నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు వెనక బీఆర్ఎస్ కృషి అడుగడుగునా ఉన్నది. ఉమ్మడి ఏపీలో కేసీఆర్ పార్లమెంటు సభ్యుడిగా ఉన్నప్పుడే పసుపు బోర్డు డిమాండ్‌ను తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత కవిత కూడా దీనిపై పోరాటం చేశారు. పసుపు రైతులు, బీఆర్ఎస్ కలిసి చేసిన పోరాటాలతో ఉలిక్కిపడిన బీజేపీ గత ఎన్నికల్లో ఇదే అంశంతో నిజామాబాద్ పార్లమెంటు బరిలో దిగి విజయం సాధించినప్పటికీ
ఆ తర్వాత ఆ విషయాన్ని అటకెక్కించింది.
పసుపు బోర్డు ఏర్పాటు అంశంలో బీఆర్ఎస్ పాత్ర చాలా కీలకం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కేసీఆర్ పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నప్పడు పసుపు బోర్డు కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వాన్ని పలుమార్లు డిమాండ్ చేశారు. 2014లో రాష్ట్ర ఏర్పాటు తర్వాత వ్యవసాయ రంగంపై బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో భాగంగా పసుపు బోర్డు ఏర్పాటు అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి కేంద్రంపై ఒత్తిడి పెంచింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ సభ్యులు పలుమార్లు దీనిపై చర్చకు పట్టుబట్టారు. నిజామాబాద్ జిల్లా ప్రజాప్రతినిధులు కవిత అధ్యక్షతన ప్రధాని నరేంద్రమోదీని కలిసి వినతులు ఇచ్చారు. కానీ కేంద్రం మాత్రం స్పందించలేదు. ఇక్కడ బోర్డు ఏర్పాటు చేస్తే ఇతర బోర్డులపై ప్రభావం పడుతుందని వాదించింది. అయితే, 2019 సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్‌లో ఇదే ప్రధానాంశమైంది. ఆ ఎన్నికల్లో అక్కడ బీజేపీ గెలిచిన తర్వాత మళ్లీ ఈ అంశం మరుగున పడింది. అయితే, రైతుల నుంచి ఆందోళనలు తీవ్రతరం కావడం, ఆర్మూర్, జగిత్యాల ప్రాంతాల్లో రైతులు ఆందోళనలకు దిగడం, మరోవైపు బీఆర్ఎస్ ఒత్తిడి వెరసి పసుపు బోర్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నో పోరాటాలు, మరెన్నో వినతుల తర్వాత తెలంగాణలో పసుపు బోర్డును ఎట్టకేలకు ప్రారంభించింది.
పసుపు ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణది మొదటి స్థానం. ఉత్తర తెలంగాణ ప్రాంతంలో నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో పసుపు అధికంగా పండిస్తారు. పండిన పంటను ఇతర రాష్ర్టాలకు పంపించి అక్కడి నుంచి ఎగుమతి చేసేవారు. దీనివల్ల మన రైతులకు సరైన ధర లభించక నష్టపోయేవారు. 2016-17లో అప్పటి నిజామాబాద్ పార్లమెంట్ సభ్యురాలు కవిత అనేకసార్లు కేంద్ర పెద్దలను కలిసి పసుపు బోర్డు కోసం వినతులు ఇచ్చారు. అయితే, 2022లో పసుపు బదులు సుగంధ ద్రవ్యాల బోర్డును ఏర్పాటు చేస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీంతో రైతుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. ఇప్పుడు ఎట్టకేలకు తెలంగాణ భౌగోళిక, ఆర్థిక లబ్ధి తదితర అంశాల దృష్ట్యా కేంద్రం ఎట్టకేలకు పసుపు బోర్డును ప్రారంభించింది.
మన రాష్ట్రంలో దాదాపు 25 రకాల పసుపును పండిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఆయుష్ మంత్రిత్వశాఖ ప్రపంచ సంప్రదాయ మందుల కేంద్రం (గ్లోబల్ ట్రెడిషనల్ మెడిసినల్ సెంటర్) ద్వారా పసుపునకు ప్రోత్సాహకాలు కల్పించే అవకాశాలున్నాయి. ఔషధ గుణాలు అధికంగా ఉన్నందువల్ల అనేక ఆహార, ఔషధ రంగాల పరిశ్రమలకు ఒక థింక్ ట్యాంక్‌గా ఈ బోర్డు పనిచేయనుంది. ఉద్యోగ కల్పన, గ్రామీణ సహకార సంఘాలకు పెట్టుబడి సాయం, గ్రామీణ నిరుద్యోగ నిర్మూలన వంటివి జరగనున్నాయి. అలాగే, కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాల్లోని ప్రాంతీయ బోర్డులకు ఇది కేంద్రంగానూ పనిచేయనుంది. రైతుల కన్షార్షియం ద్వారా అధిక లాభాలకు కూడా ఇది దోహదం చేస్తుంది. భారత్ తర్వాత ప్రపంచంలో అత్యధికంగా పసుపును పండించే దేశాలైన చైనా, మయన్మార్, నైజీరియా దేశాలతో మనం ఎంవోయూ కుదుర్చుకొనే అవకాశాలు కూడా మెరుగుపడతాయి. లాజిస్టిక్స్ హబ్ , రవాణా సౌకర్యాలు సైతం మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
బోర్డు ఏర్పాటుతో పాటు ఒక పరిశోధన కేంద్రం, ఎగుమతి ప్రోత్సాహక వృద్ధి కేంద్రాలు (ఎక్స్పోర్ట్ ప్రమోషన్ గ్రోత్ కౌన్సిల్), సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్సు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. రైతులకు పసుపుపై మద్దతు ధర (ఎంఎస్పీ)ను అధికంగా ప్రకటించినప్పుడే వారికి న్యాయం జరుగుతుంది. మన రాష్ట్రంలో పసుపును అధికంగా పండిస్తున్నప్పటికీ పసుపు వంగడాలు మాత్రం కర్ణాటక, తమిళనాడు నుంచే వస్తున్నాయి. కాబట్టి బోర్డు ఇక్కడ ఉన్నప్పటికీ అక్కడి రైతులకు అధికంగా లబ్ధి చేకూరే అవకాలున్నాయి. ఈ సవాళ్లను బోర్డు ఎలా అధిగమిస్తుందో చూడాలి. తెలంగాణ భూపరివేష్టిత (ల్యాండ్ లాక్డ్) రాష్ట్రం కావడం వలన ఎగుమతులకు కొంత అంతరాయం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. దీనికి తగ్గట్టుగా డ్రై పోర్టులను నిజామాబాద్ జిల్లాలోనే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే, ట్రాన్సిట్ కారిడార్లను ఏర్పాటు చేయాలి. ఆర్గానిక్ రకమైన పసుపు విత్తనాలను సైతం ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఈ విధంగా దేశంతో పాటు మన రాష్ట్ర రైతులకు లబ్ధి చేకూరేలా కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ పసుపు బోర్డు ముందుకు సాగాలని కోరుకుందాం.
– కన్నోజు శ్రీహర్ష
89851 30032