ఆరెస్సెస్-బీజేపీలు ఒకవేళ మోదీ స్థానంలో వేరొకరిని తెచ్చిపెట్టాలనుకుంటే.. వాస్తవికత, వ్యూహాత్మక దృక్కోణంతో లెక్కలు వేసుకుంటాయి. మోదీ ఇన్నాళ్లు నిలబెట్టుకుంటూ వస్తున్న ఇమేజ్ కూలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు వారికి ఆయన అవసరం లేదు.
నరేంద్ర మోదీని ఆయన వయస్సు కారణంగా ప్రధాని పదవి నుంచి తొలగించనున్నారనే ఒక బోగస్ చర్చ రాజకీయ వర్గాలు, సోషల్ మీడియా, మీడియాలో గత కొన్ని వారాలుగా విస్తృతంగా జరుగుతున్నది. ప్రధానిగా మోదీ కొనసాగడమనేది అనేది అతని వయస్సుతో ముడిపడి ఉందనే తప్పుడు ఊహాగానాల ఆధారంగా ఈ చర్చ నడుస్తున్నది. ఆరెస్సెస్, బీజేపీలు 75 ఏండ్ల రిటైర్మ్మెంట్ నిబంధనను మోదీకి వర్తింపజేస్తాయనే ఆశ.. ఆరెస్సెస్ సూత్రాలను సరిగ్గా అర్థం చేసుకోలేని అవగాహన నుంచి పుట్టుకొచ్చింది. బీజేపీ కురువృద్ధులు లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను వయస్సు కారణంగా రాజకీయాల నుంచి తప్పించినట్టు చెప్తున్నప్పటికీ, వారిని పక్కన పెట్టడానికి అసలు కారణం మోదీ-షా ద్వయం గుత్తాధిపత్యంతో పొసగకపోవడమే. ఒకవేళ మోదీ స్థానాన్ని భర్తీ చేయాలనే ప్రణాళిక గనుక ఉంటే, ఆయన తమ భవిష్యత్తు కాదని ఆరెస్సెస్-బీజేపీ గ్రహించడమే అందుకు ప్రధానం కారణం. తాను ప్రస్తుతమున్న స్థితి నుంచి ఆయన తిరిగి పుంజుకోవడం దాదాపు అసాధ్యం.
సంఘ్ పరివార్ ఇప్పుడు మోదీని ప్రధానిగా కొనసాగించడం కంటే అధికారాన్ని సుస్థిరం చేసుకోవడంపైనే ఎక్కువగా ఆసక్తి చూపుతుంది. మోదీ తన చరిష్మా, నియంత్రణను కోల్పోయారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో మెజారిటీ సాధించడంలో బీజేపీ విఫలమవడం మోదీ ప్రజాదరణ తగ్గిందనడానికి స్పష్టమైన రుజువు. తనకు నచ్చిన వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా నియమించలేకపోతున్నారు. ఇది ప్రభుత్వం, సంస్థపై అతని పూర్తి నియంత్రణ పట్ల సంఘ్ పరివార్‌లో ఉన్న అంతర్గత అసమ్మతికి నిదర్శనం. అమిత్ షా పరోక్ష ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు వీలుగా మోదీ మరో జేపీ నడ్డాను పార్టీపై రుద్దడానికి అనుమతించేందుకు ఆరెస్సెస్ సిద్ధంగా లేనట్టు తెలుస్తున్నది.
2014లో మోదీ స్వయంగా అమలు చేసిన 75 ఏండ్ల నిబంధన గురించి ఆరెస్సెస్‌లో చర్చ నిస్సందేహంగా జరుగుతున్నది. కానీ, అది ఆ నిబంధనకు కట్టుబడి ఉండాలన్న సంకల్పం కంటే ఆయనపై ఒత్తిడి తీసుకురావడానికి ఒక సాకు మాత్రమే. అయితే, మోదీ ఇమేజ్ మరింతగా దిగజారిన నేపథ్యంలో ఇప్పుడు ఆ చర్చ సాధ్యమైంది.
రాజకీయ అభూత కల్పనల ఇమేజ్ను ఎలా రూపొందించారనే అంశంతో సంబంధం లేకుండా అది ఈరోజు కాకపోతే ఏదో ఒక రోజు బద్దలవడం ఖాయం. మోదీ ఇమేజ్ ఊహించిన దానికంటే ఎక్కువ కాలమే మనుగడ సాగించింది. పదకొండేండ్లు అనేది తక్కువ సమయమేమీ కాదు. నెరవేర్చని హామీలు, విస్మయపరిచే అబద్ధాలు, కాలం చెల్లిన ఆలోచనల మూలంగా అసాధారణమైన రాజకీయ ప్రక్రియ ప్రస్తుతం ధూళిలో కలిసిపోతున్నది.
మోదీ ఏమిటనేది ఇప్పుడు తెలిసొచ్చింది. ఆయన నిజస్వరూపాన్ని ప్రజలు చూడగలుగుతున్నారు. అదే వాక్చాతుర్యం, అదే భాష, అవే ఉపమానాలు, అదే ట్రిక్‌ను పదే పదే వల్లె వేస్తుండటంతో అవి తమ జిలుగు వెలుగుల్ని కోల్పోయాయి. ఉద్యోగాలు కల్పించడంలో, ధరలను నియంత్రించడంలో, నల్లధనాన్ని వెనక్కి తీసుకురావడంలో, మహిళలకు సామాజిక సురక్షిత వాతావరణం కల్పించడంలో ఘోరంగా విఫలమైన నేపథ్యంలో.. మోదీ తాజా వాగ్దానం ‘వికసిత్ భారత్-2047’ డొల్లలాగా కనిపిస్తున్నది.
ఈడీ, సీబీఐ లాంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తూ రాజకీయ ప్రత్యర్థులను వెంటాడటం వాస్తవమేనన్న ఆరోపణలకు బలాన్ని చేకూర్చగా.. న్యాయవ్యవస్థ, ఎలక్షన్ కమిషన్, మీడియాలో నెలకొన్న దయనీయ పరిస్థితులు దేశంలో ప్రజాస్వామ్యం క్షీణిస్తున్నదనే ఆరోపణల్లో నిజం లేకపోలేదని ప్రజలు నమ్మేలా చేశాయి.
సమర్థవంతమైన, విశ్వసనీయమైన టీమ్‌ను రూపొందించుకోకుండా, అందుకు బదులుగా షా, అజిత్ ధోవల్, జైశంకర్, నిర్మలా సీతారామన్‌లతో కూడిన తన చిన్న కోటరీపై మోదీ అతిగా ఆధారపడటం పరిపాలన కుంటుపడేలా చేసింది. రాష్ర్టాల్లోనూ బలమైన నేతలకు బదులుగా చిన్న చిన్న నాయకులకు నాయకత్వ పగ్గాలను అప్పగించారు. తద్వారా సంస్థలో అంతర్గతంగా అసమ్మతి బీజాలను నాటారు.
కానీ, ఎంతో చాకచక్యంగా రూపొందించుకున్న ఒక అభూత కల్పనల ఇమేజీని మరో గొప్ప ఇమేజీని అడ్డువేయడం ద్వారా కాపాడుకుంటూ వస్తున్నారు. అయితే, ‘ప్రపంచవ్యాప్తంగా మోదీని అభిమానిస్తున్నారు. విదేశాల్లోనూ ఆయన జయజయధ్వానాలు మోగుతున్నాయి’ అని వారు చెప్పుకొచ్చారు. ఆ గొప్ప అభూత కల్పనల ఇమేజ్ ఇటీవల అకస్మాత్తుగా పేలిపోయింది. భారతీయులకు సంకెళ్లు వేసి, అవమానకరంగా సైనిక విమానాల్లో స్వదేశానికి పంపించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభూత కల్పనల మోదీ ఇమేజ్ను తీవ్రంగా గాయపరిచారు. పుండు మీద కారం చల్లినట్టుగా ట్రంప్ చేసిన సుంకాల యుద్ధంలో విధేయులైన మోదీ సర్కారు నుంచి కనీస తిరస్కరణ కనిపించకపోవడం మరింత దెబ్బతీసింది.
చైనాను తప్పుగా అర్థం చేసుకున్న మోదీ ఇప్పటికే ఒక సమస్యను సృష్టించారు. గాజాలో ఇజ్రాయెల్ నరమేధంపై స్పందించకుండా దేశ ప్రతిష్టను దిగజార్చారు. ఐక్యరాజ్య సమితిలో కాల్పుల విరమణ తీర్మానంపై ఓటింగ్‌ను బహిష్కరించేందుకు కొన్ని దేశాలతో చేతులు కలపడం ద్వారా భారత్‌కు తలవంపులు తెచ్చిపెట్టారు. గాజాలో జరుగుతున్న మారణహోమంపై అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతుండగా, మన దేశంలో మాత్రం మోదీ సర్కారు ప్రజాస్వామ్యానికి చోటివ్వడం లేదు.
పహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ హస్తం ఉందనే భారత వాదనను ఏ దేశం సమ్మతించకపోవడంతో మన దౌత్య విధాన ఘోర వైఫల్యం బహిర్గతమైంది. ముంబై దాడి సమయంలో దౌత్యపరమైన ఎదురుదాడి ద్వారా నాటి మన్మోహన్సింగ్ ప్రభుత్వం పాక్‌ను పూర్తిగా ఇరుకున పడేసింది. ముంబై దాడి నాటి పరిస్థితితో పోల్చి చూస్తే ఇది ఆందోళన కలిగించే పరిణామం. పుండు మీద కారం చల్లినట్టు.. పాక్, భారత్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని తానే కుదిర్చానని ట్రంప్ పదే పదే చెప్తున్నారు. ట్రంప్ వాదనను మోదీ బహిరంగంగా ఖండించే ధైర్యం కూడా చేయలేదు. ఈ విధంగా లొంగిపోయి 56 అంగుళాల ఇమేజ్ను భూమి లోతుల్లో పాతిపెట్టారు.
అమెరికాలో అదానీ గ్రూప్ చట్టపరమైన చిక్కులు మోదీ చేతులను కట్టిపడేశాయనే ఊహాగానాలు.. భారత ప్రధాని తన వ్యక్తిగత బాధ్యతల మధ్యన కొట్టుమిట్టాడుతున్నారనే వాదనను మరింతగా పెంచింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆరెస్సెస్-బీజేపీలు తమ భవిష్యత్తు గురించి నిజంగానే సందేహాలను పెంచుకోవాలి. మోదీ ఇమేజ్ ఇప్పుడు సరిదిద్దలేని స్థాయికి చేరుకున్నది. ఒకవేళ మోదీని గనుక తొలగించాలనుకుంటే, అందుకు కారణాలు ఎన్నో ఉన్నాయి. తన వాగ్దానాలను నెరవేర్చడంలో మోదీ విఫలమయ్యారు. భారతదేశ ఖ్యాతిని ప్రపంచ సమాజంలో దెబ్బతీశారు. భారతదేశ లౌకికతత్వాన్ని ధ్వంసం చేశారు. గాంధేయ సిద్ధాంతాలైన సత్యం, అహింసలను బలప్రయోగం గురించిన తన సూత్రీకరణలతో మోదీ గందరగోళపరిచారు.
మోదీ పట్ల అసంతృప్తికి వయస్సు కారణం కానే కాదు. వయస్సు అంశాన్ని తెరపైకి తీసుకురావడం ఈ చర్చను పలచన చేయడమే. తక్కువ వయస్సున్న అమిత్ షా, అనురాగ్ ఠాకూర్ లేదా తేజస్వీ సూర్య మంచి ప్రధానమంత్రి అవుతారా? అసమర్థత, వైఫల్యాలే అసలు కారణాలు, వయస్సు కాదు. మోదీ ఇప్పటికీ తమకు ఓట్లను రాల్చగలిగితే, ఆయన తన అంతర్జాతీయ, కార్పొరేట్ సమ్మతిని కాపాడుకోగలిగితే, మోదీ తొలగింపు గురించి ఆరెస్సెస్-బీజేపీ కలలో కూడా ఆలోచించేవి కావు.
ఆరెస్సెస్-బీజేపీలు ఒకవేళ మోదీ స్థానంలో వేరొకరిని తెచ్చిపెట్టాలనుకుంటే.. వాస్తవికత, వ్యూహాత్మక దృక్కోణంతో లెక్కలు వేసుకుంటాయి. మోదీ ఇన్నాళ్లు నిలబెట్టుకుంటూ వస్తున్న ఇమేజ్ కూలిపోయిన నేపథ్యంలో ఇప్పుడు ఆయన వారికి అవసరం లేదు. ఎందుకంటే, ఆయన ప్రజాదరణను నిలబెట్టిన యంత్రాంగం ధ్వంసమైపోయింది. తనను తాను జీవశాస్త్రేతర దైవాంశ సంభూతుడిగా చెప్పుకొనే ప్రయత్నం కూడా ఇప్పుడు ఆయన ఇమేజ్ను పునరుద్ధరించే అవకాశం లేదు. ఆరెస్సెస్ ఒక అసమర్థ ప్రధానితో అసౌకర్యంగా ఉండొచ్చు, వృద్ధాప్య నాయకుడితో కాదు.
మోదీకి తనను తాను నిరూపించు కోవడానికి బీహార్ ఎన్నికలు చివరి అవకాశమని కొందరు పరిశీలకులు భావిస్తున్నారు. అది తప్పుడు భావన కావచ్చు. ఎందుకంటే, ఎన్నికల విజయాలు ఇప్పుడు అంతటి ప్రభావాన్ని కలిగి ఉండవు. హర్యానా, మహారాష్ట్రలో బీజేపీ గెలిచింది. కానీ, ఆ గెలుపు మోదీని రాజకీయంగా బలపరచడం కంటే ఎన్నికల్లో అక్రమాల గురించిన అనుమానాలను మరింతగా పెంచింది. బీహార్‌లో ఎన్నికలకు ముందు ఓటర్ల జాబితాలో ప్రత్యేక సవరణ కోసం ఎన్నికల సంఘం చూపిస్తున్న ఆత్రుత ఇప్పటికే వాతావరణాన్ని కలుషితం చేసింది.
ఆరెస్సెస్-బీజేపీలకు ఇప్పుడు కొత్త బృహత్తర కార్యం అవసరం. మోదీ సామాజిక ఒడంబడిక గడువు ముగిసిందని వారికి తెలుసు. 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని మోదీ నడిపించేందుకు అనుమతించడాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో ఊహించలేం. భర్తీ ఎప్పుడనేది కాలమే నిర్ణయిస్తుంది. అందుకు రాజకీయ అవసరాలు కారణం తప్ప, వయస్సు కానే కాదు.