
దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో పలు వైద్య, ఆరోగ్య పథకాలు అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం వైద్యరంగంలో అనేక సంస్కరణలను ప్రవేశపెట్టి ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా ముందుకువెళ్తున్నది. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు క్రమంగా పెరుగుతుండటం దీనికి ప్రత్యేక ఉదాహరణ. బాలింతలకు రక్షణ, పుట్టిన బిడ్డలకు అవసరమైన 16 రకాల వస్తువులు ఇస్తూ పేదల మన్ననలు పొందుతున్నది.
రాష్ట్ర ప్రభుత్వం ‘ఆరోగ్య శ్రీ’ ఆరోగ్య బీమా పథకాన్ని అమలుచేస్తున్నది. తెల్లరేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి ఈ పథకం వర్తిస్తుంది. ఈ పథకంలో ఒక కుటుంబానికి ఏడాదికి 2 లక్షల లోపు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లో అయ్యే వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది.
బాలామృతం: రాష్ట్ర ప్రభుత్వం పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా 3-7 ఏండ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం అందించే ఉద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా ‘బాలామృతం’ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నది. వారానికి 2 గుడ్లు, గోధుమలు, శనగపప్పు పాల పౌడర్, నూనె, చక్కెరను పిల్లలకు అందిస్తున్నది. దీనిద్వారా పిల్లలకు పౌష్టికాహారం లభిస్తుంది.
ఆరోగ్యలక్ష్మి: రాష్ట్రంలోని 149 అంగన్వాడీ ప్రాజెక్టులు, 31,897 అంగన్వాడీ కేంద్రాలు, 4,076 మినీ అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ‘ఒక పూర్తి భోజనం’తో పాటు పప్పు, కూరగాయలు, కర్రీ, ఇందులో బాయిల్డ్ ఎగ్, 200 మిల్లీ గ్రాముల పాలు, 3-6 ఏండ్ల లోపు పిల్లలకు నెలకు 30 కోడిగుడ్లు అందిస్తున్నది. మహిళలలో రక్తహీనత లేకుండా చూడ టం, గర్భిణీలు పౌష్టికాహారం తీసుకోవడం అంతేకాకుండా బరువు తక్కువున్న పిల్లలకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. వీటితో పాటు ఐరన్, పోలిక్ యాసిడ్ మందులు కూడా అందజేస్తున్నది.
అమ్మ ఒడి: రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 18న ‘అమ్మ ఒడి’ పథకాన్ని ప్రారంభించింది. ప్రభుత్వ దవాఖానలలో ప్రసవించిన మహిళలను ప్రభుత్వ వాహనాల్లో తమ ఇంటికి ఉచితంగా చేరవేయడమే ఈ పథక ఉద్దేశ్యం.
రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాల ఏర్పాటు: రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య రంగంలో పేదల కోసం మరో విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకోవడం హర్షణీయం. ఈ కార్యక్రమాన్ని 2021 జూన్ 7న జిల్లా కేంద్రాల్లో 57 రకాల రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలను ఏర్పాటుచేసింది. వీటి కోసం ఒక్కో కేంద్రానికి రూ.2.50 కోట్లు ఖర్చుచేసింది. అంతేకాకుండా మరో 10 వేల కోట్లతో రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ దవాఖానల్లో మౌలిక వసతులను కల్పించేందుకు ప్రభుత్వం ముందుకుసాగుతుంది. అంతేకాకుండా 2021లో రూ.700 కోట్లతో 7 నూతన మెడికల్ కళాశాలలను ఏర్పాటుచేయబోతున్నది. వెనుకబడిన ప్రాంతాలకు వైద్యరంగాన్ని విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదనడంలో సందేహం లేదు. కేంద్ర సహకారంతో ‘ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్’, ‘ఈఎస్ఈ’ దవాఖానలతో రాష్ట్రంలో ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉండటమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నది. రాబోయే రోజుల్లో వైరల్ ఫీవర్, డెంగ్యూ, మలేరియా వంటి ప్రాణాంతకమైన జబ్బులను త్వరితగతిన నిర్దారించి వైద్యం అందించినట్లయితే పేద ప్రజల ప్రాణాలు కాపాడేందుకే కొత్తగా ఏర్పాటుచేసి రోగ నిర్ధారణ పరీక్ష కేంద్రాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఈ పథకాలన్నింటిని చూసి ‘ఆరోగ్య తెలంగాణ’ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగా కృషిచేస్తున్నారో చెప్పవచ్చు.
యావత్ ప్రపంచమే కరోనా నుంచి ఎంతో గుణపాఠం నేర్చుకున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను కట్టడి చేస్తూనే రాబోయే మరే ఇతర మహమ్మారినైనా ఎదుర్కోవడానికి వైద్యరంగాన్ని సన్నద్ధం చేస్తున్నారు. దానిలో భాగంగానే వైద్యులు, నర్సులు, లాబోరేటరీ, ఇతర సిబ్బందిని త్వరితగతిన నియమించి డయాగ్నోస్టిక్స్ సెంటర్లలో కావల్సిన అన్ని వసతులను సమకూర్చుతున్నది. రానున్నకాలంలో ఎలాం టి వైద్య విపత్తులనైనా ఎదుర్కొని రాష్ట్ర ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలకు రాష్ట్ర ప్రజానీకం సంతో షం వ్యక్తం చేస్తున్నది.
-డాక్టర్ గుండాల మదన్‌కుమార్ , 98664 45079