భారతదేశం 1947 ఆగస్టు 15న బ్రిటిష్ వలస పాలన సంకెళ్లను తెంచుకుని, స్వేచ్ఛావాయువులను పీల్చుకుంటూ ప్రజాస్వామ్య పంథాలో అడుగుపెట్టింది. అసంఖ్యాక త్యాగాల పునాదులపై నిర్మితమైన రాజ్యాంగం పౌరులకు ప్రాథమిక హక్కులను, భావప్రకటనా స్వేచ్ఛను ప్రసాదించింది. అయితే, స్వాతంత్య్రం వచ్చిన కేవలం 28 ఏండ్ల్లకే దేశ చరిత్రను మలుపుతిప్పిన ఒక అంధకార ఘట్టం ఆవిష్కృతమైంది. 1975 జూన్ 25 అర్ధరాత్రి వేళ ప్రకటించిన అంతర్గత అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) స్వతంత్ర భారత ప్రజాస్వామ్య యవనికపై చెరగని నల్లని మచ్చగా మిగిలిపోయింది. రాజ్యాంగ నిబంధనలను స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఏ విధంగా దుర్వినియోగం చేయవచ్చో నిరూపించిన ఈ 21 నెలల కాలం, పౌరహక్కుల కాలరాతకు, పత్రికా స్వేచ్ఛ అణచివేతకు పరాకాష్ఠగా నిలిచింది.
1971 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించిన ఇందిరాగాంధీ, తన గెలుపు కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని, అధికార నిధులను దుర్వినియోగం చేశారంటూ ఆమె ప్రత్యర్థి, సోషలిస్ట్ నాయకుడు రాజ్ నారాయణ్ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుదీర్ఘ విచారణ అనంతరం 1975 జూన్ 12న న్యాయమూర్తి జగన్మోహన్ లాల్ సిన్హా చారిత్రాత్మక సంచలన తీర్పును వెలువరించారు. ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదంటూ ప్రకటిస్తూ, ప్రజాప్రాతినిధ్య చట్టం కింద ఆమె ఆరేండ్ల పాటు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయకుండా నిషేధం విధించారు.
ఈ తీర్పు దేశ రాజకీయాల్లో భూకంపం సృష్టించింది. దీనికి తోడు అప్పటికే గుజరాత్‌లోని నవనిర్మాణ్ ఆందోళన, బీహార్‌లో లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జెపి) నేతృత్వంలో సాగుతున్న అవినీతి వ్యతిరేక ‘సంపూర్ణ విప్లవం’ ఉద్యమం దేశవ్యాప్తంగా ఉధృతరూపం దాల్చాయి. న్యాయస్థానం తీర్పుతో నైతిక బలాన్ని కోల్పోయిన ఇందిరాగాంధీ పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు జూన్ 25న ఢిల్లీ రామ్‌లీలా మైదానంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, దేశవ్యాప్త శాసనోల్లంఘనకు పిలుపునిచ్చాయి. ఈ రాజకీయ సవాల్‌ను, ప్రజాందోళనలను తట్టుకోలేని నాటి ప్రభుత్వం, తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి రాజ్యాంగంలోని 352వ అధికరణాన్ని ఆశ్రయించింది. అంతర్గత అశాంతి పొంచి ఉందనే నెపంతో, నాటి రాష్ట్రపతి ఫకృద్దీన్ అలీ అహ్మద్‌తో అర్ధరాత్రి వేళ అత్యవసర పరిస్థితి ప్రకటనపై సంతకం చేయించింది.
అత్యవసర స్థితి అమల్లోకి వచ్చిన మరుక్షణమే దేశం ఒక భారీ కారాగారంగా మారిపోయింది. జూన్ 26 తెల్లవారుజాము నుంచే ప్రతిపక్ష నాయకుల అణచివేత పర్వం ప్రారంభమైంది. జయప్రకాశ్ నారాయణ్, మొరార్జీ దేశాయ్, వాజ్‌పేయి, ఎల్కే అద్వానీ, జార్జి ఫెర్నాండెజ్, చరణ్‌సింగ్, చంద్రశేఖర్ వంటి అగ్రనేతలతో పాటు వేలాది మంది రాజకీయ కార్యకర్తలను విచారణ లేకుండానే జైళ్లలో బంధించారు.
రాజ్యాంగ విలువల కంటే పాలకుల అభీష్టమే పరమావధిగా సాగిన ఈ కాలంలో పత్రికా రంగం అత్యంత దారుణమైన దాడిని ఎదుర్కొన్నది. ప్రజాస్వామ్యానికి నాల్గవ స్తంభంగా భావించే పత్రికల నోరు నొక్కేందుకు ముందస్తు సెన్సార్షిప్ (ప్రెస్ సెన్సార్షిప్) విధానాన్ని ప్రవేశపెట్టారు. వార్తాపత్రికలు ఏ సమాచారాన్ని, సంపాదకీయాన్ని, కార్టూన్‌ను లేదా ప్రకటనను ప్రచురించాలన్నా ముందుగా ప్రభుత్వ సెన్సార్ అధికారి అనుమతి పొందడం విధిగా మార్చారు. నిరసన స్వరాలు బయటకు రాకుండా ఉండేందుకు జూన్ 26 రాత్రి ఢిల్లీలోని బహదూర్ షా జఫర్ మార్గ్‌లోని ప్రధాన వార్తాపత్రికల కార్యాలయాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడం ప్రభుత్వ క్రూరత్వానికి నిదర్శనం. ఈ ఆంక్షలను ధిక్కరించిన లేదా లొంగని పత్రికలపై ప్రభుత్వం నిషేధాస్ర్తాన్ని ప్రయోగించింది.
జాతీయ స్థాయిలో ‘ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్’, ‘ది స్టేట్స్‌మన్’ వంటి పత్రికలు సెన్సార్షిప్ను నిరసిస్తూ తమ సంపాదకీయ పేజీలను ఖాళీగా వదిలిపెట్టి శ్వేతపత్ర నిరసనను వ్యక్తం చేశాయి. అయినప్పటికీ ప్రాంతీయ, జాతీయ స్థాయిల్లో అనేక పత్రికలు మూతపడ్డాయి. తెలుగు గడ్డపై హైదరాబాద్ నుంచి వెలువడిన ‘జాగృతి’, ప్రగతిశీల సాహిత్య పత్రిక ‘సృజన’, రాజమండ్రి నుంచి వచ్చిన ‘ప్రజా సమస్యలు’ వంటి పత్రికలు ప్రభుత్వ ఆగ్రహానికి గురై ఆంక్షలు ఎదుర్కొన్నాయి. అయితే, అధికారిక మాధ్యమాలపై ఆంక్షలు పెరిగిన కొద్దీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రత్యామ్నాయ సమాచార వ్యవస్థలు అజ్ఞాతంలో రూపుదిద్దుకున్నాయి.
దేశవ్యాప్తంగా రహస్య ముద్రణాలయాల ద్వారా కరపత్రాలు, చిన్న పుస్తకాలు, అజ్ఞాత పత్రికలు (అండర్ గ్రౌండ్ ప్రెస్) వెలువడ్డాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఈ అజ్ఞాత పత్రికా రంగం అద్భుతమైన పాత్ర పోషించింది. ‘వందేమాతరం’, ‘ఎక్స్‌రే’, ‘గర్జన’, ‘అంతర్వాణి’, ‘ప్రజావాణి’, ‘జనవాణి’ వంటి రహస్య పత్రికలు జైళ్లలో ఉన్న నాయకుల సమాచారాన్ని, ప్రభుత్వ దమనకాండను ప్రజలకు చేరవేస్తూ ప్రతిఘటనా జ్వాలను సజీవంగా ఉంచాయి. సమాచార ప్రసారాల కోసం ప్రజలు విదేశీ రేడియోలైన ‘బీబీసీ’, ‘వాయిస్ ఆఫ్ అమెరికా’లపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఇరువై ఒక్క నెలల పాటు సాగిన ఈ నిరంకుశ పాలన, పత్రికలపై ఆంక్షలు, బలవంతపు చర్యల వల్ల ప్రజల్లో అంతర్గతంగా తీవ్ర ఆగ్ర హం, అసంతృప్తి వెల్లువెత్తాయి. ఇంటెలిజెన్స్ వర్గాల తప్పుడు నివేదికల ఆధారంగా, ప్రజలు తన వైపే ఉన్నారని భావించిన ఇందిరాగాంధీ 1977 జనవరిలో అత్యవసర స్థితిని సడలించి, లోక్‌సభ ఎన్నికలను ప్రకటిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. జైళ్ల నుంచి విడుదలైన విభిన్న సిద్ధాంతాల ప్రతిపక్ష పార్టీలు-భారతీయ జనసంఘ్, భారత లోక్‌దళ్, సోషలిస్ట్ పార్టీ, సంస్థా కాంగ్రెస్-అన్నీ ఏకమై, జేపీ ఆశీస్సులతో ‘జనతా పార్టీ’గా అవతరించాయి. 1977 మార్చిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు ప్రజాస్వామ్యానికే పట్టం కట్టారు. అజేయ శక్తులుగా భావించిన ఇందిరాగాంధీ రాయ్‌బరేలీలో, ఆమె కుమారుడు సంజయ్ గాంధీ అమేథీలో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఉత్తర భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోయింది. జనతా పార్టీ ఘనవిజయం సాధించి, స్వతంత్ర భారత చరిత్రలో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని కేంద్రంలో ఏర్పాటు చేసింది. ప్రధానిగా మొరార్జీ దేశాయ్ బాధ్యతలు స్వీకరించారు.
భారత ప్రజాస్వామ్య వికాసంలో ఎమర్జెన్సీ కాలం ఒక కఠినమైన పరీక్షగా, అమూల్యమైన గుణపాఠంగా నిలిచింది. పాలకుల చేతిలో రాజ్యాంగం ఏ విధంగా అణచివేత సాధనంగా మారుతుందో, అదే సమయంలో పౌరసమాజం తలవంచకుండా నిలబడితే నియంతృత్వాలు ఏ విధంగా కూలిపోతాయో ఈ ఘట్టం నిరూపించింది. తదనంతరం వచ్చిన జనతా ప్రభుత్వం 44వ రాజ్యాంగ సవరణ ద్వారా పౌరుల జీవించే హక్కును అత్యవసర స్థితిలోనూ రద్దు చేయకుండా రక్షణ కల్పించింది. పత్రికా స్వేచ్ఛ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, బలీయమైన ప్రతిపక్షం లేని నాడు ప్రజాస్వామ్యం అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందనే సత్యాన్ని ఈ సంక్షోభం సమాజానికి బోధించింది. జూన్ 25 కేవలం ఒక తేదీ కాదు, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాలని హెచ్చరించే ఒక సజీవ స్మృతి చిహ్నం.
– రామకిష్టయ్య సంగనభట్ల 9440595494