సాగర్‌కు ఏపీ గండి!
నాగార్జునసాగర్ డ్యామ్ కుడివైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నట్టు ఇన్‌టేక్ వెల్స్, నీటిని తరలించే నిర్మాణాలు తెలంగాణ జలహక్కులను తుంగలో తొక్కుతున్నా కాంగ్రెస్ సర్కార్‌లో చలనం రావటం లేదు.
నాగార్జునసాగర్ డ్యామ్ కుడివైపున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్నట్టు ఇన్‌టేక్ వెల్స్, నీటిని తరలించే నిర్మాణాలు తెలంగాణ జలహక్కులను తుంగలో తొక్కుతున్నా కాంగ్రెస్ సర్కార్‌లో చలనం రావటం లేదు. తాగునీటి అవసరాల వంకతో చేపడుతున్న ఈ పనులు భవిష్యత్తులో కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ వాటాను దోచుకోవడానికేనని తెలుస్తున్నది. అయినా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు తెలంగాణకు కేవలం ఒక జలాశయం మాత్రమే కాదు. నల్లగొండ, ఖమ్మం, సూర్యాపేటతోపాటు అనేక ప్రాంతాల వ్యవసాయానికి, హైదరాబాద్ సహా పలు ప్రాంతాల తాగునీటి అవసరాలకు కీలకమైన జలవనరుగా ఉన్నది. సాగర్‌కు గండి ఎందుకు కొడున్నారంటే వాటర్ గ్రిడ్ ద్వారా నాగార్జునసాగర్ నుంచి పల్నాడు, దర్శి, పర్చూరు ప్రాంతాల్లోని 33 మండలాలు, 889 గ్రామాలకు తాగునీరు అందించడమే తమ లక్ష్యమని ఏపీ ప్రభుత్వం చెప్తున్నది.
జలాశయంలో నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరినా నీటిని తీసుకునేలా నిర్మాణాలు చేపడుతుండటం ఏపీ లక్ష్యం ఏమిటో చెబుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో పోతిరెడ్డిపాడు పేరిట శ్రీశైలం ప్రాజెక్టుకు గండికొట్టి యథేచ్ఛగా నీటిదోపిడీకి పాల్పడుతున్నది ఏపీ. ఇప్పుడు సాగర్‌కు గండి కొట్టి డెడ్ స్టోరేజీకి కూడా ఎసరుపెడుతున్నది. కేఆర్ఎంబీ, కేంద్రం ఎలాంటి అనుమతులు ఇవ్వకున్నా పనులు కొనసాగిస్తున్నది. నీటి నిల్వలు తగ్గినప్పుడు ఈ నిర్మాణాల వల్ల తెలంగాణకు జరిగే నష్టమేమిటో కాంగ్రెస్ సర్కార్ కనీసం ఆలోచిస్తున్నదా? లేక ఏపీ బాబుల జలదోపిడీకి యథావిధిగానే సహకరిస్తున్నదా? ఈ విషయంలో పాలక పెద్దలు తలోమాట మాట్లాడుతుండటం దేనికి సంకేతం? ఆరు దశాబ్దాల పాలనలో నీటివాటాల విషయంలో పాలమూరు, నల్లగొండ జిల్లాలను నిలువునా ముంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది. ఇప్పుడు ఏపీ రెండడుగులు ముందుకేసి, సాగర్‌లోని డెడ్ స్టోరేజీ నీటినీ ఏపీ ఎగరేసుకుపోతున్నా రేవంత్‌రెడ్డి కిక్కురుమనడం లేదు.
నాగార్జునసాగర్ సమీపంలో దాదాపు ఏడాది కాలంగా సొరంగం తవ్వకాలు నిర్వహిస్తున్నారని, సుమారు 1,650 కిలోమీటర్ల పైప్‌లైన్ నెట్వర్క్ ద్వారా దాదాపు 9 టీఎంసీల నీటిని తరలించే ప్రయత్నం జరుగుతున్నదని బీఆర్ఎస్ చెప్తున్నది. ఈ వ్యవహారాన్ని ముందుగానే ఎందుకు అడ్డుకోలేకపోయారని అధికార పార్టీని నిలదీస్తున్నది. ఇంత జరుగుతున్నా కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అభ్యతరం తెలియజేస్తూ లేఖ రాసి చేతులు దులుపుకోవడం తప్ప కాంగ్రెస్ సర్కార్ చేసింది ఏమీలేదు. గోదావరి నీటిని మాత్రమే కాకుండా కృష్ణా జలాలను ఏపీకి ధారపోసేందుకూ వెనుకాడటం లేదు. ఇప్పుడు సాగర్‌లో డెడ్ స్టోరేజీ నుంచి కూడా నీళ్లు మళ్లించేలా ప్రాజెక్టుకు ఏపీ గండి కొడుతుంటే చూస్తూ కూర్చోవడం మరీ దారుణం. రాష్ట్ర విభజన జరిగినప్పుడు 811 టీఎంసీల కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు తాత్కాలిక ప్రాతిపదికపై కేటాయించారు. అయితే ఈ పంపిణీని బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. క్యాచ్మెంట్ ప్రాంతం, సాగు అవసరాలు, జనాభా, కరువు ప్రభావిత ప్రాంతాల అవసరాలను పరిగణనలోకి తీసుకొని తెలంగాణకు 555 టీఎంసీల వాటా కావాలని కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు బలంగా వాదించింది. ఈ అంశం ఇంకా అపరిష్కృతంగానే ఉన్నది.
ఆమోదిత ప్రాజెక్టుల ప్రాతిపదికనే తదుపరి మార్పులు, అదనపు నీటి అవసరాలను పరిశీలిస్తామని ఈ నెల 11న బోర్డు ఈ మేరకు లేఖలు రాసింది. అంటే రెండు రాష్ర్టాల్లోనూ ప్రాజెక్టుల విస్తరణ, నీటి వినియోగం, అనుమతుల విషయంలో సమగ్ర సమీక్ష అవసరమనేది బోర్డు అభిప్రాయంగా ఉన్నది. ఈ నేపథ్యంలో ఏపీ నాగార్జునసాగర్‌కు గండికొట్టి నీళ్లు తరలించుకునే ప్రాజెక్టు చేపట్టడం నిబంధనలకు విరుద్ధం. అయినా కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నది. ఫలితంగా రాష్ట్ర నీటిహక్కులకు రక్షణ లేకుండా పోతున్నది. విపక్షం వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేని కాంగ్రెస్ పాలకులు ఎదురుదాడికి దిగడం అర్థరహితం. వితండవాదాలు ఎక్కువ రోజులు నిలబడవు. ప్రజలకు అనుభవాలే అసలైన సాక్ష్యాలు! ఈ వివాదంలో మరో ముఖ్యమైన అంశం కేంద్ర ప్రభుత్వ వైఖరి. ఏపీ తెలంగాణ నీటి హక్కులకు తూట్లు పొడుస్తుంటే నిలువరించడంలేదు. అంటే, ఆంధ్రా బాబు కుట్రలో బీజేపీకీ భాగమున్నట్టేనా? ఈ ద్రోహాలు ఇలాగే కొనసాగితే ప్రజాగ్రహం వెల్లువెత్తుతుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తిస్తే మంచిది.
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి
Migratory birds | చిలికా సరస్సుకు ప్రత్యేక అతిథులు.. ఏకంగా 80 జాతుల వలసపక్షుల సందడి.. Video
China flies electric plane | 19 సీట్ల ఎలక్ట్రిక్ విమానం.. విజయవంతంగా నడిపి పరీక్షించిన చైనా

