టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబును తెలంగాణకు శాశ్వత శత్రువుగా ప్రకటించవలసిన సమయం వచ్చింది. తెలంగాణకు సంబంధించి గత పాతికేండ్లలో ఇంతింత జరిగినప్పటికీ ఈ పరిణామాల పరంపర నుంచి ఆయన ఎటువంటి పాఠాలు నేర్వలేదు. గతంలో ఎన్నెన్ని కుయుక్తులు పన్నినా కనీసం ఏపీ విడిపోయి, పదేండ్లు గడిచి, తను అక్కడ రెండవసారి అధికారానికి వచ్చిన తర్వాతనైనా తమ రాష్ర్టానికి పరిమితమై ఉంటే, కాలం గడిచిన కొద్దీ గత గాయాలను తెలంగాణ క్రమంగా మరిచిపోయి ఉండేదేమో. కానీ ఆయన తన నిజ స్వరూపాన్ని, నిజ స్వభావాన్ని, నిలువెల్లా మూర్తీభవించిన స్వార్థ ప్రయోజనాలను మాత్రం వదులుకోలేక, తెలంగాణకు వీలైనంత హాని చేయటాన్ని తన కర్తవ్యాలలో ఒకటైనట్టు వ్యవహరిస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తనంతట తానుగా ఎంతో ఘనంగా అభివృద్ధి చెందేందుకు కావలసిన వనరులతో పాటు ఇతర హంగు లు ఎన్నెన్నో ఉన్న స్థితిలో చంద్రబాబు తన ప్రతి భా సామర్థ్యాలను, అనుభవాన్ని, కేంద్ర ప్రభుత్వంతో ఏర్పడిన ఘనిష్ఠ సంబంధాలను ఉపయోగించి ఎంత అభివృద్ధినైనా సాధించుకోవచ్చు. అది చూసి తెలంగాణ కూడా ఒక సోదర తెలుగు రాష్ట్రంగా సంతోషిస్తుంది. కానీ ఆయన అంతటితో ఆగక తెలంగాణపై తను ఇన్ని దశాబ్దాలుగా సాగించిన కుయుక్తులను ఇప్పటికీ కొనసాగిస్తున్నా రు. ఆ పని రహస్యంగా చేస్తూ ఎవరికీ తెలియటం లేదని భ్రమపడితే అది వేరు. కాని, అన్ని రహస్యా లు ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజలకు మొదటినుంచి బట్టబయలవుతూ, ఆయన వారి దృష్టిలో నిలువెల్ల విషప్రాయుడైన వ్యక్తిగా స్థిరపడిపో యి, ఏహ్యభావానికి గురికావటం 2014 కన్న ముందునుంచే ఉన్నది. ఈ మాట తను కూడా గ్రహించినట్టు అపుడపుడు తను చేసే వ్యాఖ్యలు, అర్థోక్తులను బట్టి అర్థమవుతుంటుంది. అటువంటపుడు కనీసం ఆత్మగౌరవం గల మనిషి, తన పద్ధతిని కొంతైనా మార్చుకోవాలి. కానీ, పులిచారలు ఎప్పటికీ మారవన్నట్టు ఆయన మళ్లీ మళ్లీ అవే లక్షణాలను ప్రదర్శిస్తున్నారు.
తెలంగాణ విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన 1956 నుంచి ఈ 59 ఏండ్లలో ఆంధ్ర ధనికవర్గాలకు చెందిన అనేక మంది నాయకులను, వారి వ్యవహరణాశైలిని గమనించాము గాని, ఇంతటి ఘనుడు మరెవరూ లేరు. మున్ముందు ఉండకపోవచ్చు కూడా. చంద్రబాబును తెలంగాణకు శాశ్వత శత్రువుగా పరిగణించవలసి ఉంటుందనేంత తీవ్రమైన మాటను ఉపయోగించవలసి రావటం ఉబుసుపోకనో, సంచలనానికో కాదు. తెలంగాణ గురించి తన భావజాలాన్ని, ప్రకటనలను, వాస్తవ చర్యలు అన్నింటిని ఎవరైనా క్రోడీకరించి ఒక జాబితాగా రాస్తున్నారో, లేదో తెలియదు. రాస్తుండకపోతే రాయటం అవసరం. చంద్రబాబు చరిత్రలో అవి ఒక అధ్యాయమవుతాయి. ‘తెలంగాణ – చంద్రబాబు’ అనే శీర్షికతో. తెలంగాణతో నిమిత్తం లేకుండా కూడా ఆయన చరిత్ర పెద్దదే. ఆ విశేషాలు, ఘనతలు తరచూ చర్చల్లోకి వస్తుండేవే. వాటితో తెలంగాణకు యథాతథంగా ప్రత్యక్ష సంబంధమైతే ఏమీ లేదు. కానీ, ఒక వ్యక్తి స్వభావం అన్నది మౌలిక లక్షణం అయినప్పుడు, అది భిన్న విషయాలలో ప్రతిఫలిస్తుంది. అది తెలంగాణకు సంబంధించి కూడా గతంలో జరిగింది, ఇప్పటికీ జరుగుతున్నది. ఆ విధంగా ఆ మేరకు ఆయన తక్కిన చరిత్ర కూడా తెలంగాణకు ప్రాసంగికమవుతుంది.
చంద్రబాబు తెలంగాణ గురించి మొన్నటి పార్టీ మహానాడు సభలలో మరొక మారు అన్న మాటలనే గమనించండి. ఒకటి, తాను కాళేశ్వరాన్ని ఎప్పుడూ వ్యతిరేకించలేదు. రెండు, గోదావరిపై ప్రాజెక్టులను కాదనలేదు. మూడు, తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం మొత్తం దేశంలోనే అత్యధిక స్థాయికి పెరగటానికి పునాదులు వేసింది తానే. నాలుగు, తనకు ఆంధ్ర, తెలంగాణలు రెండు కండ్ల వంటివి.
నిజానికి ఈ మాటలు ఆయన లోగడ కూడా పలుమార్లు అన్నారు. రెండు కండ్ల మాటనైతే ఉద్యమ సమయంలో చప్పన్నారు మార్లు ప్రకటించారు. హైదరాబాద్ నిర్మాణం, అభివృద్ధి, తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా ఎదగటం వంటివన్నీ కూడా తన ఘనతలేనని కడపలో మరొకమారు అందరికీ గుర్తుచేయటం ఎందువల్లనో గాని మరిచిపోయారు. లేక వార్తలలో రాలేదేమో మనకు తెలియదు. ఇక బనచకర్ల విషయమై వల్లింపులు సరేసరి. ఈ విధమైన మాటలలోని వాస్తవాలేమిటో తెలంగాణ ప్రజలకు మొదటి నుంచి అర్థమైనవే. తెలంగాణ రాష్ర్టాన్ని సీమాంధ్ర పాలకులంతా వ్యతిరేకించినవారే. కానీ, వారిలో అందరికన్న ఎక్కువ ద్వేషం చంద్రబాబు పట్ల కలగటానికి కొన్ని కారణాలున్నాయి. మొదటినుంచీ ఆయనకు ఒక పెద్ద మానిప్యులేటర్ అనే పేరున్నది.
ఎన్టీఆర్ ఉదంతం నుంచి కుట్రదారు, వెన్నుపోటుదారనే గుర్తింపు వచ్చింది. ఆర్థిక సంస్కరణలను అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ సహా దేశంలో ఎవరూ చేయనంత స్థాయిలో తలకెత్తుకొని రైతాంగానికి, ఇతర వర్గాలకు కలిగే హానిని లెక్కచేయకుండా ఇటు సంపన్నవర్గాలకు, అటు ప్రపంచ బ్యాంకుకు ఊడిగం చేయటం ద్వారా ప్రజాస్వామ్యానికి వ్యతిరేకి అనే ప్రతిష్ఠ లభించింది. నక్సలైట్ ఉద్యమకారులను పనిగట్టుకొని బూటకపు ఎన్కౌంటర్లలో బలి తీసుకొని హంతకుడనే పేరు సంపాదించారు. తెలంగాణ వనరులను, హైదరాబాద్ నగర భూములను తమ సీమాంధ్ర దోపిడీ తరగతులకు అప్పగించి తెలంగాణ దోపిడీదారు అనే కీర్తి పొందారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పేదల సంక్షేమ పథకాలను, సబ్సిడీలను, బోర్లపై ఆధారపడి సాగే తెలంగాణ రైతులకు కరెంటు సబ్సిడీలను కోతలు పెట్టి రద్దుచేసి సామాన్యుల వ్యతిరేకి అనే పేరు పొందారు. చివరికి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమ సమయంలో ఎంతెంత టక్కరితనాలు చూపారో లెక్కలేదు.
తెలంగాణ రాష్ర్టాన్ని సీమాంధ్ర పాలకులంతా వ్యతిరేకించినవారే. కానీ, వారిలో అందరికన్న ఎక్కువ ద్వేషం చంద్రబాబు పట్ల కలగటానికి కొన్ని కారణాలున్నాయి. మొదటినుంచీ ఆయనకు ఒక పెద్ద మానిప్యులేటర్ అనే పేరున్నది. ఎన్టీఆర్ ఉదంతం నుంచి కుట్రదారు, వెన్నుపోటుదారనే గుర్తింపు వచ్చింది.
అటువంటి బహుముఖ ప్రతిభా నేపథ్యం గల చంద్రబాబు, ఇక తెలంగాణ రానుండగా, సీమాం ధ్ర కాంగ్రెస్ వారితో కుమ్మక్కయి అసెంబ్లీకి రాజీనామాలు చేసి, ఆ తీవ్రమైన నిరాశా నిస్పృహలలో వందలాది మంది తెలంగాణ యువకుల ఆత్మ బలిదానాలకు తానూ ఒక కారణమయ్యారు. కాంగ్రెస్ హంతకులకు సహ హంతకుడయ్యారు. తెలంగాణ అన్న పదాన్నే అసెంబ్లీలో బాహాటంగా నిషేధించిన ఆయన, ఇటువంటి ద్రోహాలు అనేకం సాగిస్తూనే, తనకు రెండు ప్రాంతాలు రెండు కండ్లనే కపటపు డైలాగులు కూడా వినిపిస్తూ పోయారు. ఉమ్మడి రాష్ట్ర చరిత్ర యావత్తూ తెలంగాణ పట్ల జలదోపిడీ చరిత్ర కాగా, రాష్ట్ర విభజన తర్వాత సైతం చంద్రబాబు పీడ వదలలేదు. నదీజలాల పంపిణీకి అడుగడుగునా చిక్కుముళ్లు, అనేకానేక ప్రాజెక్టుల నిర్మాణ పథకాలపై వరుసగా కేంద్ర సంస్థలకు ఫిర్యాదులు, అనుమతులు లేకున్నా అక్రమ నిర్మాణాలు, నీటి తరలింపులు ఆయనకు నిత్యకృత్యమైపోయాయి. ఇప్పుడు బనకచర్ల వంతు వచ్చింది.
తెలంగాణ పట్ల ఈ విధమైన దశాబ్దాల విద్రో హం ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా మానని గాయంగా ఉండగా, కడప మహానాడులో చంద్రబాబు పైన పేర్కొన్న వళ్లింపులను మరొకసారి చేశారు. ఆరని తెలంగాణ వ్యతిరేకతల అగ్నిపై మరింత ఆజ్యం పోశారు. తన పట్ల ఇక్కడి ప్రజలలో రాష్ట్ర విభజన తర్వాత ఏండ్లు గడిచిన తర్వాత సైతం ఇంకా ఎంత అసహ్యం మిగిలి ఉన్నదో 2018 అసెంబ్లీ ఎన్నికలను బట్టి అయినా కాస్త వివేకం గలవారికి అర్థమై ఉంటుంది. అందరికీ అయింది ఒక్క చంద్రబాబుకు తప్ప. అయినప్పటికీ తెలంగాణపై, ముఖ్యంగా హైదరాబాద్ మహా నగరంపై ఆశ చావని ఆ మనిషి, ఏదో ఒక పన్నుగడతో ఇక్కడ పాగా వేయాలని ఈ రోజుకు కూడా కలలు కంటున్నారు. తెలంగాణ వేరే రాష్ట్రంగా ఏర్పడే సూచనలు స్పష్టంగా కనిపించినప్పుడు, కనీసం హైదరాబాద్‌ను విడదీసేందుకు, అంబేద్కర్ ఎన్నడో అన్న కాలం చెల్లిన సెకండ్ క్యాపిటల్ ముసుగులో కేంద్ర పాలిత ప్రాంత ఆలోచనను కాంగ్రెస్‌లోని ఒక వర్గంతో, కొందరు సోకాల్డ్ తెలంగాణ బడుగు మేధావులను ప్రలోభపెట్టి వెంట చేర్చుకొని బలంగానే కేంద్రం వద్ద ప్రతిపాదించారు. అవేవీ నెరవేరకపోవటంతో హతాశులై, రాష్ర్టాలు వేరైనాక ఇతరత్రా సమస్యలు సృష్టించటం ప్రారంభించారు.
ఇందులో సరికొత్త అధ్యాయం చంద్రబాబు ఏడాది కిందట తిరిగి అధికారానికి రావటంతో మొదలైంది. ఇప్పుడది రెండు విధాలుగా కనిపిస్తున్నది. ఒకటి, ఇదివరకటి వలెనే నదీజలాలు, ప్రాజెక్టుల నిర్మాణం, ఉమ్మడి ఆస్తుల పంపకం, ఇక్కడి కేంద్ర సంస్థలను తరలించజూడటం వంటివి కాగా, అంతకుమించిన ప్రమాదకరమైన వ్యూహం ఒకటి సాగుతున్నది. అది, తన టీడీపీ, బీజేపీ, జనసేన, తమతో కలిసి రాగల వివిధ వర్గాలు, తాము ప్రలోభపెట్టగలవారు, తమ మీడియా కలిసి తెలంగాణలో ఎన్డీయేను ఉనికిలోకి తేజూడటం. ఇది వారు ఇంచుమించు బహిరంగంగా చెప్తున్న మాట.
పైన పేర్కొన్న మొదటి అంశం పూర్తిగా కేంద్రంలోని ప్రభుత్వ నాయకత్వపు సహకారంతో జరుగుతున్నట్టు కనిపిస్తున్నదే. రెండవది వారి ప్రత్యక్ష భాగస్వామ్యం కలది. తెలంగాణ పట్ల ప్రధాని మోదీ తన మొదటి ఎన్నిక ప్రచార సమయం నుంచే స్పష్టమైన వ్యతిరేకతను ప్రకటించటం తెలిసిందే. ఇక్కడ బీజేపీని అధికారానికి తేవాలనే కోరిక 2014 నుంచి మూడుసార్లు జరిగిన ఎన్నికల్లో నెరవేరకపోవటమే గాక, కనీసం సమీప భవిష్యత్తులోనైనా అటువంటి అవకాశాలు కనిపించకపోవటంతో, కొత్తగా పైన పేర్కొన్న తరహాలో ఎన్డీయే కూటమి ద్వారా ఆ పనిచేసే ప్రయత్నాలు తెరవెనుక బాగానే సాగుతున్నాయి. అనగా, ఆ రూపంలో సీమాంధ్ర ధనిక దోపిడీ వర్గాలు చంద్రబాబు మార్గనిర్దేశనంలో తెలంగాణను తిరిగి తమ వలసగా మార్చజూడటమన్న మాట. ఈ ప్రమాదం చంద్రబాబును తెలంగాణకు శాశ్వత శత్రువుగా చేస్తున్నది. తస్మాత్ జాగ్రత్త.