మన్మోహన్సింగ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం 2014 సాధారణ ఎన్నికల ముందు (2014 ఫిబ్రవరిలో) ఏడవ వేతన సంఘాన్ని నియమించింది. ఆ సంఘం 2015 నవంబర్లో నివేదిక సమర్పించింది. 2014లో కొలువైన బీజేపీ ప్రభుత్వం 2016 జూన్లో దాన్ని క్యాబినెట్లో ఆమోదించి, 01-01-2016 నుంచి అమలుచేసింది.
భారతదేశంలో వేతన సంఘాలను ఏర్పాటు చేసేటప్పుడు ప్రభుత్వమే అనేక కట్టుబాట్లను (Terms of Reference – ToR) తీసుకురావడం, ఆర్థిక భారం పేరిట సిఫారసులకే పరిమితం చేయడం సాధారణ ప్రక్రియగా మారిపోయింది. దీనివల్ల ఉద్యోగులు, పెన్షనర్ల జీవన ఖర్చుకు అనుగుణంగా వేతనాలు / పెన్షన్లు పెరగకుండా కోట్లాది మంది ఆర్థిక ఇక్కట్లకు గురవుతున్నారు. ఎనిమిదవ వేతన సంఘం విషయంలోనూ ఇదే పద్ధతి కనిపిస్తున్నది. 8వ వేతన సంఘాన్ని ఏర్పాటు చేస్తామని 2024 జూలై 16న ఢిల్లీ శాసనసభ ఎన్నికల సమయంలో కేంద్రం ప్రకటించింది. కానీ, ఆ ప్రకటన వెలువడ్డాక 15 నెలల వరకు (2024 జూలై నుంచి 2025 అక్టోబర్ వరకు) ఏర్పాటు చేయలేదు.
బీహార్ అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని 2025 అక్టోబర్ 28న క్యాబినెట్లో ఆమోదించి, నవంబర్ 3న సంబంధిత గెజిట్ నోటిఫికేషన్ను కేంద్రం జారీచేసింది. ఇప్పుడు కమిషన్కు 18 నెలల గడువిచ్చారు. అంటే 2027 మే/జూన్లో ఆ నివేదిక వస్తుంది. ఒకవేళ 2028 జనవరి 1 నుంచి అమలవుతుందని అనుకున్నా, సుమారుగా 4245 నెలల ఆలస్యం అవుతుంది! ఈ ఆలస్యం వల్ల దాదాపు 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 70 లక్షల మంది పెన్షనర్లు, కేంద్ర వేతనాలను అనుసరించే 22 రాష్ర్టాల్లోని దాదాపు 1.8-2 కోట్ల రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు భారీగా నష్టపోతారు.
పనిచేసే ఉద్యోగుల కంటే పెన్షనర్ల ఖర్చు ఎక్కువ అని కేంద్రప్రభుత్వం ఒకవైపు చెప్తున్నది. 202526 బడ్జెట్లోనే పెన్షన్లకు రూ.2.35 లక్షల కోట్లు, జీతాలకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. రెండూ దాదాపు సమానంగానే ఉన్నాయి. అయినా 8వ వేతన సంఘం పెన్షనర్ల ప్రయోజనాలను తగ్గించేలా ప్రభుత్వం నిబంధనలు విధించే అవకాశం కనిపిస్తున్నది. అంతేకాదు, 2026 జనవరి 1కి ముందు రిటైర్ అయినవారికి పూర్తి డీఏ (కరువు భత్యం) ఇవ్వకుండా, లేదా ఇతర సంక్షేమ పథకాల నుంచి మినహాయించేందుకు ప్రభుత్వం చట్ట సవరణలకు ప్రయత్నిస్తున్నదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
బీజేపీ ప్రభుత్వం 2025 మార్చి 25న పార్లమెంట్లో ఆమోదం తెలిపిన ఫైనాన్స్ బిల్లు 2 నిబంధనలను సవరించి.. 2026 జనవరి ఒకటి కంటే ముందే రిటైర్ అయిన ఉద్యోగులకు ఎనిమిదవ వేతన సిఫారసులు వర్తించకుండా చర్యలు తీసుకునే అధికారం కేంద్రం తీసుకున్నది. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాం టి పెన్షన్ హెచ్చింపు లేకుండా కోట్లాది కుటుంబాలకు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పెన్షనర్లు, ఉద్యోగులను ఇప్పటికే వివిధ రకాలుగా విభజించింది. ఇది కోట్లాది మంది పొట్ట కొట్టడం తప్ప మరొకటి కాదు. ఇలాంటి చర్యలను ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
రాజకీయ లబ్ధి కోసం ఉద్యోగుల డిమాండ్లపై ఎన్నికల సమయంలోనే చర్యలు తీసుకోవడం, మిగతా సమయంలో కాలయాపన చేయడం దురదృష్టకరం. దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన ఉద్యోగులు, పెన్షనర్ల పట్ల నిజమైన సానుకూల దృక్పథం చూపించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది.
మరోవైపు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల బాధ వర్ణనాతీతం. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఉద్యోగులకు ఆరు నెలల్లో పీఆర్సీ ఇస్తామని, కరువు భత్యం చెల్లిస్తామని, పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని, హెల్త్ కార్డులు ఇస్తామని ఆ పార్టీ నేతలు హామీ ఇచ్చారు. కానీ, రెండేండ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలుపై ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు. దేశంలోనే కరువు భత్యం బకాయిలు అత్యధికంగా పెండింగ్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ ఉండటం దారుణం.
హెల్త్ కార్డులు, సీపీఎస్ రద్దు లాంటి అంశాలపై ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అయినా పాలకుల్లో ఉలుకు పలుకు లేదు. రాష్ట్రంలో రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. 2024 మార్చి నుంచి రిటైర్ అయిన ఉద్యోగులకు రావలసిన పెన్షన్ బకాయిలతో పాటు తమ అవసరాల కోసం దాచుకున్న సొమ్మును కూడా ఇవ్వకుండా సర్కార్ వేధిస్తున్నది. రెండేండ్లుగా తమకు రావలసిన డబ్బులు ఇవ్వకపోవడంతో 26 మంది పెన్షనర్లు మానసిక క్షోభతో అనారోగ్యానికి గురై మృతిచెందడం తీవ్రంగా కలచివేస్తున్నది. వందలాది మంది పెన్షనర్లు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి న్యాయస్థానాలను ఆశ్రయించారు. వారికి అనుకూలంగా తీర్పులు వచ్చినా ప్రభుత్వం మాత్రం కనికరించకుండా కాఠిన్యాన్ని ప్రదర్శించింది.
ఉద్యోగ సంఘాల నాయకులు అనేక సందర్భాల్లో ముఖ్యమంత్రితోపాటు చాలామంది మంత్రులను కలిసి, సమస్య తీవ్రతను వివరించి, పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కానీ, ప్రభుత్వం తూతూమంత్రంగా మంత్రులు, అధికారుల కమిటీలు వేసి కాలయాపన చేస్తున్నది. ఉద్యమ కార్యాచరణ కోసం ముందుకెళ్తే బెదిరింపులకు దిగుతున్నట్టు, హెచ్చరికలు జారీచేస్తూ సంఘాలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు పెన్షనర్ల జేఏసీని ఏర్పరుచుకొని నవంబర్ 17న ధర్నా నిర్వహించి ప్రభుత్వాన్ని వారు హెచ్చరించారు. అయినా ప్రభుత్వం మాత్రం స్పందించకపోవడం శోచనీయం.
కేసీఆర్ ప్రభుత్వం పదేండ్లలో అనేక సమస్యలు పరిష్కరించి రెండు పీఆర్సీలు 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. సకాలంలో పీఆర్సీ వేసి 5 శాతం మధ్యంతర భృతి అమలు చేసింది. కరోనా వల్ల వచ్చిన ఆర్థిక మాంద్యం కారణంగా ఒకటవ తేదీన వేతనాలు ఇవ్వడంలో కొంత జాప్యం జరిగింది. కానీ, ఇప్పుడు కొంతమందికే ఒకటవ తేదీన జీతాలు ఇస్తూ, 4.17 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్, ఇతర ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వేధిస్తున్నది.
ఈ నేపథ్యంలో తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై పోరాడేందుకు బలమైన ఉద్యమ కార్యాచరణను రూపొందించాల్సిన అవసరం ఉంది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు (బడే భాయ్, చోటే భాయ్) అవలంబిస్తున్న ఉద్యోగ, పెన్షనర్ల వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ఉద్యోగులు ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. పోరాడితే పోయేదేమీ లేదు, మన సమస్యలు తప్ప.
(వ్యాసకర్త: ఉద్యోగ సంఘాల జాక్ పూర్వ చైర్మన్)
– దేవీప్రసాద్