గురువేం జేస్తాడు?
బిచ్చమెత్తుకుంటూ ఉంటాడు
లేబర్ అడ్డాల దగ్గర, పొలాల్లో, గనుల దగ్గర
తునికాకులు సేకరించే గిరిజనుల వెంటపడి
విప్పపూలు నెత్తికెత్తుకునే మహిళల వెంటపడి
అమ్మా మాదాకబళం తల్లీ!
అయ్యా మాదాకబళం తండ్రీ
ఇంట్లో ఒంట్లో పద్యాలు ఆకలితో ఉన్నాయి
మీ పాద ధూళుల్ని బిచ్చమెయ్యండమ్మా
మీ కండల మీద ఎండిన చెమట తాలూకు
చిటికెడు ఉప్పు రేణువులు ఇవ్వండమ్మా
మీ ఎంగిలి రొట్టెముక్కని బిచ్చమెయ్యండమ్మా
అంటూ భిక్షాటన చేస్తుంటాడు
గని కార్మికుడి హెల్మెట్లో దీపం లాటి
జీవభాష ముందు మోకరిల్లి అడుగుతాడు
అమ్మా నీ పదాల పాదధూళులు
కాస్త బిచ్చమెయ్యి తల్లీ! అంటూ
ఆమె ఎవరైతేనేం అంటూ స్త్రీత్వం ముందు మోకరిల్లుతాడు
గురువేం జేస్తాడు
ఓ కంటి నుండి దుఃఖాశ్రువులు
ఇంకో కంటి నుండి ఆనంద బాష్పాలు
మూడోకంటి నుండి నిప్పులు కురుస్తూ
ఉన్మాదిగా ఏక కాలంలో నవ్వుతూ ఏడుస్తూ
కలుపుతాడు వాటిలో పాదధూళుల్ని చేస్తాడు
సంధ్యాకాశం ముందు నిలబడి
దోసెడు ఎర్రమబ్బుల్నీ సిరా సముద్రం మీద
తేలే యాపిల్ పండునీ జోలెలో వేసుకొస్తాడు
కొండ మీద నుంచి రేగుపళ్లు, ఈతపళ్లతో పాటు
మాగేసిన పదాల్ని, మాటల్ని తీసుకొస్తాడు నేల మీదకి
బుట్ట దించేసరికి నిజంగానే ఆయన కడుపులో
ఆవురావురంటూ ఎదురు చూస్తుంటారు అంతర్జనాలు
కొందరు పిడికిళ్లెత్తి నినాదాలు చేస్తుంటారు
కొందరు పొలాలు దున్ని విత్తులు చల్లుతారు
మహిళలు పాటలు పాడుతూ నాట్లు వేస్తుంటారు
కొందరు తమ నెత్తుటి దీపాలతో నక్షత్రాలై
చీకటి రాత్రుల శిరస్సున నర్తిస్తుంటారు
గురువేం జేస్తాడు
నెత్తిమీది పళ్ల బుట్టని దించి ముసలమ్మలా గొంతుక్కూర్చుంటాడు
ఒక్కో పదాన్ని ఒక్కో మనిషిలో ముంచి
ఒక్కో పద్యాన్ని బయటికి తీస్తాడు
గుప్పిళ్ల కొద్దీ పదబంధాలు రూపుకడతాడు
సామూహిక స్వప్నాల్లోంచి లేచిన నినాదాలకు
పద్యాల దేహాలనిస్తాడు
గురువేం జేస్తాడు..
అడవుల్లోకి పోయి విల్లమ్ముల రహస్యాలు వింటాడు
అడవి నిశ్శబ్దంలో నేత్ర ధనుష్టంకారాలు వింటాడు
గురితప్పని నేత్రాల్ని అక్షరాల దొన్నెల్లోకి పట్టుకుంటాడు
అడవిపూల రంగుల్లో సువాసనల్లో తేలే
ఊహల్ని మూటకట్టుకుని ఇంటికొస్తాడు
పోడు పొలాల మీద రక్తం సూర్యుడి గాయం నుండి
ఎర్రెర్రని సూర్యరక్త కణాలని
బుట్టలో నింపుకుని కొండ దిగుతాడు.
తల్లిపక్షి పిల్లల నోట్లో బువ్వ పెట్టినట్లు
విన్నవి కన్నవి తెచ్చినవి కలగలిపి
తన గూటిలోని అంతర్జనాలకు తినిపిస్తాడు
గురువేం జేస్తాడు.
ఖనిజాలు మింగుతాడు
లోహపు ముక్కలు మింగుతాడు
కొన్ని బుల్లెట్లు కూడా మింగుతాడు
ఫిరంగి గుండుని రెండు చేతుల్లో పట్టుకుని పిసికి
అగ్నిని పిండుకు తాగి
లోపలి కొలిమిని రాజేసేకుంటాడు
నాగళ్లని, కొడవళ్లని, నాటు తుపాకుల్ని
తయారుచేసి జనాలకిచ్చి పంపుతాడు.
హిమ ఖండాలకు పోతాడు
పెంగ్విన్ పక్షులతోపాటు బుడి బుడి అడుగులు వేస్తూ
మంచుబండల మీంచి సముద్రాల్లోకి జారతాడు
జల నిధుల మీద పొర్లుతాడు
సాగర గర్భ నిశ్శబ్దంలో ప్రవాళ ద్వీపాల మధ్య ధ్యానిస్తాడు
సాగరఘోషతో తన నిశ్శబ్దాన్ని శృతి చేసుకుంటాడు
అలల మీది తెల్లని నురుగు పూలు కోసుకొచ్చి
నత్తగుల్లల నెత్తిన కిరీటాలుగా అలంకరించి మురిసిపోతాడు
శంఖాల అరల్లో సంచరించి శబ్ద రహస్యాలనూ
సముద్ర గర్జనల్నీ పద బంధాలతో పట్టుకుంటాడు
పద బంధాలతో పగ్గాలు అల్లి తెర చాపలెత్తుతాడు
దిగంతాల మీది సూర్యోదయాల్లోకి నౌకల్ని నడిపిస్తాడు
బుడ్డోడు అన్నీ విప్పేసి కాలువలోకి దూకినట్లు
వంతెన కింద ప్రవహించే పద్యంలోకి దూకి ఈత కొడతాడు
ఛాతీ మీద చందమామని కూర్చోబెట్టుకుని
వెల్లకిలా నిశ్శబ్దంగా శవమీత కొడతాడు
గురువేం జేస్తాడు..
తానొక శిశువుగా మారి మాటల్ని చీకుతూ ఉంటాడు
ఒక ఊహ మెడ చుట్టూ చేతులు వేసి మారాం చేస్తాడు
ఒక పద్యం చంకలో అడవంతా తిరుగుతాడు
ఓ కవిత నెత్తి మీది ఇప్పపూల బుట్టలో కూర్చుని
ఊరేగుతూ ఊళ్లోకొస్తాడు
ఏక కాలంలో తల్లి కావడం
బుట్టలోని శిశువూ తానే కావడం చూయిస్తాడు
( కే శివారెడ్డి పుస్తకానికి స్పందనగా..)