కేంద్ర బడ్జెట్ (2022-23) ఎప్పటి లాగే భాగ్యనగర వాసులకు భరోసా కల్పించకపోగా బాధను మిగిల్చింది. బడ్జెట్లో ప్రత్యేకంగా హైదరాబాద్ నగరానికి నిధులు ఇస్తారేమోనని ఎదురు చూసిన నగర వాసులకు నిరాశ కలిగించారు. రూ.39.49 లక్షల కోట్ల బడ్జెట్లో కనీసం మూడు రూపాయలు కూడా హైదరాబాద్‌కు కేటాయించలేదు.
తె లంగాణ రాష్ట్రం నుంచి సమకూరే దాదాపు లక్ష కోట్ల పన్నుల్లో 60-65 శాతం ఒక్క హైదరాబాద్ మహానగరం నుంచే వస్తుంది. అందులో కనీసం 10వ వంతైనా నిధులు సమకూరుస్తామోనన్న ఆశ సగటు ప్రజానీకంలో కలగటం సహజం. కానీ, కేంద్రం కక్షకట్టినట్లుగా నిధులు కేటాయించకపోవడం వివక్షా పూరితమే.
నగరంలో మౌలిక వసతుల కల్పనకు, రోడ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపినప్పటికీ కేంద్రం ఏ మాత్రం పట్టించుకోలేదు. నగర శివారు ప్రాంతాల్లో చేపట్టిన లింక్ రోడ్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు, ఔటర్ రింగ్ రోడ్డు మెరుగుపర్చడానికి 104 అదనపు కారిడార్లను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఈ రోడ్ల కనెక్టవిటీ ద్వారా అర్బన్ రోడ్ల కనెక్టవిటీకి రూ.11,500 కోట్లతో మూసీ నదిపై స్కేవే, నదికి ఇరువైపులా 16 కిలోమీటర్ల గ్రేడ్ సెపరేట్ల నిర్మాణం, సీనరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ నిర్మాణాలకు అయ్యే వ్యయం రూ. 8,684.54 కోట్లలో కేంద్రం మూడో వంతు భరించాలని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కోరారు. అన్నింటికి కలిపి దాదాపు రూ.34,500 కోట్ల ప్రతిపాదనలు పంపినా ఒక్క ప్రాజెక్టుకు కూడా నిధు లు కేటాయించలేదు. మూసీ ప్రక్షాళన, సుందరీకరణకు నిధులు కేటాయిస్తుందని భావించినా ఆశాభంగమే మిగిలింది. ఇది తెలంగాణ పట్ల కేంద్రం పక్షపాత వైఖరికి ప్రత్యక్ష నిదర్శనం.
బడ్జెట్లో మధ్యతరగతి ప్రజలకు, బడుగు, బలహీన వర్గాలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండిచేయి చూపారు. కరోనా పరిస్థితులు, పరిణామాలతో పరిశ్రమలు పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేయడం లేదు. ఈ పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా, దేశీయ డిమాండ్‌ను పెంచేలా బడ్జెట్లో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతున్నా, వీటిపై దృష్టి సారించడంలో బడ్జెట్ విఫలమైంది. పట్టణాల్లో కూడా ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాల్సింది పోయి, అందుకు భిన్నంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపుల్లో 25 శాతం కోత పెట్టడం విడ్డూరం.
రెవెన్యూ వసూళ్లు ప్రాథమికంగా పెరిగాయి. పెరిగిన పన్ను వసూళ్లు చూస్తుంటే కరోనా సమయంలో కూడా జీఎస్టీ ద్వారా రెవెన్యూ వసూళ్లు పెరిగాయంటే, ఈ కాలంలో కార్పొరేట్లు ఎంతగా లాభాలు దండుకున్నారో స్పష్టమవుతున్నది. ఓవైపు పరిస్థితి ఇలా ఉంటే, మరోవైపు సామాన్యులపై పరోక్ష పన్నులతో పెట్రోలియం ధరలు పెంచేసింది మోదీ సర్కార్.
రెవెన్యూ వసూళ్లతో పోల్చుకుంటే ఖర్చు చేసిన మొత్తాలు చాలా తక్కువ. నిజానికి గతేడాది సవరించిన అంచనాల కన్నా కూడా ఇది చాలా తక్కువ. వ్యయాన్ని కుదించడమనేది కేంద్రప్రభుత్వ వ్య యంతోనే ఆగలేదు. రాష్ర్టాలకు వనరుల బదిలీలను కూడా తగ్గించారు! రైతులకు ఉద్దేశించిన అన్ని ప్రధాన పథకాల కేటాయింపులకు ఈ బడ్జెట్లో కోత పడింది. ఎఫ్‌సీఐ సేకరణల కోసం, వికేంద్రీకరణ సేకరణ పథకం కింద కేటాయింపు 28 శాతం కుదించారు. కనీస మద్దతు ధరకు చట్టపరంగా హామీ కల్పించాలని రైతాంగం పోరాడుతున్న సమయంలో ఈ కేటాయింపులపై కోత పెట్టడం దారుణం. ఎరువుల సబ్సిడీకి నిధుల కేటాయింపు కూడా 25 శాతం మేర తగ్గింది. పంటల బీమా పథకం కేటాయింపుల్లో రూ.500 కోట్లు కోత పడటం గమనార్హం.
‘పీఎం పోషణ్’గా చెప్పుకొనే మధ్యాహ్న భోజన పథకానికి కూడా కేటాయింపులు పెరగలేదు. 2 లక్షల అంగన్వాడీలను ఆధునీకరించే నారీశక్తి కార్యక్రమం గురించి గొప్పగా మాట్లాడిన ఆర్థిక మంత్రి, కేటాయింపులు దగ్గర కొచ్చేసరికి రూ.20వేల కోట్లే ఇచ్చారు. గత రెండేండ్లలో కొవిడ్ కారణంగా సంపన్నులు మరింత కుబేరులుగా మారారు. దేశంలోని సంపన్న కుటుంబాల ఆస్తులు 2021లో రికార్డు స్థాయిలో పెరిగాయి. భారత్‌లోని మొదటి 10 మంది వ్యక్తుల వద్దే 57 శాతం దేశసంపద పోగుపడింది. వీరికి ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిన సూపర్ లాభాలపై పన్ను విధించే ప్రతిపాదనేదీ బడ్జెట్లో లేదు. అలా పన్ను విధింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆకలితో అలమటించే మెజారిటీ ప్రజలకు ఊరట కలిగించేందుకు ఉపయోగించవచ్చు కానీ,దానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదు. సామాన్యులకు ఉపశమనం కలిగించే చర్యల ప్రాధాన్యతలను గుర్తించడంలో ఈ బడ్జెట్ పూర్తిగా విఫలమైంది.
బడ్జెట్‌ను పరిశీలిస్తే అసలు తెలంగాణ అనే ఒక రాష్ట్రం ఉన్నదనే విషయాన్నే మరిచిపోయినట్లు వ్యవహరించింది కేంద్రం. రాష్ర్టానికి నిధుల కేటాయింపులే లేకపోగా, ఉన్న అరకొరల్లోనూ కోత విధించడం గర్హనీయం.
ఇది దేశ బడ్జెట్ కాదు, బీజేపీ పాలిత రాష్ర్టాలకు మాత్రమే కేటాయింపులు చేసిన బడ్జెట్. యూపీ తదితర ఐదు రాష్ర్టాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ కూర్పు చేశారన్నది స్పష్టంగా అర్థమవుతున్నది. బడ్జెట్ కూర్పే ఫెడరల్ స్పూర్తికి విరుద్ధంగా ఉన్నది. బీజేపీ నేతలు తమ చర్యలతో దేశాన్ని తిరోగమనంలో నడిపిస్తున్నారు. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ తన బాధ్యతగా కేంద్రం చేస్తున్న అన్యాయం మీద ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలకు వివరించారు. కేంద్రం వివక్ష నుంచి రాష్ర్టాలను, దేశాన్ని రక్షించటానికి సమాయత్తమయ్యారు.
– మాగంటి గోపీనాథ్
(వ్యాసకర్త: జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే)