CM Revanth Reddy | అబద్ధాలు చెప్పడం, దుష్ప్రచారాలు చేయడంలో కాంగ్రెస్ నాయకులను, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని మించినవారు లేరు. అలవిగాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన హస్తం నేతలు ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు నానా తంటాలు పడుతున్నారు. హామీలను అమలుచేయలేక కేసీఆర్‌పై విషం గక్కే కార్యక్రమాన్ని ముందటేసుకున్నారు. అందుకే సీఎం రేవంత్‌రెడ్డి రోతపుట్టించేలా మాటలు మాట్లాడుతూ, రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు.
ఆరు గ్యారంటీలను వెంటనే అమలు చేయాలని ప్రతిపక్ష బీఆర్ఎస్ అడుగడుగునా నిలదీస్తుండటంతో కాంగ్రెస్ సర్కార్ డైవర్షన్ రాజకీయాలకు తెరదీసింది. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, ఇతర బీఆర్ఎస్ నేతలపై వ్యక్తిగత దూషణలకు దిగడం, సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఈ కోవలోనివే. తన హోదాను మరిచి రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తింది.
గతంలోనూ రేవంత్‌రెడ్డి ఇలా మాట్లాడటాన్ని మనం చాలాసార్లు చూశాం. దురదృష్టవశాత్తు గతంలో కాలుజారి కేసీఆర్ పడిపోతే.. అసెంబ్లీకి రాలేక ముఖం చాటేస్తున్నారంటూ హేళన చేశారు. ఇప్పుడు తాజాగా రాజీవ్‌గాంధీ జయంతి కార్యక్రమంలో చిన్నారుల ముందు మరోసారి జుగుప్సాకరంగా మాట్లాడారు.
అధికారం కట్టబెట్టిన ప్రజలకు మంచి చేయకుండా ప్రతిపక్ష నేతలపై బురదజల్లే కార్యక్రమం ముందటేసుకోవడాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పాలకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శల పట్ల ప్రజల్లో అసహనం మొదలైంది. మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రజల బతుకుల్లో మార్పులు తేవాల్సిందిపోయి… పేర్లు, చిహ్నాల మార్పుతో భవిష్యత్తు తరాలకు తెలంగాణ అస్తిత్వం, సంస్కృతి గురించి తెల్వకుండా చేయాలని కుట్ర పన్నుతున్నది. మొన్నటి వరకు తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పాలకులు.. ఇప్పుడు ఏకంగా సచివాలయం ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి బదులు రాజీవ్‌గాంధీ విగ్రహం పెట్టే దుస్సాహసం చేస్తున్నారు. ఇవన్నీ తెలంగాణ సమాజాన్ని అవమానించడమే.
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి, సంక్షేమంపై దృష్టిపెట్టాలి. ఆరు గ్యారంటీలతో పాటు ఇచ్చిన ఇతర 400 హామీలను అమలు చేయాలి. కేసీఆర్పైనో, గత బీఆర్ఎస్ సర్కార్పైనో అభాండాలు వేస్తూ ఎంతోకాలం కాలయాపన చేయలేరు. ఈ విషయాన్ని పాలకులు గ్రహించాలి. రోత మాటలు, రెచ్చగొట్టే ప్రసంగాలు తెలంగాణ సమాజానికి మంచివి కావు.
కేసీఆర్ గుర్తులను చెరిపేస్తానని పదేపదే చెప్తున్న రేవంత్ రెడ్డి ఒక్క విషయాన్ని తెలుసుకోవాలి. కేసీఆర్ గుర్తులను చెరిపేయడమంటే.. తెలంగాణ అస్తిత్వాన్ని కాలరాయడమే. ఆత్మగౌరవం కోసం సబ్బండ వర్గాలు చేసిన పోరాటాన్ని చరిత్ర పుటల్లో నుంచి కనుమరుగు చేయడమే. తెలంగాణ అస్తిత్వానికి ముప్పు వాటిల్లిన ప్రస్తుత తరుణంలో మరోసారి తెలంగాణ సమాజం ముక్తకంఠంతో నినదించాల్సిన అవసరం ఉంది.
– సంపత్ గడ్డం
78933 03516