PM Modi | పాథాలజిస్టుల కంటే వేగంగా ఎన్నికల అనంతరం విశ్లేషణలు చేసే అనేకమంది రాజకీయ విశ్లేషకులలాగా తానేమీ రాజకీయ పండితుడిని కాదని అంగీకరించేందుకు ఈ రచయితకు ఎలాంటి సంకోచం లేదు. కానీ, కొన్ని విషయాలు మాత్రం రాజకీయాల పట్ల ఆసక్తి ఉండే నాలాంటి ఔత్సాహిక విద్యార్థులకు కూడా స్పష్టంగా అర్థమవుతాయి. ఈ రాజకీయ విశ్లేషణ రంగంలో రెండు విషయాలు ప్రముఖంగా కనిపిస్తాయి. వాటిలో మొదటిది, ఈ పాలనను మోదీ 3.0గా ఎలా వివరిస్తారు? ఇది అంత ప్రధానమైన విషయం కాదు, పేరు గురించి మాత్రమే. రెండోది, చాలా ముఖ్యమైనది. ఈ పాలన పూర్తిగా ఐదేండ్ల పాటు కొనసాగుతుందా? లేదా 1999లో అప్పటి ప్రధాని వాజపేయి విశ్వాస తీర్మానంలో ఓడిపోయిన విధంగా మళ్లీ మనం చూడబోతున్నామా? ఈ నేపథ్యంలో ఎవరికి ఏ మంత్రి పదవి ఇచ్చారు, ఎవరు ఏ శాఖపై మల్లగుల్లాలు పడుతున్నారనేది క్షణికావేశం మాత్రమే.
ఇప్పుడు పేరు (మోదీ 3.0) గురించి చూద్దాం. వాస్తవానికి ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ ఇలా ప్రతీ మీడియా ప్లాట్‌ఫారమ్ దీన్ని మోదీ 3.0గా అభివర్ణిస్తున్నది. సాంకేతికంగా వారు చెప్పేది సరైనదే కావచ్చు. నరేంద్ర మోదీ వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. కానీ, ఆ వివరణ వాస్తవికతను మభ్యపెడుతున్నది. ప్రతి ర్యాలీలో, ప్రతి ప్రసంగంలోనూ ఈ ఎన్నికలు తన పాలనకు రెఫరెండమని మోదీ ప్రచారం చేశారు. బీజేపీ 370 సీట్లు దాటుతుందని, ఎన్డీయే కూటమి 400 స్థానాల్లో గెలుస్తుందని ఢంకా బజాయించారు. అయితే ఫలితాల్లో వచ్చిన అంకెల ప్రకారం చూస్తే.. ఈ రెఫరెండమనేది మోదీకి మిశ్రమంగా ఉన్నది. పదేండ్ల పాటు నిరంతరాయంగా దేశాన్ని పాలించిన వ్యక్తి తన పార్టీని 240 సీట్లలో గెలిపించడం, తన ప్రధాన ప్రత్యర్థి పార్టీ కాంగ్రెస్ కంటే రెండున్నర రెట్లు ఎక్కువ స్థానాలు పొందడం విశేషం. అయితే దీనివెనుక అసలు వాస్తవం వేరే ఉన్నది.
ఇది పూర్తిగా మోదీ విజయం కాదు. చంద్రబా బు, నితీశ్‌కుమార్‌లు లేకపోతే మోదీ మూడోసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసేవారు కాదు. నేను ఈ పాలనను మోదీ 3.0గా కాకుండా ఎన్డీయే 5.0గా అభివర్ణించాలనుకుంటున్నాను. ఇది పర్సెప్షన్‌కు సంబంధించిన విషయం. పర్సెప్షన్ అనేది రాజకీయాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. పర్సెప్షన్‌కు సంబంధించిన తర్వాతి పోరు ఈ ఏడాది అక్టోబర్‌లో జరుగనున్నది. ఇండియా కూటమిలోని పార్టీ లు, కొంతమంది మోదీ వ్యతిరేకులు ప్రభుత్వం కూలిపోతుందని అంచనా వేయడం మొదలుపెట్టా రు. మంత్రి పదవులు, శాఖల కేటాయింపులో జరుగుతున్న వివాదాలే అందుకు మొదటి సంకేతమని వారు చెప్తున్నారు. ఇది చిన్నపిల్లల విశ్లేషణ. ప్రభు త్వం సురక్షితంగానే ఉన్నది. కనీసం అక్టోబర్ వరకు అంటే.. రోహ్తక్, రాంచీ, రాయ్‌గఢ్ ఈ ఆటలోకి వచ్చేంతవరకు ప్రభుత్వం సురక్షితంగానే ఉంటుం ది. ఆ తర్వాత ఏమైనా జరగవచ్చు. రోహ్తక్, రాం చీ, రాయ్‌గఢ్ ఎందుకంటే.. అక్టోబర్‌లో హర్యానా, జార్ఖండ్, మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.
రాజకీయం అనేది పర్సెప్షన్‌కు సంబంధించినది. కాబట్టి, రాజ్‌నాథ్‌సింగ్, అమిత్ షా, నిర్మలా సీతారామన్, జై శంకర్లకు పాత శాఖలనే కేటాయించి తన మూడో పర్యాయం పాలనను నరేంద్ర మోదీ ప్రారంభించడం వెనుక కూడా బలమైన పర్సెప్షన్ ఉంది. అదేమిటంటే.. కొనసాగింపు, స్థిరత్వం. కానీ, పర్సెప్షన్ అనేది చాలా త్వరగా మారిపోతుంది. మరీ ముఖ్యంగా పర్సెప్షన్ మార్పును సరిదిద్దడంలో, అంచనా వేయడంలో విశ్లేషకుల కంటే రాజకీయ నటులు చాలా తెలివైనవారు. దానికి అనుగుణంగా వారు వ్యవహరిస్తారు. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు ఎలా వ్యవహరిస్తారనే అంశమే.. ఎన్డీ యే కూటమిలోని పార్టీలు టీడీపీ, జేడీయూ, ఎల్జేపీ, జేడీఎస్ తమ పాచికలను ఎలా పారిస్తాయన్నది నిర్ణయించనున్నది.
అతి విశ్వాసంతో యూపీలో క్షేత్రస్థాయిలో బీజేపీపై ఉన్న వ్యతిరేకతను అంచనా వేయడంలో అత్యధికమంది విశ్లేషకులు విఫలమైనట్టుగానే.. ఆయా రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల తీర్పు ఎటువైపు ఉంటుందనేది అతివిశ్వాసంతో చెప్పడం కూడా వెర్రితనమే అవుతుంది. కానీ, ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పార్టీల పనితీరు, క్షేత్రస్థాయి పరిస్థితులను బట్టి కొంతమేరకు అవగాహనకు రావచ్చు.
మొదట హర్యానా గురించి చెప్పుకోవాలి. పదేం డ్ల బీజేపీ పాలన తర్వాత హర్యానాలో కాంగ్రెస్ పార్టీ పునరుత్థానానికి రోహ్తక్ ప్రతీకగా నిలవనున్నది. ఇది ఎప్పటికీ కాంగ్రెస్‌కు కంచు కోటే. దాంతో పాటు రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన భూపేందర్‌సింగ్ హుడాకు స్వస్థలం కూడా. ఇటీవల 63 శాతం ఓట్లతో ఆయన కుమారుడు దీపేందర్ హుడా రోహ్తక్ నియోజకవర్గంలో గెలుపొందారు. పదేం డ్ల డబుల్ ఇంజిన్ సర్కార్ పట్ల వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తున్నది. ఇంకా చాలా కారణాలున్నాయి. హర్యానాలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని, బీజేపీ ఓటమి పాలయ్యే అవకాశాలున్నట్టు చెప్పవచ్చు. జార్ఖండ్ ప్రత్యేక రాజకీయాలను కలిగి ఉన్నది. ఆ రాష్ట్రం ఏర్పడిన 2000 నుంచి 2014 వరకు అస్థిర ప్రభుత్వాల పాలనే కొనసాగింది. ఆ తర్వాత బీజేపీ నేతృత్వంలోని కూటమి ఐదేండ్లు పాలించింది. ఇప్పుడు జేఎంఎం కూటమి పాలన కొనసాగుతున్నది. మనీ లాండరింగ్ అభియోగాలపై ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రస్తుతం జైల్లో ఉన్నారు. ఇక్కడ ఇరు పక్షాలకు సమాన అవకాశాలున్నట్టు చెప్పడం సరైనది. 48 ఎంపీ సీట్లు, 294 ఎమ్మెల్యే స్థానాలున్న అతి ముఖ్యమైన రాష్ట్రం మహారాష్ట్ర విషయానికొస్తే.. లోక్‌సభ ఎన్నికల ఫలితాలు బీజేపీకి షాక్ ఇచ్చా యి. ఆ పార్టీ బలం 23 నుంచి 9కి పడిపోయింది. దాని మిత్రపక్షాలు కూడా సరైన ప్రదర్శనను కనబరచలేదు. అందుకు విరుద్ధంగా ఎంవీఏ కూటమి ఉల్లాసంగా, విశ్వాసంగా కనిపిస్తున్నది. పర్సెప్షన్ మాత్రం ఎంవీఏ కూటమికి అనుకూలంగా ఉన్నది. ఇరుపక్షాలకు సీట్ల పంపకాల విషయంలో సమస్య లు ఎదురవుతాయి. అయితే ఓటములు, ప్రతికూల పరిస్థితుల నుంచి కోలుకొని మరింత బలంగా తిరిగి వస్తుందని బీజేపీకి పేరున్నది. అయినప్పటికీ మహారాష్ట్రలో ఎంవీఏ కూటమే మెరుగైన స్థితిలో ఉందనేది నా భావన.
ఒకవేళ ఈ మూడు రాష్ర్టాల్లో బీజేపీ ఓడిపోతే ఆ పార్టీకి, అగ్రనాయకత్వానికి అనేక పరిణామాలు ఎదురవుతాయి. అదే కనుక జరిగితే ఇకపై ‘బ్రాండ్ మోదీ’ ఇదివరకటిలా ధగధగలతో ప్రకాశించదనే పర్సెప్షన్లో గణనీయమైన పెరుగుదల అతి ముఖ్యమైనది. అప్పుడు చంద్రబాబు, నితీశ్‌కుమార్ ఏం చేస్తారో? రాబోయేరోజులు చాలా ఆసక్తికరంగా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు.
(వ్యాసకర్త: సీ ఓటర్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్) ‘ది క్వింట్’ సౌజన్యంతో…
– సుతాను గురు