అసలు రేవంత్ రెడ్డి వంటి వ్యక్తిని ముఖ్యమంత్రి చేయటం ఎందుకు? తిరిగి మీనాక్షి నటరాజన్ వంటి వ్యక్తిని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకురాలి పేరిట ఆయనపై నియంత్రణ కోసం నియమించటం ఎందుకు? ఈ చర్చ ఇటువంటి విచిత్ర వైరుధ్యాల ప్రస్తావనతో ఆగేది కాదు. రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్‌ల గురించి మాట్లాడుకోవటంతో ముగిసేది కాదు. ఈ పనులు చేసిన పార్టీ అధినాయకుడు ఇటువంటి వైరుధ్యాలు చూపే స్థితికి ఎందుకు లోనవుతున్నారన్నది దీనంతటి వెనుక గల మౌలికమైన ప్రశ్న. అది అర్థమైతే తప్ప మనకు రేవంత్, మీనాక్షిల నియామకాలు అర్థం కావు.
ఆ మౌలిక ప్రశ్నలోకి వెళ్లేముందు పై ఇద్దరు వ్యక్తుల గురించి కొంత చెప్పుకుందాం. రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు 15 నెలల కాలంలో అందరికీ అర్థమైందే. మీనాక్షి నటరాజన్‌ను ఫిబ్రవరి రెండవ వారం చివరన పర్యవేక్షకురాలిగా నియమించినప్పటినుంచి ఈ నాలుగు వారాలలో తన మాటలను, చేతలను ప్రశంసిస్తూ పార్టీలో, మీడియాలో చాలానే చూస్తున్నాం. ముఖ్యమంత్రి విషయం అందరికీ తెలిసిందే కానీ, పర్యవేక్షకురాలి గురించి పరిశీలించవలసినవి కొన్నున్నాయి. అవేమిటో తర్వాత చూద్దాం.
కాంగ్రెస్ ఒక సుదీర్ఘమైన చరిత్ర, సంప్రదాయాలు, ప్రతిష్ఠ గల పార్టీ. అందుకు భిన్నంగా రేవంత్‌కు దానితో పోల్చదగిన చరిత్ర, సంప్రదాయాలు, ప్రతిష్ఠ లేవు. ఉన్నదంతా నెగెటివ్ రికార్డు. ఇది రాహుల్ గాంధీకి తెలుసు. అయినప్పటికీ ఆయనను ఎందుకు ముఖ్యమంత్రి చేశారు? అటువంటి అగత్యం ఎందుకు ఏర్పడింది? తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయానికి కాంగ్రెస్ పార్టీ దేశమంతటా దయనీయ స్థితిలో ఉన్నది. ఆ స్థితి ఏర్పడిన పతన క్రమంలోకి ఇక్కడ వెళ్లనక్కరలేదు గానీ, అప్పటి ఆ దయనీయ స్థితిలో మాత్రం కొంత ఊపిరి అవసరమైంది. హిమాచల్, కర్ణాటక గాక తెలంగాణలోనూ ఊపిరి లభించటం ఒక విధంగా జీవన్మరణ సమస్యగా మారింది. అటువంటి సంకట స్థితిలో ఎంతోకొం త కాంగ్రెస్ తరహా చరిత్ర, సంప్రదాయాలు, ప్రతి ష్ఠ గల వ్యక్తులు, పెద్ద మనుషులనుకునేవారు, సం యమనంతో వ్యవహరించే గౌరవనీయులు ఆ ల క్ష్యాన్ని సాధించలేరని నాయకత్వం భావించింది. లేదా, అట్లా సాధించలేని సంకటస్థితిని సృష్టించుకున్నది కాంగ్రెస్ నాయకత్వమే.
అందుకు కారణం వారి దశాబ్దాల వైఫల్యాలు. ఇదే విషయాన్ని మరొక విధంగా చెప్పాలంటే, తమ దశాబ్దాల వైఫల్యంతో ప్రజాదరణ కోల్పోయి సంకటస్థితిని సృష్టించుకున్నారు. దేశమంతటా అదే స్థితి ఉన్నది. దాని నుంచి సవ్యమైన, సమర్థవంతమైన పనితీరుతో బయటపడగలిగినా, ఆ మాట గుర్తించలేరు. అటువంటి నమ్మకం ఉండదు. కనుక, అధికార లక్ష్యసాధన కోసం ‘ఎటువంటి వారైనా సరే’నని భావిస్తారు. పని జరిగితే అదే పది వేలు. అటువంటి ఆలోచనల మధ్య రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి తరహా వీధి నాయకుడు ఒక ఆశాకిరణంగా తోచారు.
పార్టీ ఢిల్లీ నాయకత్వం తన సంకటస్థితిలో హర్యానా, కర్ణాటకలలో తెలిసి తెలిసి అబద్ధపు హామీలిచ్చి అధికారాన్ని సంపాదించిన పద్ధతిలోనే తెలంగాణలోనూ తెలిసి తెలిసి అబద్ధపు హామీలిచ్చి అయినా గెలవాలనుకోవటం ఒకవైపు ఉండగా, రెండవవైపు అందుకు తగినవాడైన రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీకి తరుణోపాయంగా కన్పించారు. తన దురుసుతనం, దురుసు మాటలు, వెనుకా ముందు ఆలోచన లేకుండా నోటికివచ్చినట్టు మాట్లాడటం, రెచ్చగొట్టడం రాహుల్‌గాంధీకి సరైన అర్హతలుగా తోచాయి. నెహ్రూ వంశపు ఐదవ వారసుని పతనం ఆ స్థాయికి చేరింది. లేదా, రేవంత్ మూసలోకి వచ్చే తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్ ‘విజయ గాథలు’ ఆయనకు స్ఫూర్తిగా నిలిచి ఆ నమూనాను అనుసరించదలిచారో తెలియదు.
మొత్తానికి పరిస్థితులు కలిసివచ్చి రేవంత్ రెడ్డి నాయకత్వాన కాంగ్రెస్ అధికారానికి రావటంతో రాహుల్‌గాంధీ లక్ష్యం నెరవేరింది. అంతటితో తను, సోనియాగాంధీ, ప్రియాంకా గాంధీ తెలంగాణ ప్రజలను మరిచిపోయారు. వారి వ్యక్తిగత హామీలు బీరాలుగా మిగిలాయి. అంతా రేవంత్‌కు వదిలివేసి తన ద్వారా లభించే వాటితో సంతృప్తి చెందటం మొదలుపెట్టారు. అది నడిచినంతకాలం నడిచింది. రేవంత్ బ్రాండ్ పాలనకు, వ్యక్తిగత వ్యవహరణకు, తమ అవసరాలకు ఇక తిరుగులేదనుకున్నారు. కానీ, అందుకు వాస్తవ పరిస్థితులకు మధ్య పొంతన కుదరటం లేదని అర్థమయేందుకు ఎక్కువకాలం పట్టలేదు. ఎదురుగాలుల సమాచారాలు అందుతుండటంతో ఆ ర్ధోక్తి వంటి మందలింపులేవో చేసి జాగ్రత్తలు తీసుకోబూనారు గాని ఫలితం కనిపించినట్లు లేదు.
మీనాక్షి నటరాజన్ నియామకం ఆ విధంగా జరిగింది. తన శైలి, మాటలు, ప్రకటనలు కొన్ని రోజుల వరకు మంచి ప్రచారాన్నే తెచ్చాయి. విమానంలో గాక రైలు ప్రయాణం, తన సంచీ తాను మోసుకోవటం, సాధారణ వస్త్రధారణ, స్టార్ హోటల్లో గాక ప్రభుత్వ గెస్ట్ హౌజ్‌లో బసచేసి అందుకు అద్దె రూ.50 తనే చెల్లించటం వగైరాలు. అంతేకాదు, ప్రజా ఉద్యమాలు జాతీయ వేదిక సభలకు వెళ్లి అక్కడి నేలపై కూర్చొని చరఖా వడికారు. మూసీ కూల్చివేతల బాధితులను పరామర్శించేందుకు వెళ్లిన మేధా పాట్కర్‌ను పోలీసులు అడ్డుకోవటాన్ని ఆక్షేపించారు. తను ఆమె వంటి వారి స్ఫూర్తితో ప్రజా ఉద్యమాలు చేసి రాజకీయాలలోకి వచ్చానన్నారు. దేశంలో కార్పొరేట్ల రాజ్యం నడుస్తున్నదని, దేశం గాంధీజీ కోరుకున్నట్టు ఉం డాలని తాను కోరుకుంటున్నట్టు చెప్పారు. పార్టీ లో క్రమశిక్షణ గురించీ చాలా మాట్లాడారు.
ఇదంతా బాగుందనేందుకు ఎంతమాత్రం సం దేహించనక్కరలేదు. కాని ఎవరి మాటలు ఎంతగొప్పగా కనిపించినా ఆచరణలో జరిగేది ఏమిటన్నది ముఖ్యమని ఎవరైనా అంగీకరిస్తారు. కేవలం మాటలను విశ్వసించే దశ రాజకీయవాదులకు సంబంధించి భారతదేశంలో ఎన్నడో గతించిపోయింది. కనుక ఇప్పుడామెకు కొన్ని ప్రశ్నలు వేద్దా ము. మూసీ బాధితుల విషయమై మాటలు చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచి వారిమెప్పును పొందిన ఆమె, ఆ బాధితులను స్వయంగా పరామర్శించేందుకు, ధైర్యం చెప్పేందుకు వెళ్లారా? పోనీ ఆంతరంగికంగా ముఖ్యమంత్రికి ఏవైనా సూచనలు చేశారా? వారి వద్దకు వెళ్లే అవకాశం మేధా పాట్కర్‌కు కల్పించారా? స్వయంగా పాట్కర్, ఆ తర్వా త రైతు సంక్షేమ కమిషన్ అధ్యక్షుడు కోదండరెడ్డిని కలిసి చర్చించినప్పుడు తను కూడా ఆమె వెంట వెళ్లారా? అసలు ప్రభుత్వం తలపెట్టి వి ధ్వంసకరంగా అమలు చేయజూసిన మూసీ పథకంపై తన వైఖరేమిటి? ఇవేమీ లేకుండా రెండు మాటలు చెప్పి పబ్లిసిటీతో సంతృప్తి చెంది ఊరుకోవటాన్ని బట్టి, ఆచరణలో తన చిత్తశుద్ధి ఏమిటని మనం భావించాలి? గాంధీజీ మాటలకన్నా ఆచరణకు ఇచ్చే ప్రాధాన్యం ఏమిటో ఒక గాంధేయవాదిగా ఆమెకు తెలిసే ఉండాలి. ఇప్పటికైనా తన నుంచి దిద్దుబాటును ఆశించవచ్చునా?
దేశంలో కార్పొరేట్ వ్యవ్యస్థ రాజ్యమేలటం, గాంధీ కోరుకున్న విధంగా దేశం లేకపోవటం, ఉత్పత్తిదారుల దేశంగా కాక పెట్టుబడిదారుల దేశంగా మారిందనటం నిజమే. ఈ పద్ధతి మారటానికి తాను కాంగ్రెస్ వైపు నుంచి కృషి చేయగలనని ప్రకటించారు. ఇందులో మనకు అర్థం కానివి కొన్నున్నాయి. కాంగ్రెస్ విధానాలు కార్పొరేట్లకు, పెట్టుబడిదారులకు వ్యతిరేకమా? ఆ పార్టీ ప్రభుత్వం మొదటినుంచి అనుసరించిన విధానాలను, తర్వాత తామే ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలను గమనించినప్పుడు కలిగే అభిప్రాయం ఏమిటి? వాటి మంచి చెడులలోకి వెళ్లటం లేదిక్కడ కాని, అవి చెడ్డవనే అభిప్రాయాన్ని మీనాక్షి నటరాజన్ స్వయంగా కల్పించబూనారు. దాని అర్థం గాంధీజీ ఫిలాసఫీని రివర్స్ చేస్తున్నారని. తన ఉద్దేశం ప్రస్తుత కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించటం. కానీ స్వయంగా తమ పార్టీ ప్రభుత్వాలే ఇందుకు శ్రీకారం చుట్టాయన్నది ఆమె దాచి పెట్టారు. ఆర్థిక విధానాలకు సంబంధించి రెండు పార్టీల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదన్నది అందరూ గుర్తించిందే. అటువంటప్పుడు, ఈ పరిస్థితుల మార్పు కోసం కాంగ్రెస్ పక్షాన ఎట్లా కృషిచేస్తారన్నది ఆమె వివరించగలరా?
పార్టీ పర్యవేక్షకురాలికి ఎదురవుతున్న మరొక ముఖ్యమైన అంశం పార్టీ క్రమశిక్షణ. ఆ నిబంధనలను ఎవరు ఉల్లంఘించినా, వారు ఎవరైనా సరే చర్యలు తప్పవని ఆమె తీవ్రంగా ఒకటికి రెండుమార్లు హెచ్చరించారు. ఆ తర్వాతనే తీన్మార్ మల్లన్నను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అయితే, చర్యలు కింది కులాల వారిపై ఉండి, పై కులాల వారిపై ఎందుకు ఉండటం లేదని మల్లన్న సూటిగా ప్రశ్నించారు. పార్టీలో చాలా సీనియర్ బీసీ నాయకుడైన మధుయాష్కీ గౌడ్ ఈ నెల 5న అవే ప్రశ్నలు వేశారు. కులగణన తీరునూ విమర్శించారు. రెడ్ల రాజ్యం నడుస్తుందన్నారు. పార్టీ వివక్షా ధోరణికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు కూడా పేర్కొన్నారు. ఈ ఇద్దరి ప్రశ్నలపై ఈ వ్యాసం రాసే 10వ తేదీ వరకు కూడా పార్టీ నుంచి ఎటువంటి వివరణ లేదు. తనవంతు హెచ్చరికలు తాను చేసిన మీనాక్షి నటరాజన్ నుంచి కూడా ఎటువంటి కదలిక కన్పించలేదు. అనగా, రైలు ప్రయాణాలు, తన సంచీ తాను మోయటాలు, రాట్నం వడకటాలకు మించి ఆమె ఇంకా ఏదో చేయవలసి ఉంటుందన్న మాట. ఇటువంటి పర్యవేక్షకురాలిని నియమించి రాహుల్ గాంధీ ఏమి చెప్పి, ఏమి చేయదలచుకున్నారు? పైగా ఆమెలోనే వైరుధ్యాలున్నప్పుడు? స్పష్టతలు గాని, విషయాలను నిజాయతీగా చెప్పటం గాని లేనప్పుడు?
అంతిమంగా ఇటువంటి పరిస్థితులన్నీ కాంగ్రెస్ వైఫల్యాలు, బలహీనతలతో పాటు, రాహుల్ గాంధీ అసమర్థతలు, ఏమి చేయాలో తోచని స్థితినుంచి, ఏదో విధంగా ఎన్నికలు గెలిస్తేనే చాలనుకునే ధోరణి నుంచి వచ్చిన విచిత్రమైన వైరుధ్యాలన్న మాట. ఇందుకు, తెలంగాణతో నిమిత్తం లేకుండా ఇతరత్రా కూడా పలు ఉదాహరణలున్నాయి. ఈ శిథిల పల్లకిని తెలంగాణలో ఆయన, మీనాక్షి నటరాజన్, రేవంత్ రెడ్డి కలిసి మోస్తున్నారు. ఆమె రాక వల్ల అద్భుతాలేమీ జరగబోవటం లేదు. క్షణకాలపు వినోదాత్మక భ్రమలు తప్ప.
– టంకశాల అశోక్