసిస్ వ్యాధి సోకి వంకర్లు పోయిన దేహాలతో పిల్లలు పుట్టేవారు. ఫ్లోరైడ్ బక్కపలుచని శరీరాలు, గారపట్టిన పళ్లు, కిడ్నీ సమస్యలతో లక్షన్నర మందిని జీవచ్ఛవంలా మార్చింది. ఆ దృశ్యాన్ని చూసి గుండె తరుక్కుపోయిన మానవతావాదులు నిస్సహాయంగా కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేకపోయారు.
ఫ్లోరైడ్ పీడిత గ్రామాల ప్రజల కష్టాలను తొలగించేందుకు ఎంతోమంది ఎన్నోరకాల ప్రయత్నాలు చేశారు. స్వచ్ఛంద సంస్థలు సైతం తమవంతు కృషి చేశాయి. జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు ప్రతీకగా నిలిచిన అంశాల స్వామితోపాటు బాధితులను 2003 మార్చి 12న ఢిల్లీకి తీసుకువెళ్లా రు. పార్లమెంట్ బల్లపై పడుకోబెట్టి, నాటి ప్రధాని అటల్ బిహారీ వాజపేయికి చూపించారు. ఆయ నా చలించిపోయి కంటతడిపెట్టారు. కానీ అధికారంలో ఉండి కూడా సమస్యకు పరిష్కారం చూపలేకపోయారు. తెలంగాణ ఉద్యమనేతగా ఉన్న కేసీఆర్ నల్గొండ జిల్లా పర్యటనలో ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాల ప్రజల బాధలను కండ్లారా చూ సి, కన్నీళ్లు పెట్టుకున్నారు. సమ స్యను అప్పటి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. ఫ్లోరైడ్ పోరు యాత్రలో భాగంగా 2003లో మర్రిగూడలో కేసీఆర్ ‘పల్లెనిద్ర’ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత నీరు సరఫరా చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఉద్యమ నేత కేసీఆర్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పించాలని సంకల్పించారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు ‘మిషన్ భగీరథ’ కింద మంచినీరు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రత్యేకంగా నిధులిచ్చి, 2014 డిసెంబర్ 9న చౌటుప్పల్‌లో ‘మిషన్ భగీరథ’ పైలాన్ నిర్మాణానికి పునాది రాయి వేశారు. 2017 నాటికి మిషన్ భగీరథ పనులు పూర్తయ్యాయి. అదే ఏడాది చివరలో భూగర్భ జలాలకు బదులుగా మొత్తం ఉపరితల జలాలతోనే నూటికి నూరుశాతం ఇండ్లకూ సురక్షితమైన నల్లా నీటి సరఫరా ప్రారంభించారు. అలా ఫ్లోరైడ్ రక్కసి నుంచి నల్లగొండ జిల్లా ప్రజలకు కేసీఆర్ విముక్తి కల్పించారు. తద్వారా రాష్ట్ర ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.
తెలంగాణలో ఫ్లోరైడ్ ప్రభావిత గ్రామాలు లేవని 2020 సెప్టెంబర్ 15న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2015 నాటికి 967 ఫ్లోరైడ్ గ్రామాలు ఉండగా 2020 ఆగస్టు 1 నాటికి ఆ సంఖ్య సున్నాకు చేరుకున్నదని లోక్‌సభలో జల్‌శక్తి సహాయ మంత్రి రతన్‌లాల్ కటారియా ప్రకటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన శాశ్వతంగా ఫ్లోరైడ్ సమస్య తీర్చిన మాట వాస్తవమని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే పార్లమెంటు వేదికగా ప్రశంసించింది.
కర్నాటి విద్యాసాగర్:94913 93999