అడుగులో అడుగువేస్తూ సముద్రం ఒడ్డున నడుస్తుంటే
పాదాల జ్ఞాపకాలను అమాంతం అలలై తనలో
కలిపేసుకుంది సాగరం.
పాదాల గుర్తులను వెతుక్కుంటూ వెళ్తే
నిశ్శబ్దంలా నన్నే చూస్తుంది అంబుధి.
కన్నీటి వరదలు కాలువలై పారుతుండే
తనలో కలుపుకొని చింతిస్తుంది కడలి.
అందనంత దూరాన ఏ చూపునకు చిక్కని
జలనిధి నింగిని తాకుతుందేమో అన్నట్లు కనిపిస్తోంది.
జీవిత ప్రయాణం కూడా అలాగే సాగుతుంది.
ఆశల అలలపై ఎగిసిపడుతుంది.
ఎక్కడో చివరాఖరి అంచుల్లో మిగిలిన జ్ఞాపకాలన్నింటినీ
చెరిపేస్తుంది దుఃఖ సాగరం.
ఒక్కోసారి కష్టాల కడలి కన్నీటివానై కురుస్తుంది.
ఎడతెరపి లేకుండా నిలువునా తడిపివేస్తుంది.
దేహం నుండి రాళుతున్న స్వేదపు చుక్కలు చుట్టూ ప్రవాహమై ప్రవహిస్తున్నా
గొంతు తడవడం లేదు.
బతుకు దాహాన్ని తీర్చడం లేదు.
ఎన్ని ప్రవాహాల ప్రళయాలు కురుస్తేనేమి.!
కాస్త నీటిపూల వానై కురిసి.. ఎదలో రగులుతున్న
నిప్పుల కష్టాల కొలిమిని ఆపుతుందని
ఆశతో ఎదురుచూస్తూ… సాగుతుంది
కన్నీటి బతుకు ప్రయాణం..
– అశోక్ గోనె, 94413 17361