ఈ నదేమిటిలా రిహార్సల్ లేని నృత్యం చేస్తున్నది ఈ నది కథేమిటి ఎవర్రాసారు స్క్రిప్ట్‌ను ఎవరు కూర్చారు స్క్రీన్‌ప్లే ఎవరు రూపొందించారు దర్శించిన ప్రతిసారీ ఎగిసి ఎగిసి నా లోకి ప్రవహించి నన్ను చైతన్యపరుస్తున్నది రక్తనాళాల్లో ఉరకలెత్తి
పరవశింపజేస్తున్నది
గతాన్ని తడుముతూ సమస్త కలల్నీ రాగాల్నీ శృతి చేస్తున్నది అద్భుతమైన బాల్యాన్నీ అమాయకపు యవ్వనాన్నీ ఆలపిస్తూ స్వరాన్ని సవరిస్తున్నది. చెదిరిపోయిన నా చిరునామాని తిరిగి లిఖిస్తున్నది. ఈ నది గడుసైంది ఓటములను నిమురుతున్నది గెలుపుల్ని పొంగిస్తున్నది. దుఃఖాన్ని కరిగిస్తున్నది సంతోషాల్ని స్వాగతిస్తున్నది.
ఈ నది మామూలుదేమీ కాదు. నా దేహాన్నీ ఆత్మనీ ముంచెత్తి చెత్తనంతా కడిగేసి నాకు పునస్పర్శనిస్తున్నది పునర్జీవితాన్నిస్తున్నది. నది నా లోనే కాదు నా భుజం మీద చెయ్యేసి కొత్త దారంట నడిపిస్తున్నది నేనో గొప్ప ప్రవాహాన్నయి
ఉరకలెత్తుతున్నాను అవును ఈ నది నా ఉనికి.. నా ఊపిరి నా నేస్తం.. నా సమస్తం.
– వారాల ఆనంద్
9440501281