కరోనా వ్యాప్తికి వలసకూలీలే కారణం అన్న మోదీ వ్యాఖ్యలు అవాస్తవం మాత్రమే కాదు అమానవీయం, గర్హనీయం కూడా. నిజానికి ముందస్తు హెచ్చరికలు లేకుండా విధించిన లాక్డౌన్ వల్ల ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులు చేసేదేమీలేక సొంత ఊళ్లకు బాటపట్టారు. బస్సులు, రైళ్ళు అందుబాటులో లేకపోవటంతో వందలాది మైళ్ళ దూరం కాలినడకతో అష్టకష్టాలు పడ్డారు. ఈ అసహాయ ఆకలియాత్ర అనేకమంది ప్రాణాలను బలిగొన్నది. బహుశా దేశ చరిత్రలోనే ప్రభుత్వ తప్పిదం వల్ల సంభవించిన ఒక మహా మానవ విషాదంగా ఈ ఘటనను పేర్కొనవచ్చు. ఈ మహా విషాదానికి పూర్తి బాధ్యత మోదీ సర్కారుదే.
హఠాత్తుగా లాక్డౌన్ విధిస్తే నగరాలకు వలస వచ్చిన కార్మికుల పరిస్థితి ఏమవుతుందని మోదీ ప్రభు త్వం యోచించలేదు. కార్మికుల్లో అధిక సంఖ్యాకులు నిర్మా ణ రంగంలో పనిచేస్తున్నవాళ్లు. తాము చేస్తున్న మహా నిర్మాణాల పక్కనే యజమానులు తాత్కాలికంగా కట్టిన రేకుల షెడ్లలో నివసించే అభాగ్యులు. కాంట్రాక్టరు చెల్లించే రోజువారీ భత్యంతో పొట్టపోసుకునే బడుగుజీవులు.
సొంత ఊర్లను విడిచి రెక్కలకష్టం నమ్ముకొని తమ భాష, పలుకు వినిపించని దూరతీరాన కూలి డబ్బులకోసం అగచాట్లు పడే ఈ అథోజగత్సహోదరుల దీనత్వం ఎరుగని దృతరాష్ట్ర ప్రభుత్వం డిల్లీ సర్కార్. ఆధార్ కార్డు లు, ఓటర్ ఐడీలు లేని ఈ నిరాధార పేదలు నడిచి నడిచి నేలకు రాలిపోతే మాకేమిటి? అని నీరో ఫిడేల్ వాయించినట్టు మోదీ సర్కార్ వ్యవహరించిన తీరు క్షమింపరానిది.
వలస కూలీల సమస్య కండ్ల ముందు కనబడుతున్నా కనీసం స్పందించలేదు. లక్షలాది మంది కార్మికులు ఎర్రటి ఎండన అలమటిస్తున్నప్పుడైనా దిద్దుబాటు చర్యలకు తీసుకోలేదు. తిండికి నీళ్ళకు దిక్కులేక లక్షలాదిమంది పేదజనం రోడ్డున పడి నడుస్తూ అలోలక్ష్మణా అని అలమటిస్తుంటే చోద్యం చూస్తూ కర్కశ క్రౌర్యాన్ని బీజేపీ ప్రభుత్వం ప్రదర్శించింది.
ఒకవైపు వలస కార్మికులు, వాళ్ళ చిన్నారి బిడ్డల ప్రాణాలు గాలిలో కలిసిపోతుంటే, మరోవైపు మోదీ ప్రభుత్వం కరోనా పోవాలని బాల్కనీల్లో చప్పట్లు కొట్టండి, దీపాలు ముట్టించండి, పళ్ళాలు మోగించండి లాంటి పిలుపులిచ్చింది! వలస కార్మికులు దిక్కూ దరీ లేని దూరాలకు నడక సాగించే క్రమంలో రోడ్లపైనే నిలువునా కూలిన విషాద కథనాలను వార్తా పత్రికల్లో చదివి, టీవీలో చూసి దేశప్రజల హృదయాలు ద్రవించిపోయాయి. కానీ, మోదీ గుండె మాత్రం కొంచెం కూడా చలించలేదు. రవ్వంత సహాయం చేయడానికి కూడా కేంద్రప్రభుత్వం ముందుకు రాలేదు. తాననుకొనే ధర్మ గంగ బిందువులను మాత్రమే ప్రేమించే వికాస(ర) పురుషుని నేత్రాలకు స్వేదగంగ బిందువులు వాళ్ళ కన్నీటి సింధువులు కనిపించవు కదా!
వలస కార్మికులు అనుభవిస్తున్న దుర్భర వేదన చూడలేక, వాళ్లకోసం బస్సులు ఏర్పాటు చేసిన ప్రతిపక్ష పార్టీలను, ఎన్జీవోలను, వ్యక్తులను అభినందించాల్సింది పోయి, ఇప్పుడు మోదీ ప్రభుత్వం నిందిస్తున్నది. ఇంతకన్నా హేయమైనది మరొకటి ఉంటుందా! విద్వేషరాజకీయాలు, విపరీత అధికారాలే తప్ప మానవత్వ స్పర్శ లేని రాజకీయ క్షుద్రులు మాత్రమే ఇట్లా మాట్లాడగలుగుతారు.
అవును, ఆనాడు వలస కార్మికులకు మానవత్వంతో తిండి, నీళ్ళు అందించిన వాళ్లంతా ఇప్పుడు నేరస్థులు! వాళ్లు సురక్షితంగా తమ గ్రామాలకు చేరుకోవాలని పరితపించిన వాళ్లంతా కుట్రదారులు. వీళ్లే కరోనా వ్యాప్తికి కారణమైన దేశద్రోహులు, అర్బన్ నక్సలైట్లు, యాంటీ నేషనలిస్టులు. అభినవ హిట్లర్ భారత దేశాన్ని పాలిస్తున్న వర్తమాన సందర్భంలో గుండె కరిగే స్వభావమున్న వాడు, కన్నీరు కార్చే అంతఃకరణ కలిగిన ప్రతివాడూ నేరస్థుడే. ‘ఒక్క అబద్ధాన్ని వందసార్లు వల్లించు. దాన్ని ప్రభుతలోని పెద్దల నోట పలికించు. వాట్సాప్ యూనివర్సిటీలతో పహలాయించు..’ అనే ‘గోబెల్స్ కమాండ్మెంట్స్’ను అక్షరాలా ఆచరించి చూపటమే సిసలైన దేశభక్తి!
ఒక వైపు కరోనా ప్రమాదకరంగా వ్యాప్తి చెందుతున్నదని దేశ దేశాల్లో వార్తలు వస్తున్నా ముందు జాగ్రత్తలు తీసుకోకపోగా.. ‘వన్స్ మోర్ ట్రంప్ సర్కార్’ అని నిస్సిగ్గుగా నినదిస్తూ అమెరికా అధ్యక్షునికి లక్షలమందితో స్వాగత సభలు ఏర్పాటు చేసినవాళ్ళు దేశభక్తులు!!
కరోనా కరాళ నర్తన చేస్తున్న వేళ ‘కుంభమేళా’లకు అనుమతించి కోట్లాదిమందిని గంగలో ముంచిన వాళ్ళే నిజమైన జాతీయవాదులు! గంగా తీరం శవాలతో కండ్లముందుంటే.., ‘ఆవుపంచకం తాగితే కరోనా ఆమడ దూరం పరుగెత్తుతుంద’ని ప్రవచించిన వారే జ్ఞానులు! బెంగాల్ ఎన్నికలను ఎడతెగని టీవీ సీరియల్లా దశల వారీగా నిర్వహింపచేస్తూ ఇబ్బడిముబ్బడిగా ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలూ నిర్వహించిన రవీంద్రనాథ్ ఠాగూర్ వేషధారులే జాతీయవాదులు! కరోనా వ్యాప్తిలో వీరికి ఇసుమంతైనా భాగం లేదు! కూలీ డబ్బులు రావటం లేదని మూటా ముల్లె సర్దుకొని పిల్లా జెల్లాను చంకన ఎత్తుకొని బొబ్బలెత్తిన కాళ్లతో వందలు, వేల కిలోమీటర్లు నడుచుకుంటూ పోయినవాళ్లు కరోనా వ్యాప్తి కారకులు! నడిచి నడిచి అలసి సొలసి పట్టాలపై పడుకొని ఆదమరచి నిద్రపోతే అర్ధరాత్రి రైలొచ్చి కంఠాలు తెగిపోయినవాళ్లు అసలైన దేశద్రోహులు! కరోనాను దేశమంతా విస్తరింపజేసిన కుట్రదారులు!
శభాష్ మోదీ.. ఇంత జుగుప్సాకరంగా మాట్లాడగలిగిన నీ వంచనా శిల్పానికి జోహార్. ఇది విని నిన్నింకా దేశం కోసం, ధర్మం కోసం అని నమ్మి భరిస్తున్న నా దేశవాసులకూ జోహార్. నువ్వు సంసారం ఎరుగని వాడివని, స్వార్థం తెలియని వాడివని, అవినీతిని నిర్మూలిస్తావని, బ్లాక్ మనీని విదేశీ లాకర్ల నుంచి రప్పిస్తావని, ఆ డబ్బును రాబిన్ హుడ్లా పేదల అకౌంట్లలోకి పంచేస్తావని నమ్మి నీకు వోట్లేసి గద్దెనెక్కించిన వాళ్ళ పాపానికి నిష్కృతి లభించే వరకు వర్ధిల్లు. అడాల్ఫ్ హిట్లర్ దాల్చిన అపర అవతారమై వర్ధిల్లు. పాపం శమించుగాక!!
-డి.అభిజ్ఞ