బీహార్ ఎన్నికల ఫలితాలు ఇట్లా వస్తాయని ఎవ్వరూ కనీసం ఊహించలేదు. విపక్ష పార్టీలు ఇంతలాదెబ్బతింటాయనే ఆలోచన కూడా బహుశా అధికులకు రాలేదు. ప్రజల మనస్సులో ఉన్న భావం ఏమిటో అధికార, విపక్షాలు కూడా అన్ని ఎగ్జిట్ పోల్స్ సైతం ఈ స్థాయి విజయం ఎన్డీయే సొంతమవుతుందని చెప్పలేదు. ఇంత భారీ మెజారిటీని సొంతం చేసుకుంటామని ఎన్డీయే మిత్రులు సైతం అంచనా మీడియా బట్టి అర్థమవుతున్నది. బీహార్ ఎన్నిక ఫలితాలపై కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావించాలి. అంతేకాదు, వాటిగురించి కొంత లోతుగా చర్చించాలి.
భారత రాజకీయాల్లో లాలూ, ములాయం సింగ్‌లు ప్రత్యేక ముద్రను కలిగి ఉన్నారు. వీరిద్దరూ లోహియా రాజకీయా ఆలోచనతో ఉన్నవారు. జయప్రకాశ్ నారాయణ రాజకీయ ప్రభావమూ వీరిపై ఉందని ఉత్తరాది వారు చెప్పుకొంటారు. ప్రస్తుతానికి లాలూ గురించి మాట్లాడుకుందాం. సమోసాలో ఆలు ఉన్నంతవరకు బీహార్‌లో లాలూ ఉంటారని ఆయనే చెప్పుకొన్నారు. ఈ డైలాగ్ కంటే కాస్త వెనక్కి వెళ్తే ‘ఇండియానే ఇందిరా, ఇందిరానే ఇండియా’ అని కాంగ్రెస్ నాయకులు ఒకరు గతంలో సెలవిచ్చారు. వర్తమాన కాలంలో ఈ రెండు మాటలకు కాలం చెల్లింది. ఇంకా చెప్పాలంటే ప్రజల ఆలోచనలకు ఈ డైలాగ్‌లు చాలా దూరం జరిగాయి. ఇప్పుడు ఇందిరాగాంధీ లేరు, కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అదిప్పుడు మిణుకు మిణుకు అంటున్నది. ఈ నేపథ్యంలో నుంచి చూసినప్పుడు బీహార్ ఎన్నికల ఫలితాలు గత, వర్తమానంలో మారిన, మారుతున్న రాజకీయ పరిస్థితుల గురించిన అంచనా చర్చకు వస్తుంది.
ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆర్జేడీలు మహాగఠ్ బంధన్ పేరుతో 243 అసెంబ్లీ స్థానాల్లో పోటీచేశాయి. కచ్చితంగా ప్రభావం చూపించడమే కాదు, అధికారంలోకి వస్తామని కూడా ఈ కూటమి నాయకులు చెప్పారు. ఎన్నికల ముం దు అనేక సంస్థలు ఈ కూట మి అధికారంలోకి రావచ్చని జోస్యం చెప్పా యి. రాహుల్, తేజస్విలిద్దరూ పోటీ పడి మీడి యా సమావేశాల్లో తమ శక్తి గురించి వివరించారు. ఓటు చోరి గురించి రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. బీహార్ పోలిం గ్ సందర్భంలో కూడా రాహుల్‌గాంధీ ఓటు చోరీ గురించి మాట్లాడారు.
దేశవ్యాప్తంగా మీడియా కూడా ఈయన మాటలను బాగా హైలైట్ చేసింది. రాహుల్ మాటల ప్రభావం బీహార్ ఎన్నికలపై ఉంటుందని రాజకీయ పండితుల తో సహా అనేకమంది అనుకున్నారు. కానీ, ఫలితం మాత్రం ఇట్లా వచ్చింది. డామిట్ కథ అడ్డం తిరిగింది.
‘సర్’ గురించి, దీని చుట్టూతా జరుగుతు న్న పరిణామాల గురించి ఏ స్థాయిలో చర్చ తీసుకువెళ్లినప్పటికీ 65 లక్షల ఓట్ల చోరీ జరిగిందని, ఎన్నికల కమిషన్ తప్పు చేసిందని రాజ్యాంగ పీఠికను పట్టుకొని మరీ ప్రచారం చేసినప్పటికీ అక్కడి ప్రజలు ఎందుకో రాహుల్ గాంధీని విశ్వసించలేదు. రాహుల్ సుడిగాలి పర్యటనలు చేసి ప్రచారం చేసిన 110 నియోజకవర్గాల్లో ఒక్కచోట కూడా గెలవలేదంటే ఆయన మాటలను ఇక్కడి ప్రజలు ఏ మాత్రం పట్టించుకోలేదనే విషయం తేటతెల్లమవుతున్నది. గత సార్వత్రిక ఎన్నికల కంటే కూడా తక్కువ స్థానాలకు పరిమితమై బలమైన విపక్షంగా కూడా మహాగఠ్ బంధన్ నిలువలేకపోయింది. గత ఎన్నికల్లో 112 సీట్లు సాధించి తృటిలో అధికార పీఠాన్ని కోల్పోయిన ఈ మహాకూటమి ఈసారి కేవలం 35 సీట్లకు పరిమితమవడాన్ని చూస్తే వారు తిరోగమన దిశగా ప్రయాణం చేస్తున్నారని ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. సీట్ల షేరింగ్ నుంచి మొదలు ప్రచారం వరకు మహాగఠ్ బంధన్ నాయకుల మధ్య సమన్వయం లోపించిందని చెప్పవ చ్చు. అంతేకాదు కాంగ్రెస్‌తో పొత్తు వల్లనే లాలూ పార్టీ నిండా మునిగిందనే చర్చ ఇప్పు డు భారీ ఎత్తున జరుగుతున్నది. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా ప్రభావం చూపించిన రాహుల్ చరిష్మా ఇప్పుడు తగ్గిందని ఫలితాల ను చూస్తే తెలుస్తున్నది.
దానికితోడు లాలూ కుటుంబానికి గుండారాజ్ అన్న ముద్ర శరాఘాతంలా మారింది. 1990- 2004 మధ్యకాలంలో బీహార్‌లో కొనసాగిన అరాచక పాలనను ఇక్కడి ప్రజలు ఇంకా మర్చిపోలేదా అనే సందేహం కలుగకమానదు. కుల ఘర్షణలు, కిడ్నాప్‌లు అప్పట్లో పెద్ద చర్చనీయాంశాలు. రాష్ట్రంలో పాలన ఉన్నదా, లేదా? చర్చ కూడా జోరుగా సాగిం ది. నాడు లాలూ ఇంటి నుంచే కిడ్నాపర్లు బేరసారాలు ఆడేవారని కూడా చెప్తుంటారు. ఆ పాపభారాన్ని తేజస్వి యాదవ్ ఇంకా ఎంతో కాలం మోయాల్సి ఉంటుందనేది ఈ ఫలితాలను బట్టి తెలుస్తున్నది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఆయన సైతం ఓడిపోయే పరిస్థితిని చవిచూశారు. అటూ ఇటూ ఊగిసలాడి చివరికి విజయం వరించింది. ఆయన సోదరుడు నాలుగో స్థానానికి పరిమితమయ్యారు. దీన్నిబట్టి చూస్తే గతంలో జరిగిన దాణా కుంభకోణాన్ని ఇంకా జనం మర్చిపోలేదని తెలుస్తున్నది.
అంతేకాదు లాలూ జైలుకు వెళ్లిన తర్వాత ఆయన సతీమణి రబ్రీ సీఎం అయ్యారు. తమ పిల్లలకే రాష్ట్రస్థాయి అవార్డులు ఇప్పించుకున్నారనే అపప్రద ఈ కుటుంబంపై ఉనది. ఇలాంటి అనేక సవాళ్లు తేజస్వి యాదవ్ ఎన్నికల ప్రచారంలో మీడియా ద్వారా ఎదుర్కొన్నారు. తాము ప్రతికూల పరిస్థితుల్లో ఉన్న సమయంలో కాంగ్రెస్‌తో అదే మైత్రిని కొనసాగించడం వల్ల ఆర్జేడీ తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
ఈ ఎన్నికల్లో అరవైకి పైగా స్థానాల్లో పోటీ చేస్తే ఆరు స్థానాల్లో మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. ఆ రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ గెలవడం కష్టమనే సంకేతం చాలా స్పష్టంగా వ్యక్తమైంది. బీజేపీ రాజకీయ వ్యూహం ముందు రాహుల్, తేజస్వి యాదవ్‌లు తేలిపోయారు. వారి గెలుపును నిలువరించలేకపోయారు. బీహార్ రాజకీయాల్లో తిరుగులేని నేతగా నితీశ్ కుమార్ నిలబడుతున్నారు. ఏడు పదులు దాటిన వయస్సులో కూడా ఆయన రాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. ఆయనను పక్కకు పెట్టకుండా బీజేపీ నాయకులు రాజకీయంగా పావులు కదుపుతున్నారు. ఒకటి అరా స్థానాల నుంచి నేడు రాష్ట్రంలో సింగల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించే స్థాయికి బీజేపీ చేరుకున్న ది. వాజపేయి, అద్వానీ వేసిన పునాదిపైనే అక్కడ పార్టీ ఎదుగుదల ప్రారంభమైంది. మోదీ దాన్ని మరింత బలపర్చారు. నితీశ్ అనంతరం తామే సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే శక్తి తమకు భవిష్యత్తులో వస్తుందనే ముందస్తు ఆలోచనతో బీజేపీ నాయకులున్నారు. మోదీ, నితీశ్‌కు తోడుగా లోక్ జనశక్తి పార్టీ అధ్యక్షుడు చిరాగ్ పాశ్వాన్ ప్రభావం కూడా వారు 200 మార్కు దాటడానికి ఎంతో దోహదపడిందని చెప్పవచ్చు.
ఈ ఎన్నికల్లో మహిళల ఓట్లు ఎక్కువ ప్రభా వం చూపించాయి. ఎన్నికల ముందు ప్రకటించిన తాయిలాలు కూడా ప్రధానపాత్ర పోషించాయి. రూ.10 వేల ప్రభావం చాలా ఎక్కువగా ఉన్నట్టు ఓటింగ్ శాతాన్ని బట్టి అర్థమవుతున్నదని రాజకీయ పండితులంటున్నారు. మహిళల ఓటింగ్ శాతం పురుషుల కంటే 10 శాతం ఎక్కువగా నమోదైందంటేనే వారు ఏ స్థాయిలో ఎన్డీయేకు మద్దతిచ్చారో స్పష్టంగా కనిపించింది. మునుపటి కంటే బీహార్‌లో అభివృద్ధి కనిపిస్తున్నదనే భావన కూడా ప్రజల్లో ఉన్నది. ఇప్పటికే మన దేశంలో అత్యధికంగా ప్రజలు వలసలు వెళ్తున్న రాష్ట్రం బీహార్. అయినా అక్కడి ఓటర్లు నితీశ్ వైపే మొగ్గుచూపించారు. ఇతరులకంటే ఈయనే బెటర్ అని అక్కడి ఓటర్లు భావించినట్టున్నారు. అందుకే వరసగా నితీశ్‌కుమార్‌ను గెలిపిస్తున్నారు. ఇం కా నిర్దిష్టంగా చెప్పాలంటే యాదవ్, కుర్మీ సామాజికవర్గాల మధ్యనే నాలుగు దశాబ్దాలు గా అధికార పంపిణీ జరుగుతున్నది. రెండు దశాబ్దాలుగా కుర్మీ సామాజికవర్గీయులే అధికారంలో ఉన్నట్టు అనుకోవచ్చు. అంతేకాదు పాలనలో తీసుకొస్తున్న మార్పులు కూడా ఎన్డీ యే కూటమి గెలిచేందుకు మార్గం సుగమం చేశాయి. పింక్ టాయిలెట్లు, యువతులకు సైకి ళ్లు లాంటి పథకాలు అక్కడ బాగా పనిచేశాయ యనుకోవచ్చు.
ఇక జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకులు ప్రశాంత్ కిశోర్ పత్తా లేకుండాపోయారు. ఎవ్వరి ఓట్లు, సీట్ల సంగతి ఎట్లా ఉన్నా… బీహార్ ఎన్నికల ఫలితాల అనంతరం కాంగ్రెస్ పార్టీతో ప్రస్తుతం కలిసి ప్రయాణం చేస్తున్న ప్రాంతీయ పార్టీలతో పాటు భవిష్యత్తులో మైత్రి చేసుకుందామని భావిస్తున్న పారీలు ఇప్పుడు ఆలోచనలో పడతాయనడంలో ఎం తమాత్రం సందేహం లేదు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్టు)
-ఆస్కాని మారుతీసాగర్ 90107 56666