పొరుగునే అని కూడా కాదు, మొత్తం ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ ఉధృతి తగ్గింది. వ్యక్తిగత వ్యవహారాలకే పరిమితమవుతున్న కవిత్వమే తప్ప సామాజిక పట్టింపు ఎక్కడా కానరాదేం. ముఖ్యంగా మహిళలు రాసే కవిత్వం ప్రేమ రాహిత్యం, వ్యక్తిగత వైఫల్యాలపై వస్తున్నాయే తప్ప సామాజిక, సామూహిక వైఫల్యాలపై ఎందుకు నిరసన కవిత్వం రావడం లేదు. ఆనాటి ఆవేశం నేడు ఎక్కడా కానరావడం లేదేం? ఆనాడు వచ్చిన ఫెమినిస్ట్ కవిత్వం నేడు ఎందుకు రావడం లేదు?
ఆనాటి ఫెమినిస్ట్‌లు తమ తర్వాత తరానికి ఆ ఆయుధాలను ఇవ్వలేకపోవడమా… లేక ఈనాటి కవయిత్రులు ఆ తరాన్ని అందుకోలేకపోవడమా… అసలు కారణమేంటి? ఒకరిద్దరు మినహా మిగిలిన కవయిత్రులంతా తమ కవిత్వాన్ని వ్యక్తిగతానికే పరిమితం చేస్తున్నారు. ఆ రోజులతో పోలిస్తే నేడు కవిత్వ ప్రకటనలకు అనేకానేక వేదికలున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో కవిత్వం ఏరులై పారుతున్నది. నిజానికి పత్రికలు కవిత్వానికి ఇస్తున్న స్పేస్ చాలా అంటే చాలా తగ్గిపోయింది. కొన్ని పత్రికలైతే అసలు సాహిత్యం ఓ ఆలంబన అనే విషయాన్నే వదిలేసి ఏండ్లు గడిచిపోయాయి. మిగిలిన సామాజిక మాధ్యమాల్లో కూడా సామాజిక అంశాలపై కవిత్వం రాస్తున్న వారు పెద్దగా కానరావడం లేదు.
80, 90వ దశకాల్లో మహిళలు రాసిన కవిత్వం చదివి చాలామంది ప్రేరణ పొందారు. ఆ కవిత్వాల ద్వారానే కొన్ని ఉద్యమాలు వచ్చాయంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా నీలిమేఘాలు కవిత్వ సంపుటి తీసుకొచ్చిన తుఫాను.. అలాంటి ఇలాంటి తుఫాను కాదు. అంతవరకూ వ్యక్తులుగా ఉన్న కవయిత్రులంతా ఆ నీలిమేఘాలు అనంతరం సామూహికం అయ్యారు. అందులో ఒక్కో కవితా ఒక్కో తూటాలా మహిళలను కదిలించింది. పురుషులైతే ఇలా ఉన్నామా… ఇలా బతుకుతున్నామా? అని తమని తాము ప్రశ్నించుకునే పరిస్థితి వచ్చింది.
అప్పటికింకా చదువు, సంధ్యల్లో గడుపుతున్న నాలాంటి వాళ్లకు నీలిమేఘాలు ఓ సంచలన, సంభ్రమాశ్చర్య కవిత్వ సంపుటి. ఆ సమయంలో ఓల్గా, విమల, జయప్రభ, ఘంటశాల నిర్మల, మందరపు హైమవతి, కొండేపూడి నిర్మల వంటి వారి కవిత్వం చదివి ఉప్పొంగిపోయిన సందర్భాలు ఎన్నో ఎన్నెన్నో. ఆ కవయిత్రుల్లో కొందరు పూర్తిగా కవిత్వానికి దూరమయ్యారు. మిగిలినవారు రాస్తున్నా ఆ నాటి వాడి, వేడి ఎందుకు తగ్గిందో? మహిళలందరూ.. ‘ఎవరి బతుకులు వారివే. మనకెందుకు ఇదంతా’ అనే ఓ నిర్లిప్త వాతావరణంలోకి వెళ్లిపోయారా? సామూహికంగా మారి ఓ ఉద్యమ స్థాయిలో కవిత్వాన్ని పండించినవారంతా ఇప్పుడు ఒక్కరుగానే మిగిలిపోతున్నారా? అప్పట్లో స్త్రీకి ఆర్థిక స్వాతంత్య్రం లేదు. దానికి తోడు సమాజంలో ఓ చిన్నచూపు. కానీ, నేడు పరిస్థితులు కొంత మారాయి. ముఖ్యంగా దేశంలో గ్లోబలైజేషన్ కారణంగా వచ్చిన మార్పులు అన్నీ ఇన్నీ కావు. ఐటీ ప్రవేశంతో జీవితాలు మారిపోయాయి. స్త్రీలకు తాము చదివిన చదువులకు తగ్గట్టుగా ఉద్యోగాలు వచ్చాయి. ఆర్థిక స్వావలంబన పెరిగింది. పురుషుడితో సమానంగా తానూ ఎదిగాననే ఆత్మవిశ్వాసం వచ్చింది. లక్షల్లో జీతాలతో పాటు తన కోర్కెలను స్వేచ్ఛగా వెల్లడించే అవకాశాలు వచ్చాయి. దీని ప్రభావం సాహిత్యం మీద పడిందా? ఇవన్నీ ప్రశ్నలే. జీవితం సంతృప్త స్థాయికి చేరిందనుకోవాలా? అందుకే వ్యక్తిగత వ్యవహారాలకే నేటి కవయిత్రులు పరిమితమవుతున్నారని భావించాలా? ఇదంతా కావచ్చు కానీ… నా మటుకు నాకు అనిపించింది ఏమిటంటే.. ఓ కేంద్రీకృత ఉద్యమం లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. అసలు ఉద్యమం అనేదే లేకుండాపోయింది. కథకుడు ఖదీర్‌బాబు చెప్పినట్టు ‘కనీసం ఊళ్లు పట్టుకు ఊరేగడానికి ఉద్యమమూ లేదు’ అన్నట్టుగా మారింది. అమ్మ నవలలో ‘పావెల్ చేత మన ఆలోచనలన్నింటికీ కేంద్రం ఉద్యమమే కావాలి’ అని మాక్సిం గోర్కీ చెప్పిస్తాడు. ఆ కేంద్ర స్థానాన్ని, ఆ ఉద్యమాన్ని ఇక్కడివారు పట్టించుకోకపోవడం వల్లనే ఇలా జరుగుతోందా?
రాష్ట్రం విడిపోవడానికి ముందు తెలంగాణ సాధన కోసం అనేక మంది కవయిత్రులు ఉద్యమ కవిత్వాన్ని అద్భుతంగా రాశారు. దాని ప్రభావం కచ్చితంగా ఉద్యమంపై పడి అది మరింత బలపడింది. కవిత్వమో, పాటో, కథో, నవలో మొత్తానికి తెలంగాణ ఉద్యమానికి అనుకూలంగా, ప్రత్యేక రాష్ట్రం రావాల్సిన ఆవశ్యకతపై సాహిత్య సృజన జరిగింది. రాష్ట్రం సిద్ధించింది. చిరకాల కోరిక ఈడేరింది. ప్రాంతీయ ఉద్యమాలే ఆలంబనగా ఆ సాహిత్యం వచ్చింది. అయితే, ఆ తర్వాత అంతే ఉద్యమ, సామాజిక స్ఫూర్తిని ఇవ్వాల్సిన సాహిత్యం కూడా నిలిచిపోయిందా. ఇప్పుడూ కవయిత్రులు రాస్తున్నారు కదా అనే ప్రశ్న రావచ్చు. వస్తోంది. ఆ కాలంతో పోల్చుకుంటే చాలా తక్కువగానే రాస్తున్నారు. తాము స్పందించకపోతే ఎలా అనే కారణంగానే ఒకటి, రెండు రాస్తున్నారు. ఎక్కువగా మాత్రం కవయిత్రులు తమ వ్యక్తిగతానికే పరిమితం అవుతున్నారని అనిపిస్తున్నది. అంతకుముందు ఉమ్మడి ఏపీలో వచ్చిన అనేకానేక ఉద్యమాలకు స్ఫూర్తి ఆ నాటి సాహిత్యమే. ఆ తర్వాత వచ్చిన పరిణామాల ప్రభావం సాహిత్యంపై పడటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది. ఇప్పుడు రాస్తున్న కవయిత్రుల్లో చాలామంది అద్భుత కవిత్వాన్నే రాస్తున్నారు. కానీ, ఎక్కడో ఓ వెలితి వెంటాడుతోంది.