తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మైనారిటీలు స్వర్ణయుగాన్ని అనుభవించారు. నాడు వారి జీవితాల్లో వెలుగులు విరజిల్లగా ప్రస్తుత సీఎం రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వ గత 15 నెలల పాలనా కాలంలో మైనారిటీల జీవితాల్లో చీకట్లు కమ్ముకున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన షాదీ ముబారక్ సాయం రూ.లక్షకు తోడు తులం బంగారం కలిపి ఇస్తామని కల్లబొల్లి కబుర్లు చెప్పిన ముఖ్యమంత్రి కనీసం షాదీ ముబారక్ ఇవ్వడానికి కూడా తటపటాయిస్తున్నారు. మైనారిటీ యువతకు, మహిళలకు సబ్సిడీ రుణాలు ఇచ్చేందుకు రూ.1000 కోట్లు కేటాయిస్తామన్నారు. వెయ్యి కాదు కదా, కనీసం రూ.10 కోట్లు కూడా కేటాయించకపోవడం గమనార్హం.
తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ 2023 నవంబర్ 9న హైదరాబాద్ వేదికగా హంగూ ఆర్భాటాల మధ్య మైనారిటీ డిక్లరేషన్‌ను ప్రకటించింది. తాము అధికారంలోకి వస్తే ఎస్సీ, ఎస్టీల మాదిరిగా మైనారిటీలకూ సబ్‌ప్లాన్ ఏర్పాటుచేసి ఏటా బడ్జెట్లో రూ.4,000 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. ఆరు నెలలలోపు కులగణన చేపట్టి విద్య, ఉద్యోగాల్లో మైనారిటీలకు న్యాయంగా దక్కాల్సిన రిజర్వేషన్లు కల్పిస్తామని వాగ్దానం చేసింది. ‘అబ్దుల్ కలాం తోఫా- ఏ- తలీం’ పేరిట ఎంఫిల్ పూర్తిచేసిన మైనారిటీ విద్యార్థులకు రూ.5 లక్షలు, పీహెచ్డీ, పీజీ చేసిన వారికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని పీసీసీ అధ్యక్షుడి హోదాలో రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. అంతేకాదు ఇమామ్, మౌజమ్‌లకు నెల నెలా రూ.10 నుంచి 12 వేల చొప్పున గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు.
బీఆర్ఎస్ హయాంలో మైనారిటీలకు కేసీఆర్ పెద్దపీట వేశారు. 2014-18 వరకు మొదటి పర్యాయంలో మైనారిటీ నేత మహమూద్ అలీని ఎమ్మెల్సీ చేసి, ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2018లో బీఆర్ఎస్ రెండో పర్యాయం అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌తో పాటు ఏకైక మంత్రిగా మహమూద్ అలీ మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. మరోసారి మైనారిటీలకు గౌరవం ఇస్తూ ఎంతో కీలకమైన హోం మంత్రిత్వ శాఖను మహమూద్ అలీకి అప్పగించారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి హయాంలో మైనారిటీలకు రాజకీయంగానూ ప్రాతినిధ్యం లేకుండాపోయింది. మైనారిటీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదు.
గతంలో గవర్నర్ కోటాలో అమీర్ అలీఖాన్‌కు ఒక ఎమ్మెల్సీ ఇచ్చి చేతులు దులుపుకొన్నది. ఇప్పుడు తాజాగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలో మైనారిటీలకు సీటు కేటాయిస్తారని భావిస్తే అందులోనూ మొండిచేయి చూపించారు. అంతకుముందు ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో మైనారిటీలకు ఒక్కటి కూడా దక్కకపోవడం శోచనీయం. మొత్తంగా చెప్పాలంటే.. మైనారిటీల సంక్షేమంలో రేవంత్‌రెడ్డి సర్కార్ పూర్తిగా విఫలమైంది. విఫలమైందని చెప్పడం కంటే కావాలనే విస్మరించిందని చెప్పడం సబబు. సంక్షేమలోనే కాదు, రాజకీయంగాను రేవంత్ రెడ్డి మైనారిటీలను అణగదొక్కుతున్నారు.
కేసీఆర్ హయాంలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు అమలు కాగా, ఇప్పుడు కనీసం షాదీ ముబారక్ చెక్కులు కూడా అందడం లేదు. ఫుడ్ పాయిజన్ కారణంగా మైనారిటీ విద్యార్థులు దవాఖానాల పాలవుతున్నారు. స్వయంగా జర్నలిస్టును అయిన నేను చాలా గురుకులాలను సందర్శించాను. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా ఆయా గురుకులాల్లో సమస్యలు పేరుకుపోతున్నాయి. ఓవర్సీస్ స్కాలర్ షిప్ రాకపోవడంతో విదేశాల్లో మైనారిటీ విద్యార్థులు అరిగోస పడుతున్నారు.
ఆర్ఎస్ఎస్ మూలాలున్న సీఎం రేవంత్ ఉద్దేశపూర్వకంగానే మైనారిటీలను విస్మరిస్తున్నారు. పవిత్ర రంజాన్ దాదాపు ముగిసినా రేవంత్‌రెడ్డి కనీసం సమీక్ష చేయలేదు. కేసీఆర్ ఇచ్చిన రంజాన్ తోఫాను సీఎం రేవంత్ పేదలకు దూరం చేశారు. రేవంత్ పాలనలో పేద ముస్లింలకు ఈద్ జరుపుకొనేందుకు కూడా స్తోమత లేకుండాపోయింది. మైనారిటీల పార్టీగా గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ కుప్పలు తెప్పలుగా వాగ్దానాలు చేసి మైనారిటీలను మురిపించి, మసిపూసి మారేడుగాయ చేసి అధికారంలోకి వచ్చింది. కానీ, మైనారిటీలకు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదు. ఇప్పటికైనా రేవంత్ కండ్లు తెరిచి మైనారిటీ సంక్షేమంపై దృష్టిపెట్టాలి. లేకపోతే రానున్న కాలంలో మైనారిటీలు కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పడం ఖాయం.
– కారుపోతుల పాండరి గౌడ్ 70138 24056