వారసత్వ రాజకీయాలపై వాదోపవాదాలు అనేకం వింటుంటాము గాని, విషయాన్ని లోతులకు వెళ్లి అర్థం చేసుకునే చర్చలు కనిపించటం లేదు. వారసత్వ రాజకీయాలు భారతదేశంలోనే కాదు, అనేక ఆసియన్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, పాశ్చాత్య దేశాలలోనూ ఎందుకున్నాయన్నది మనం వేసుకోవలసిన మొదటి ప్రశ్న. వారసత్వ రాజకీయాలన్నవి ప్రపంచం ఆధునిక ప్రజాస్వామ్య దశలోకి ప్రవేశించటానికన్న ముందటి మధ్యయుగాల కాలంలో, ఇంకా చెప్పాలంటే అంతకన్న వెనుకటి ఆదిమ జాతి సమాజాలలోనే ఆవిర్భవించగా, ప్రజాస్వామ్య వ్యవస్థలలోనూ కొనసాగటానికి గల కారణాలేమిటన్నది రెండవ ప్రశ్న. అవి నిజంగా ప్రజాస్వామ్య విరుద్ధమా, లేక అంతిమంగా ఆ రాజకీయం ఏ దశలోనైనా సరే ప్రజలు ఆమోదించటం, లేదా తిరస్కరించటంపై ఆధారపడి సాగుతున్నదా అనేది మూడవ ప్రశ్న.
ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాము. నెహ్రూ-గాంధీ వంశంలో మోతీలాల్, జవహర్లాల్, ఇందిర, రాజీవ్‌ల తర్వాత సోనియా, రాహుల్ గాంధీ రంగంలోకి వచ్చారు. వీరిలో మోతీలాల్ స్వాతంత్య్రోద్యమ కాలంలో తన ప్రతిభ కారణంగా పార్టీ అధ్యక్షునిగా ఆమోదం పొందారు. తర్వా త నెహ్రూ, ఇందిరాగాంధీల గురించి తెలిసిందే. అయితే ఇందిర, రాజీవ్, సోనియాల దశ వచ్చేసరికి ఒడిదుడుకులు మొదలై, ప్రస్తుతం రాహుల్ కాలంలో పరిస్థితి ఎందువల్ల బాగా క్షీణించింది? సూటిగా చెప్పుకోవాలంటే వీరం దరిదీ వారసత్వ రాజకీయమే. అయితే ఆ వంశస్థులకు ప్రతిభా సామర్థ్యాలుండి, బాగా పాలించినపుడు ప్రజామోదం లభించింది.
ఈ రెండూ లేనపుడు, ముఖ్యంగా పరిపాలన సరి గా లేనపుడు, ప్రజలు తిరస్కరిస్తూ వచ్చారు. అంతే తప్ప, వారిది ఒకానొక వంశమా కాదా అన్నది ప్రజల దృష్టిలో సమస్య కాలేదు. ఒక వంశస్థులు పాలించటానికి ప్రజాస్వామ్యం అనే సిద్ధాంతంతో మమేకత ఉందా లేక వైరుధ్యమా అన్నది వారి దృష్టిలో ఒక ప్రశ్న కాలే దు. ఇంతకూ వారసత్వమన్నది ప్రజాస్వా మ్యం అనుకునే ఆధునిక వ్యవస్థల్లో సరైనదేనా అంటే అవుననలేము. కాని, అసలు ఈ విధమైన రాజకీయాలు ఎందుకు కొనసాగుతున్నాయన్నది జాగ్రత్తగా అర్థం చేసుకోవలసిన మొ దటి విషయం కాగా, అందుకు ప్రత్యామ్నాయత అన్నది ఏ పరిస్థితులలో ఎప్పుడు ఆవిర్భవించి ప్రజామోదాన్ని ఏ విధంగా పొందుతుందన్నది రెండవ విషయం. ఇటువంటి సమగ్ర అవగాహనలు లేకుండా కేవలం వారసత్వ రాజకీయాలను షరామామూలుగా ఆక్షేపించటం వల్ల కలిగే ప్రయోజనం ఉండదు.
ఇపుడు మరికొన్ని ఉదాహరణలను చెప్పుకుందాం. తమిళనాడులో కరుణానిధి, ఆయనకు వారసునిగా స్టాలిన్ రాగా, ఉదయనిధి ఇంకా పూర్తిస్థాయి పాలకుడు కాలేదు గాని, ఇంతవరకైతే పార్టీలో గాని, ప్రజలలో గాని వ్యతిరేకతలు కన్పించటం లేదు. అందుకు ఏకైక కారణం సమర్థతలు, మంచి పాలన. ఇదే పద్ధతిలో ఇంకా అనేక రాష్ర్టాలలో, పార్టీలలో పలు ఉదాహరణలు చెప్పవచ్చు. వారస త్వ రాజకీయాలను ఇంతగా విమర్శించే బీజేపీలో కూడా. ఆ పార్టీలో వారసత్వం ప్రధాని, పార్టీ అధ్యక్ష స్థాయులలో లేకపోవటానికి, దిగువస్థాయులలో ఉండటానికి కూడా కారణాలున్నాయి. ఆ మాటకు వస్తే కమ్యూనిస్టులలో ఏ స్థాయిలోనూ అనువంశిక రాజకీయాలు కన్పించవు. కనుక, కుటుంబ వారసత్వాలే ప్రజాస్వామికతకు ఏకైక గీటురాయి అయ్యే పక్షంలో మన దేశంలో కమ్యూనిస్టులకు మిం చి ప్రజాస్వామికులు లేరు.
లాటిన్ అమెరికా, ఆఫ్రికాల వరకు వెళ్లకుండా ఆసియాలోనే మన పొరుగు దేశాలను గమనిస్తే పాకిస్థాన్, బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంకలలో ఏమి జరుగుతూ వస్తున్నదో తెలిసిందే. వీటన్నింటా గల వంశాలను ప్రజలు పరిపాలనలు బాగున్నప్పుడు ఆమోదించి, లేనప్పుడు తిరస్కరించారు. సరికొత్తగా బంగ్లాలో షేక్ హసీనా, శ్రీలంకలో గతకాలపు వివిధ కుటుంబాలన్నింటిని అధికారం నుంచి పారదోలి, కొత్త శక్తులను అదే కారణంగా అధికారంలోకి తెచ్చారు ప్రజలు. ఈ విధమైన ఆమోదాలు, తిరస్కరణలూ ప్రపంచమంతటా ఉన్నాయి. ఆ మార్పుల గురించి వార్తలు మనకిక్కడ తెలియకపోవటం ఒక్కటైతే, మన పరిమిత వార్తా ప్రపంచమే సర్వస్వమని భావించి, ప్రపంచం వైపు దృష్టి సారించకపోవటం మరొకటి అవుతున్నది.
నిజానికి ఇందుకు, ఆధునిక ప్రజాస్వామ్యానికి నిలయాలనుకునే పాశ్చాత్య దేశాలు సైతం పూర్తిగా మినహాయింపు కావు. అక్కడ ఇంగ్లండ్‌తో సహా కొన్ని దేశాలలో అసలు నామమాత్రంగానైనా రాచరికాలు ఎందుకున్నట్టు? బ్రిటిష్ వారు కామన్వెల్త్ పేరిట, తమ మాజీ వలస దేశాలపై తమ రాచరికం పట్ల విధేయతను రుద్దుతున్నది ఎందువల్ల? కొన్ని యురోపియన్ దేశాల చట్టసభలలో వారసత్వ సభ్యత్వాలు ఎందుకు కొనసాగుతున్నాయి? దీనినంతా అక్కడి ప్రజాస్వామిక వ్యవస్థలు, ప్రజలు ఆమోదించటం ఎందుకోసం? పరిస్థితులు ఇవి కాగా, ఈ వాస్తవాలను విస్మరిస్తూ కొందరు ఇతరులపై వారసత్వాలు, అప్రజాస్వామికతలు అంటూ గురివింద విమర్శలు చేయటంలోని నిజ ఉద్దేశాలు ఏమిటో గ్రహించలేని వారెవరైనా ఉంటారా?
ఇందుకు సంబంధించి అర్థం చేసుకోవలసిన ముఖ్యమైన విషయాలు కొన్నున్నాయి. అధికార వారసత్వాలు, ఆ పద్ధతిలో వచ్చిన వారసులను వారి సమర్థతలను బట్టి ప్రజలు అంగీకరించటం లేదా అంగీకరించకపోవటమన్న సంప్రదాయం ఆదిమ తెగల నుంచే మొదలైంది. తదనంతర యుగాలలో కొనసాగి ఇప్పటికీ కన్పిస్తున్నది. ఇది మొదటి విషయం. బ్రిటిష్ వలసల పాలన ముగిసి ఇక స్వాతంత్య్రం రానుండగా, కొత్త వ్యవస్థలో ఇక రాచరిక వారసత్వాలు ఉండవని గ్రహించిన గతకాలపు రాజవంశాల వారు కాంగ్రెస్‌లో చేరటం లేదా స్వతంత్రులుగా పోటీ చేయటం వంటి మార్గాలలోకి వెళ్లి, తమ ప్రభావంలో గల ప్రాంతాలలో ఆ తర్వాత కూడా రాజకీయ వారసత్వాలు కొనసాగేట్టు చూశారు.
అవి పలుచోట్ల ఇంకా ఉన్నాయి. జనసంఘ్, స్వతంత్ర పార్టీలు ఏర్పడినాకా కొందరు వాటిలో చేరారు. ఇది రెండవది. ఆధునికతలు వచ్చినా కొద్దీ వారసత్వాలు బలహీనపడి ప్రజాస్వామికతలు రాగలవనే థియరీలు ఉన్నాయి గాని, ఆధునిక కాలంలోనూ ధన బలం, కులబలం ఉన్నవారు రాజకీయ బలం కూడా సంపాదించి వారసత్వాలను తేలికగా కొనసాగించారు. ఇది మూడవది.
వీటన్నింటి మధ్య, పైన చెప్పుకున్నట్టు, ఎవరి వారసత్వాలు ఏవైనా వారి సమర్థతలు, ప్రజాదరణ అన్నవి ఆ వారసత్వాలు కొనసాగేందుకు లేదా చెదిరిపోయేందుకు ఆధారంగా మారాయి. అది కూడా ప్రజాస్వామ్యమే. ఇటువంటి ప్రజాస్వామిక చైతన్యాలు పెరిగే కొద్దీ, ఎవరి వారసత్వాలు ఏవైనా వాటిపట్ల సంప్రదాయిక భక్తి విధేయతలు బలహీన పడుతున్నాయి. సమర్థత, సుపరిపాలన గీటురాళ్లవుతున్నాయి. అందువల్ల, యథాతథంగా వారసత్వ రాజకీయాల గురించి మితిమీరిన ఆందోళన అక్కరలేదు.
– టంకశాల అశోక్