ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన సమయం రానే వచ్చింది. మంగళవారం నుంచి సిద్దిపేటలో రైలు కూత వినిపించింది. ఆరు దశాబ్దాల సిద్దిపేట కల స్వరాష్ట్రంలో నెరవేరింది. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు నిరంతర పర్యవేక్షణ, పట్టుదలతో సిద్దిపేట రైల్వే లైన్ సాకారమైంది.
గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు రైల్వే లైన్ కోసం కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేయలేకపోయారు. దీనివల్ల దశాబ్దాలుగా సిద్దిపేటకు రైల్వే సేవలు అడియాసగా ఉండేవి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి కారణంగా మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు కొత్త రైల్వే లైన్ మంగళవారం ప్రారంభమైంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు పుష్పుల్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మార్గంలో రెండు రైళ్లను నడిపేందుకు రైల్వే శాఖ పచ్చ జెండా ఊపింది.
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లన్నను ప్రతి సంవత్సరం 25 లక్షల మందికి పైగా భక్తులు దర్శించుకుంటారు. అయితే ఈ పుణ్యక్షేత్రానికి సరైన ప్రయాణ సౌకర్యాలు లేక భక్తులు తిప్పలు పడుతున్నారు. రాజీవ్ రహదారి నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రానికి చేరుకోవడానికి, తిరిగి వెళ్లేందుకు ప్రధాన రహదారిపై గంటలకొద్దీ నిరీక్షించాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పుడు సిద్దిపేటకు రైలు సర్వీసులు అందుబాటులోకి రావడం వల్ల భక్తులకు సమయంతో పాటు డబ్బులు ఆదా అవుతాయి. ఈ ప్రాంతానికి రైలు మార్గం వేయడం వల్ల ఎరువుల సరఫరా రైళ్ల ద్వారానే జరుగుతుంది. ధాన్యం ఎగుమతులకు ఊపు లభిస్తుంది. సిద్దిపేటలో కూ డా రైల్వే ద్వారా సరుకు రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలించేందుకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
-ఆలేటి రమేశ్
99487 98982