ప్రపంచీకరణ పెరుగుదలలో సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ కారణాలతో ఏ నైపుణ్యాలు సంతరించుకోని సామాన్యులు వెనుకబడి, గొప్ప, పేదవర్గాల మధ్య అంతరాలు పెరిగినా, మానవులందరికీ జరిగిన మేలు మాత్రం ఒకటుంది. సాంకేతిక అభివృద్ధి వల్ల దేశాల మధ్య దూరాలు తగ్గడమే కాకుండా, ప్రపంచంలో జరిగే విషయాలను అందరూ గమనించే వెసులుబాటు కలిగింది. విదేశాల్లో భారత ప్రధాని మోదీకి బ్రహ్మరథం పడుతున్నారన్న వార్తలు విన్నప్పుడు 80 శాతంపైన ఉన్న సామాన్య భారతీయులకు ఆనందం కంటే ఆశ్చర్యం కలుగుతున్నది. ‘ఇంట్లో ఈగల మోత బయట పల్లకీల మోత’ ఎలా సాధ్యం? ఎవరైనా ‘ఇంట గెలిచి, రచ్చ గెలవాలి కదా?’
ఒక చిన్న విషయం. కేంద్రం ప్రకటించే పద్మ అవార్డుల వల్ల ఎవరికీ వచ్చేదీ లేదు, పోయేదీ లేదు. ఎంతో సేవ చేసిన వారికి జీవితం చివరిభాగంలో ఒక గుర్తింపు. మరణానంతరం ఇచ్చేవయితే ఎవరికీ ఉపయోగపడవు! కానీ కేంద్ర ప్రభుత్వం అందులో కూడా అపరిమిత వివక్ష చూపింది. తెలంగాణకని ఇచ్చిన ఐదు అవార్డుల్లో ఒక్కరు మాత్రమే తెలంగాణ వ్యక్తి మిగతా నలుగురూ వేరే రాష్ర్టాలకు చెందినవారే! ఇదీ కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ మీద ప్రేమ! గమనించండి!
భారత్ ఇంత దయనీయ స్థితిలో ఉంటే, మోదీకి ఏ విషయంలో ఖ్యాతి కలుగుతున్నది? అయితే వారి విదేశీ ప్రసంగాలు వింటే, బీజేపీ పాత నినాదం ‘ఇండియా షైనింగ్’కు మెరుగులు పెడ్తూ ప్రచారం చేస్తున్నారని అర్థమవుతున్నది. భారత్ నిజంగానే వెలిగిపోతున్నదా అన్నది ఈ కింది నిజాలు చూస్తే అర్థమవుతుంది. ఇవి మోదీకి, భారతదేశానికి వ్యతిరేకులని పేరు పడ్డ భారతీయ మేధావులు చెప్పినవి కావు. ప్రఖ్యాత సంస్థలు సర్వేల ద్వారా వెలువరించిన ప్రపంచ సూచీలు.
ప్రాణులు బతకటానికి కావలసినది ఆహారం. కానీ, సారవంతమైన భూమి, జీవనదులు, వర్షపాతం, కష్టించే రైతులు, కావలసినంత విద్యుచ్ఛక్తి కలిగిన భారతదేశం 2021 ఏడాది ప్రపంచ ఆకలి సూచీలో 121 దేశాల జాబితాలో 101 స్థానంలో ఉండి, 2022లో 107వ స్థానానికి దిగజారింది.
లింగవివక్ష సూచీలో 156 దేశాల్లో 140వ స్థానంలో ఉన్న దేశం.. 2022లో 146 దేశాల్లో 135వ స్థానానికి పడిపోయింది. ‘యత్ర నార్యస్తు పూజ్యంతే, రమంతే తత్ర దేవతా!’ మరి బీజేపీ వాళ్లు పదే పదే చెప్పే దేవుళ్లు ఇంకా ఉన్నారా ఈ దేశంలో? 3.అధిక జనాభాలోనే కాదు, పేదల సంఖ్యలో కూడా భారత్ 1వ స్థానాన్ని గెలుచుకున్నది. 22 కోట్ల 89 లక్షల మంది అతి పేద స్థితిలో ఉన్నారు.
వీరికి పథకాలేవీ లేని మోదీ ప్రపంచానికంతా అన్నం పెడుతారట! ‘అమ్మకు అన్నం పెట్టకుండా, పినతల్లికి పట్టువస్ర్తాలు!’ అన్నట్లుగా..ఇక ప్రసార మాధ్యమాలకు ఉన్న స్వేచ్ఛ విషయంలో 180 దేశాల్లో 150వ స్థానంలో ఉన్నదీ దేశం. ఒక ప్రజాస్వామ్య దేశంలో భావప్రకటన స్వేచ్ఛ లేకపోతే దాన్ని ‘డెమో క్రసీ’ అని అనలేం. ‘మోక్రసీ’ అనవచ్చు. అం టే పౌర హక్కులకు రాజకీయ సంకెళ్లు వేసిన ట్టు అర్థం. దీన్ని అనేక విషయాలు పరిశీలించి స్థానాన్ని నిర్ణయిస్తారు. ఆ స్కోరు 2018లోనే బాగా తగ్గి 42 పాయింట్లు ఉంటే 2022 నాటికి 33కు పడిపోయింది. ఇది ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ రోజుల నాటి స్కోరు. అంటే ప్రస్తుతం భారతదేశంలో ‘అప్రకటిత ఎమర్జెన్సీ’ ఉందన్నమాట.
ఇలా ఉన్న దేశం సంతోష సూచికలో ఎక్కడుంటుంది? 140 దేశాల పట్టికలో 136వ స్థానాన్ని పొంది ఆనందంగా సాగిపోతున్నది. దక్షిణాసియా దేశాల్లో భారత్ తర్వాతి స్థానంలో తాలిబన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్థాన్ ఒక్కటే ఉన్నది. అంటే వెలుగులు చిమ్ముతున్నదని విదేశాల్లో ప్రచారం చేస్తున్న విశ్వ గురు పరిపాలనలోని భారతదేశం తాలిబన్ల దేశం కంటే ఒక్కటే స్థానం పైన ఉన్నది. బీజేపీ పదేపదే ప్రవచించే సనాతన ధర్మంలో కేవలం నేరం చేసిన వారిని శిక్షించమని ఉన్నది. మరి హిందూ మత మౌఢ్యాన్ని పెంచుతూ, ఇతర మతాల వారిపట్ల వివక్ష చూపించే బీజేపీ అనుసరిస్తున్నది ఏ ధర్మం? ఇలా విద్వేషాలు రెచ్చగొట్టి మనుషులను విడదీస్తే భారతదేశం ఎప్పటికైనా ఆనందంగా జీవించే దేశాల పట్టికలో చేరగలదా? దీనికి కారణం ఎవరు? ఈ ప్రశ్నకు జవాబు వెతకాలంటే బీజేపీ కంటే ముందు సుదీర్ఘకాలం పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలే కాక, రెండుసార్లు ఎన్నికలు గెలిచి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ విధానాలు కూడా విశ్లేషించాలి. అంతకంటే ముందు ప్రజలంతా ఏ ఆర్థికస్థాయిలో ఉన్నారో పరిశీలిద్దాం.
తొమ్మిదేండ్ల బీజేపీ పాలన తర్వాత అంకె లు ఈ విధంగా ఉన్నాయి. దేశంలో ఉన్న 77 శాతం సంపద జనాభాలోని 10 శాతం వ్యాపారస్థులకు చేరింది. ఇదివరకు ఉన్నత స్థితిలో ఉన్న కుటుంబాలు ఆర్థికంగా దిగజారి 14 శాతం ఉన్న మధ్యతరగతి వారు 31 శాతం అయ్యారు. ఇది 2021-2022లో తేలింది. దిగువ మధ్యతరగతి వారు 41 శాతం ఉన్నారు. అయితే నిజంగా విచారించవలసిన విషయం గత తొమ్మిదేండ్లలో దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారు 16 నుంచి 27.5 శాతానికి పెరిగారు. ఈ లెక్కలు ఏం సూచిస్తున్నాయి? కొన్ని రాష్ర్టాలు-తెలంగాణ, బీహార్, ఒడిశా వంటివి ప్రగతి సాధిస్తుంటే, మరికొన్ని రాష్ర్టాలు-యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి బీజేపీ పాలిత రాష్ర్టాలు-వాటికున్న వనరులను కూడా ఉపయోగించుకోవటం లేదు. మోదీ పాలనకు సంబంధించిన కొన్ని అంశాలు పరిశీలిస్తే ఈ అంతరాలకు కారణాలు దొరుకుతాయి.
సుమారుగా 67 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.62,78,553 కోట్ల అప్పులు చేస్తే, బీజేపీ ప్రభుత్వం తొమ్మిదేండ్ల పాలనలోనే రూ.84,41,360 కోట్లు చేసింది. మరి ఆ డబ్బులు ఏ అభివృద్ధి పథకాలకు, ఏ సంక్షేమాలకు ఖర్చు చేసిందో శ్వేతపత్రం విడుదల చేయగలదా కేంద్ర ప్రభుత్వం?
మోదీ ప్రభుత్వం మొదటి ధక్కా నోట్లరద్దు అనే పథకంతో మొదలైంది. నల్లధనాన్ని అరికట్టి, ఉగ్రవాదాన్ని రూపుమాపటానికి పనికివస్తుందని డబ్బాకొట్టిన పథకం ఇది. క్యూలల్లో నిలబడి అలసి సొలసి 742 మంది ప్రాణాలు పోగొట్టుకోవటం, చిన్నవ్యాపారులు, వీధి అమ్మకందారులు దాదాపు 35 లక్షల మంది ఉపాధి కోల్పోవటం, మధ్య తరగతి వారు దెబ్బతినటం జరిగిందే కానీ, ఒరిగిందేమీ లేదు దీనివల్ల.
ప్రభుత్వరంగ సంస్థలను అమ్మటానికి మోదీ చెప్పిన కారణం కేంద్రం వ్యాపారాలు చేస్తూ కూర్చోలేదనీ, పాలన చెయ్యాలనీ! అయితే దానికీ ఇంకోమార్గం ఉన్నది. కుబేరులకు టాక్సులు తగ్గించి, వారికి ఈ సంస్థలు నడిపే బాధ్యత అప్పగించవచ్చు. 100 కోట్ల ఆదాయం ఉంటే ఒక పాఠశాల, 500 కోట్ల ఆదాయం ఉన్నవారు ఒక కళాశాల, 1000 కోట్ల ఆదాయం దాటినవారు ఒక వైద్యశాల స్థాపించి నడపాలని నిబంధన పెట్టవచ్చు. దాన్ని పర్యవేక్షించటానికి స్థానిక ప్రజల్లోంచి విద్యావంతులను, ఇద్దరు ప్రభుత్వాధికారులను నియమించవచ్చు. ఇదేవిధంగా వర్సిటీ లు కూడా అపర కుబేరులు నడపవచ్చు. కానీ అధికారం, నిబంధనల రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉండాలి. అప్పుడు కేంద్రం వ్యాపారాలు చేస్తూ సమయం వృథా చేయనక్కరలేదు. ఈ విద్యాసంస్థలు కూడా సామాన్యులకు అందుబాటులో ఉండేటట్టు రాష్ట్ర ప్రభుత్వాలు శ్రద్ధ తీసుకోవాలి. కేంద్రానికి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం తన ఆదాయంలోంచి 10 శాతం ఇచ్చి ఈ సంస్థలన్నిటినీ సక్రమంగా పర్యవేక్షించాలి.
వ్యవసాయరంగం కూడా రాష్ట్ర ప్రభు త్వ అధీనంలో ఉండి, ఎవరికి తగిన నిబంధనలు వారు చేసుకునేలా ఉంటే రైతులు రోడ్ల మీద ధర్నాలు చేయనక్కరలేదు. 5.కేంద్ర ప్రభుత్వ జోక్యం కేవలం రెండు రాష్ర్టాల మధ్య తగాదాలు వస్తే సమన్వయకర్తగా మాత్రమే ఉండాలి. రాష్ట్ర వనరులు కేంద్రం కొల్లగొట్టేటట్టు ఉండకూడదు.
మోదీ రాజకీయం ఎలా ఉందో చూద్దాం!: 1.అప్పు తెచ్చిన లక్షల కోట్లు ఏ పథకానికి పెట్టారో ఆయన మనసులో ఉన్నది కానీ, ‘మన్ కీ బాత్’లో చెప్పలేదు. 2.రాష్ర్టాల అధికారాలు హస్తగతం చేసుకొనే విధానాలే కాక, రాష్ర్టాల పట్ల వివక్ష అమితంగా చూపిస్తున్నారు. 3.రైతుల సబ్సిడీలు తగ్గించి, వ్యాపారుల రుణాలు మాఫీ చేస్తున్నది. మధ్యతరగతి యువతకు ఉద్యోగ కల్పన పథకాలు ఏమీ రూపొందించకుండా, నిరుద్యోగం ఎన్నడూ లేనంత పెరిగేటట్టు చేసింది కేంద్రం. 5.అన్ని అరాచకాల్లో మోదీ చేస్తున్న రెండు పనులు మాత్రం దేశాన్ని అనాగరికంగా మార్చటానికి బాటలు వేస్తున్నాయి. ఒకటి ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వాలను కూల్చడం, రెండు దేశంలో మత విద్వేషాలు రగల్చడం.
సరైన విధానాలు లేకుండా ఒక పెద్ద ప్రజాస్వామ్యాన్ని, అధిక జనాభా, అత్యంత వైవిధ్యమున్న ప్రజలను పాలించటంలో పూర్తిగా విఫలమైన బీజేపీ, మోదీ పాలన ఇంకా సాగితే 90% ప్రజలకి అధోగతే. అయితే ఒకటే ఆశ. కాయ పండవక మానదు. ఉబికే లావా ఎక్కువయితే అగ్నిపర్వతం బద్దలవక ఊరుకోదు. అదానీతో మొదలయిన కార్చిచ్చు ఆయనకు దోహదపడ్డవాళ్ళని అంటకపోదు. నాటకం అయిపోయాక పాత్రధారులందరూ వేదిక మీదకి రావలసిందే! ఈ లోపల ప్రజలు అప్రమత్తంగా ఉండి ఎన్నికల్లో సరైన నిర్ణయం తీసుకోవటానికి సిద్ధపడాలి.
-కనకదుర్గ దంటు
89772 43484