ప్రధానిగా దేశ పగ్గాలు చేపట్టిన తర్వాత కొన్నాళ్ల పాటు ‘మేకిన్ ఇండియా’ అంటూ మో దీ పదేపదే వల్లె వేశారు. దిగుమతులు తగ్గించుకొని స్వదేశీ సరుకుల తయారీని పెంచడం ఈ నినా దం లేదా పథక పరమోద్దేశం. తద్వారా దిగుమతులు తగ్గించి ఎగుమతులను పెంచడం లక్ష్యంగా దీన్ని తెరమీదికి తీసుకువచ్చారు. పారిశ్రామికతకు ప్రతీకల్లాంటి పండ్ల చక్రాలతో కూడి న సింహం బొమ్మ దీనికి చిహ్నంగా వాడుకున్నారు. అంటే, ఇండియా ప్రపంచంలో మృగరాజులా రెచ్చిపోతుందనుకోవాలన్న మాట.
కా నీ, ఇప్పుడు ఆ సింహం పెద్దగా ఎక్కడా కనిపించడం లేదు. ఇక ఎగుమతుల్లో భారత్ పైపైకి దూసుకుపోవడం మాట దేవుడెరుగు, నానాటికీ తీసికట్టు అవుతుండటం మనం ఇప్పుడు చూస్తున్నాం. ప్రపంచ ఎగుమతుల్లో స్వాతం త్య్రం వచ్చేనాటికి మన దేశం వాటా 2.2 శాతమైతే ఇప్పుడది 1.6 శాతానికి పడిపోయింది. ఇది యాభై ఏండ్ల కనిష్ఠం కావడం అనేది మో దీ ప్రభుత్వ పనితీరుకు అద్దం పడుతున్నది. స్థూలంగా చూస్తే ఇదివరకటి మన్మోహన్సింగ్ ప్రభుత్వ హయాంలో ఎగుమతుల్లో సాధించిన వృద్ధి ఎంతో నయంగా ఉండటం గమనార్హం.
మేకిన్ ఇండియా ఊరించినట్టుగా ఇండియా ప్రపంచంలో తనదైన ప్రత్యేక మార్కెట్‌ను కల్పించుకోవడంలో ఘోరంగా విఫలం కావడమే అందుకు కారణం. పెట్టుబడుల గమ్యం గా తన స్థానాన్ని కూడా భారత్ నిలబెట్టుకోలేకపోయింది. విదేశీ పెట్టుబడులు అడ్డూ అదు పూ అనేది లేకుండా ఎగిరిపోతుండటంతో డాలర్‌ను తట్టుకోలేక రూపాయి రోజురోజుకూ చిక్కిశల్యమై పోతున్నది. రూపాయికి పూర్వవైభవం తెస్తానని ప్రధాని మోదీ ఘనంగా ప్రకటించారు. కానీ, ఇప్పుడది చరిత్రలో ఎన్నడూ దిగజారనంత లోతులకు పడిపోతున్నది.
ఉత్పాదకతతో అనుసంధానించిన ప్రోత్సాహకాల పథకం (పీఎల్ఐ) కేంద్ర ప్రభుత్వ పారిశ్రామికరంగ వైఫల్యాలకు మరో ఉదాహరణగా నిలుస్తుంది. ఉత్పాదకతను జీడీపీలో 25 శాతం పెంచేందుకు 2020-21లో ఆడంబరంగా ప్రారంభించిన పథకం సాధించింది శూన్యం. జీడీపీలో ఉత్పాదకత వృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా 15-17 శాతంగా ఉండిపోయింది. ఈ పథకానికి కేటాయించిన నిధుల్లో 8 శాతం మాత్రమే వినియోగించుకోవడం కేంద్రం చేతగానితనం తప్ప మరొకటి కాదు. దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని గుట్టుచప్పుడు కాకుండా అటకెక్కిస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. అదే చైనా, వియెత్నాంలు జీడీపీలో ఉత్పాదకత వృద్ధి వరుసగా 26 శాతం, 24 శాతం సాధించినట్టు ప్రపంచ బ్యాంకు లెక్కలు తెలియజేస్తున్నాయి.
ఇలా వరుస వైఫల్యాల నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఉత్పాదకతను పెంచుకునేందుకు చేస్తున్న అరకొర ప్రయత్నాలకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రూపంలో గండం వచ్చిపడింది. పోటా పోటీ టారిఫ్‌లతో ప్రపంచ వాణిజ్య యుద్ధానికి అమెరికా శంఖం పూరించడంతో ఇండియా పరిస్థితి మరింత బలహీనపడింది. ట్రంప్ బెదిరింపులకు తలొగ్గి మోదీ అమెరికా ఉత్పత్తులపై సుంకాలు తగ్గించుకునేందుకు కసరత్తు చేస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇదే జరిగితే భారత ఎగుమతులపై మరింతగా ప్రభావం పడుతుంది. ఇలా ఉత్పాదన, ఎగుమతుల్లో భారత్ ఘోర వైఫల్యాలను చవిచూస్తుంటే మోదీ సర్కారు మాత్రం ‘మేకిన్ ఇండియా’ విజయవంతమైనట్టు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నది. విపక్షాల విమర్శలకు ఎగవేత తరహాలో సమాధానాలిస్తున్నది. వాస్తవ పరిస్థితి మాత్రం మరోలా ఉన్నది. ప్రభుత్వం ఇప్పటికైనా మేలుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పారిశ్రామిక ప్రగతి, తద్వారా ఎగుమతుల వృద్ధి తీవ్రంగా దెబ్బతింటాయని చెప్పక తప్పదు.