భారతదేశ మధ్యతరగతిని రోజురోజుకు మరింత సంక్షోభంలోకి నెట్టివేస్తున్నది పన్నులు, ద్రవోల్బణం మాత్రమే కాదు. అంతకుమించిన మరో అంశం ఒకటుంది. అదేమిటంటే.. ఈఎంఐ. అత్యంత ఆందోళనకరమైన ఈ విషయం గురించి ప్రముఖ ఆర్థిక సలహాదారు తపస్ చక్రవర్తి మధ్యతరగతిని హెచ్చరించారు. ఈ మేరకు ఆయన లింక్డ్ఇన్లో పోస్టు చేశారు.
మధ్యతరగతి ప్రజలు తమకు తెలియకుండానే అగాథంలోకి కూరుకుపోతున్న ఉచ్చు ఈఎంఐ. ఈ ట్రాప్ సైకిల్ గురించి చక్రవర్తి విపులంగా వివరించారు. ‘సంపాదించు- అప్పులు తీసుకో- తిరిగి చెల్లించు పునరావృతం చేయి- నో సేవింగ్’.. ఇది చక్రవర్తి చెప్పిన ట్రాప్ సైకిల్. మధ్యతరగతి అవసరాల కొనుగోలుకు ఆర్థిక సాధనంగా ప్రారంభమైన ఈఎంఐ అనే జాడ్యం ఈ రోజు ఒక జీవన విధానంగా మారిపోయింది. ఫోన్.. ఈఎంఐతోనే, ఫ్రిడ్జ్.. ఈఎంఐతోనే, సోఫా, ఏసీ, విమాన టిక్కెట్లు.. అన్నింటి కొనుగోళ్లు ఈఎంఐ సాయంతోనే. ఆఖరికి నిత్యావసరాలు కూడా. ఈ రోజుల్లో అప్పు తీసుకోవడం ఎంత సులభతరమైందంటే.. ఎలాంటి పేపర్ వర్క్ ఉండదు. జస్ట్ స్వైప్ చేస్తే చాలు.
అయితే, ఈ సమస్య ఎంత లోతుల్లోకి పాతుకుపోయిందో డేటా చూస్తే అర్థమవుతుంది. గృహ రుణాలు దేశ జీడీపీలో 42 శాతానికి చేరుకున్నాయి. క్రెడిట్ కార్డులు, వ్యక్తిగత రుణాలు, బయ్ నవ్- పే లేటర్ సర్వీసెస్.. లాంటి సురక్షితం కానటువంటి రుణాలు 32.3 శాతానికి ఎగబాకాయి. మన దేశంలో 70 శాతం ఐఫోన్లు ఈఎంఐల మీద తీసుకున్నవే. చిన్న మొత్తంలో రుణాలు తీసుకున్న 11 శాతం మంది ఇప్పటికే రుణఎగవేతదారులుగా మారారు. ప్రతీ ఐదుగురిలో ముగ్గురు ఒకే సమయంలో మూడు కంటే ఎక్కువ రుణాల భారాన్ని మోస్తున్నారు.
‘మనం వస్తువులను మాత్రమే కొనుగోలు చేయడం లేదు. ఒకదాని తర్వాత ఒకటి లెక్కన పొరలు పొరలుగా అప్పుల కొండను నిర్మిస్తున్నాం. ఈఎంఐలను ఎలాగైనా మేనేజ్ చేసుకోవచ్చని అనుకుంటాం. కానీ, ఆ పొర ఏదో ఒక సమయంలో చిరిగిపోతుంది’ అని చక్రవర్తి హెచ్చరించారు. ఫోన్ ఈఎంఐ నెలకు రూ.2,400; ల్యాప్టాప్ ఈఎంఐ నెలకు రూ.3,000; ద్విచక్ర వాహనం ఈఎంఐ రూ.4,000; క్రెడిట్ కార్డ్ బిల్లు రూ.6,500 లాంటి ఖర్చులన్ని కలిసి మీ నెల సంపాదన రూ.25 వేలను ఇట్టే కరిగించేస్తాయి. ఒక్క పైసా పొదుపు ఉండదు. ఇలాంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఒక హెల్త్ ఎమర్జెన్సీ వస్తే మీ జీవితం అతలాకుతలం అవుతుంది.
రోజురోజుకు మరింతగా విస్తృతమవుతున్న ఈఎంఐ అనేది వ్యక్తిగత సమస్య మాత్రమే కాదు. తక్కువ పొదుపు అంటే తక్కువ పెట్టుబడి అని అర్థం. అదే విధంగా రుణ భారం ఎక్కువైతే రుణ ఎగవేతకు దారితీస్తుంది. ఈఎంఐల ఒత్తిడి ఎక్కువైతే ఉత్పాదకతపై ప్రభావం పడుతుంది. మధ్యతరగతి ఒత్తిడికి గురైతే దేశం ఉత్పాదకత పడిపోతుంది. తద్వారా ఇది ఒక్క కుటుంబాన్ని మాత్రమే కాదు, దేశంలోని అందరినీ ప్రభావితం చేస్తుంది.
ఈ నేపథ్యంలో ఈఎంఐ ఉచ్చులో చిక్కుకోకుండా ఉండేందుకు ఇప్పటి నుంచైనా తగిన చర్యలు చేపట్టాలి. అందుకు చక్రవర్తి పలు సూచనలు చేశారు. ముందుగా మొత్తం ఈఎంఐ భారాన్ని చెక్ చేసుకోవాలి. అది మీ నెలవారీ ఆదాయంలో 40 శాతం కంటే ఎక్కువగా ఉంటే, మీరు ఈఎంఐ ట్రాప్లో చిక్కుకున్నట్టే. ఆ పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పటికైనా ఒక్కసారి తమ ఆర్థిక పరిస్థితి గురించి పునశ్చరణ చేసుకోవాలి. భవిష్యత్తు కోసం ఇప్పటినుంచే అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. నెలకు రూ.500 అయినా సరే. జీవితంలో విజయవంతమయ్యారని నలుగురిలో కనిపించడానికి అప్పు చేయడం సరికాదు. చిన్న మొత్తంలో అయినా పెట్టుబడి పెట్టడం ప్రారంభించాలి. ఒత్తిడితో జీవించడం అంత సులువు కాదు. మీ తాహతుకు తగని వస్తువులను కలిగి ఉండటం విజయం కానేకాదు. మంచిగా జీవించాలనే మీ కల రుణ ఉచ్చులో చిక్కుకోకూడదు. స్వేచ్ఛ అంటే ఎక్కువగా సంపాదించడం కాదు, తక్కువగా రుణ భారాన్ని కలిగి ఉండటం.