Ranveer Allahabadia | రణవీర్ అల్హాబాదియా అనే యూట్యూబర్ చేసిన అసహ్యకరమైన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, పిల్లల అనుబంధంపై అతడు చేసిన ఆ వ్యాఖ్యలు అశ్లీలం హద్దులను మించిపోయాయి అనడం అతిశయోక్తి కాదేమో. కనీసం వాటి గురించి మాట్లాడుకోవడమూ సభ్య ప్రపంచానికి ఇబ్బందిగా ఉండటమే అందుకు కారణం. ‘ఇండియా గాట్ లేటెంట్’ పేరిట ప్రసారమయ్యే యూట్యూబ్ కార్యక్రమంలో హాస్యం పేరిట అతడు చేసిన అత్యంత జుగుప్సాకరమైన కామెంట్లపై సహజంగానే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. నిరసన ప్రదర్శనలూ జరుగుతున్నాయి. పార్లమెంటరీ స్థాయి సంఘంతో పాటుగా పలువురు ముఖ్యమంత్రులూ రణవీర్ తీరుపై దిగ్భ్రమ వ్యక్తం చేశారు.
అసోంతో సహా దేశంలోని పలుచోట్ల అతనిపై ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వీటి నుంచి రక్షణ కోరుతూ రణవీర్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అరెస్టు నుంచి సుప్రీంకోర్టు రక్షణ కల్పించినప్పటికీ అతడిని తీవ్రస్థాయిలో మందలించడం గమనార్హం. ఇబ్బడిముబ్బడిగా దాఖలవుతున్న ఎఫ్ఐఆర్ల దృష్ట్యా అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తున్నట్టు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిందితుడి మనసులో ఉన్న ‘చెత్త’ను యూట్యూబ్ కార్యక్రమంలో వెళ్లగక్కినట్టు మండిపడింది.
అతడి వ్యాఖ్యలు ఈ దేశపు కుమార్తెలను, సోదరీమణులను, తల్లిదండ్రులను సిగ్గుపడేలా చేశాయని అక్షింతలు వేసింది. ఇలా తీవ్రస్థాయిలో స్పందించడమే కాకుండా సదరు వీడియోలను యూట్యూబ్ నుంచి తొలగించాలని ధర్మాసనం ఆదేశించాల్సి రావడం దిగజారిపోతున్న సోషల్ మీడియా ప్రమాణాలకు అద్దం పడుతున్నది. హాస్యం పేరిట, వినోదం పేరిట కుప్పలుతెప్పలుగా వచ్చిపడుతున్న అశ్లీలతకు పరాకాష్ఠగా ఈ ఉదంతం నిలిచింది. ఈ నేపథ్యంలో వాక్, భావ వ్యక్తీకరణ స్వాతంత్య్రాలపై మరోసారి తీవ్ర చర్చ మొదలైంది.
వివాదాస్పద కార్యక్రమం రూపొందించిన సమయ్ రైనా, జనం అసహ్యించుకునేలా వ్యాఖ్యలు చేసిన రణవీర్ ఇద్దరూ యూట్యూబర్లలో రైజింగ్ స్టార్లు అనేది గమనార్హం.
వారికి తగినంతగా ఫాలోయింగ్ ఉండటమే కాకుండా, ‘కౌన్ బనేగా కరోడ్పతి’ ప్రత్యేక కార్యక్రమం లో అమితాబ్ సరసన రైనా చోటు దక్కించుకున్నాడు. అటు రణవీర్ అయితే ఏకంగా ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ‘క్రియేటర్ ఆఫ్ ద ఇయర్’గా అవార్డు అందుకున్నాడు. వీరిద్దరూ కలిసి వండివార్చిన అశ్లీలతపై వ్యక్తమవుతున్న వ్యతిరేకత మీడియాపై ప్రభుత్వ నియంత్రణ ఆవశ్యకత దిశగా చర్చను మళ్లిస్తున్నది. ప్రజాస్వామికవాదుల్లో సహజంగానే దీనిపై ఆందోళన వ్యక్తమవుతున్నది. గతంలో వివాదాస్పద అంశాలు ప్రసారమైన ప్రతిసారీ ప్రజలు గగ్గోలు పెట్టడం, నియంత్రణ కోసం ప్రభుత్వం చట్టాలు, నిబంధనలు తీసుకురావడం తెలిసిందే.
అయితే ఈ నిబంధనలు సమస్యకు పరిష్కారం కావు. అవి ప్రజాస్వామిక వ్యక్తీకరణకు గుదిబండలుగా మారుతాయని అనుభవంలో రుజువైంది. 2000వ సంవత్సరంలో వచ్చిన ఐటీ చట్టం, 2001లో వచ్చిన ఐటీ నిబంధన లు ఇందుకు ఉదాహరణ. ప్రస్తుత సందర్భంలోనూ పూర్తిగా రసహీనమైన, పేలవమైన, హాస్యోక్తిగా ఏ మా త్రం అర్హత లేని వ్యాఖ్య ఇప్పుడు మరింత కఠినమైన నియంత్రణ డిమాండ్లకు దారితీయడం సమర్థనీయం కాదు. ‘రణవీర్ది చెత్త మనస్తత్వం’ అని మాత్రమే సుప్రీంకోర్టు పేర్కొన్నది. అతడు చేసింది మన చట్టాల ప్రకారం నేరం అవుతుందా? కాదా? అనేది కోర్టులు తేలుస్తాయి. ఇలా ఏది పడితే అది వాక్ స్వాతంత్య్రం ముసుగులో సోషల్ మీడియాలో ప్రసారం కాకుండా అడ్డుకునేదాన్ని రూపొందించడంలో ఉన్నత న్యా యాధికారుల సహాయాన్ని సుప్రీంకోర్టు అర్థించ డం విశేషం. ఏది ఏమైనా స్వీయ నియంత్రణ ముఖ్యం.