హక్కుల ఉద్యమంలో బహుజనులకు స్ఫూర్తి, ఆత్మగౌరవ పోరాటంలో ఆదర్శప్రాయుడు, అణచివేత, వివక్షకు వ్యతిరేకంగా గొంతెత్తి వెలుగుచూపిన మహనీయుడు మహాత్మా జ్యోతిరావుపూలే. బుద్ధుడు, గాంధీ, రాజా రామ్మోహన్రాయ్, పూలే, అంబేద్కర్‌ను అధ్యయనం చేసి ఆచరిస్తే భారతదేశంలో సామాజిక విప్లవం సాధ్యమవుతుంది. కుల వ్యవస్థను ఎదురించి ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన పూలే మార్గంలో నడిస్తే సమసమాజానికి దారి ఏర్పడుతుంది. సత్యాన్ని చాటిచెప్తూ, అసత్యాన్ని ప్రశ్నించిన మానవతావాది జ్యోతిరావుపూలే ద్విశతజయంతి ఉత్సవాలు ఏప్రిల్ 11న ప్రారంభం కానున్నాయి.
అట్టడుగువర్గాల ప్రజల జీవితాల్లో అంధకారాన్ని తొలగింటం కోసం దీపం పట్టుకొని వెలుగు చూపుతూ నడిచిన ధీరోదాత్తుడు మహాత్మా జ్యోతిరావుపూలే. విద్యనే వికాసమని చాటిన, కోట్లాది ప్రజలు మహాత్ముడిగా కొలుస్తున్న జ్యోతిరావుపూలే మహారాష్ట్రలో పూణేలో 1827న ఏప్రిల్ 11న గోవిందు, చిమ్నాబాయి దంపతులకు జన్మించారు. 19వ శతాబ్దంలో దళితుల స్థితి చాలా దుర్భరంగా ఉండేది. బ్రాహ్మణ పీష్వాల పాలన అస్పృశ్యత, అణిచివేతలకు బానిసత్వానికి పెట్టింది పేరు. వీధుల్లో నడవకూడదు, నడిస్తే మెడకుముంత, నడుముకు చీపురు కట్టుకొని రావాలి. కులవ్యవస్థకు వ్యతిరేకంగా మాట్లాడటమే ఆనాటి సాహసం.
థామస్ పెయిన్ రచించిన ‘రైట్స్ ఆఫ్ మాన్’ మానవ హక్కుల పుస్తకంతో ప్రభావితమయ్యారు. సకల హక్కుల కోసం ఉద్యమించారు. ‘తక్కువ కులంలో పుట్టిన శూద్రుడు మాతో సమానంగా నడుస్తాడా? శూద్ర వెదవా! ఎంత ధైర్యం’ అంటూ పూలేను బ్రాహ్మణ మిత్రుడి ఊరేగింపు నుంచి బయటికు వెళ్లేలా అవమానించారు. అలా మిత్రుని పెళ్లిలో జరిగిన ఆ అవమానం జ్యోతిరావును తీవ్ర క్షోభకు గురి చేసింది. అస్పృశ్యత, అంటరానితనంపై తిరుగుబాటు చేస్తూ సమత కోసం విప్లవించిన సత్యశోధకుడు.
జ్యోతిరావుపూలే తన వాకిట్లోని చేదబావిలోని నీళ్లను స్వయంగా తోడి దళితుల దాహర్తి తీర్చేవారు. పూలేను అంబేద్కర్ తన గురువుగా ప్రకటించుకున్నారు. అణగారిన వర్గాల వారు చదువుకొని విద్యావంతులైతే సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతారు, విద్య ద్వారానే ఆత్మగౌరవం వస్తుందని చాటిచెప్పారు. ఆధునిక భారతదేశ చరిత్రలో మానవసమాజానికి కావాల్సిన విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తూ 1848 జనవరి 1న మహాఠ్వాడలోని బుదవారిపేటలో నిమ్నకులాల బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించారు. విద్యావ్యాప్తికి ఎలాంటి ప్రచారం ఆర్భాటం లేకుండా జ్యోతిరావు ఒక్కడే 20 పాఠశాలలను తెరిచి శూద్ర, అతిశూద్ర వర్గాల బాలబాలికలకు విద్యాదానం చేసి వారి జీవితాలను మలుపు తిప్పిన మహనీయుడు.
తన భార్య సావిత్రిబాయికి తానే స్వయంగా చదువు చెప్పి, తాను స్థాపించిన పాఠశాల్లోనే తొలి ఉపాధ్యాయురాలిని చేసి, స్త్రీ విద్యకు పాటుపడుతూ తొలి అక్షర కిరణమయ్యారు. సావిత్రిబాయి భారతదేశంలో మొదటి ఉపాధ్యాయురాలు, ప్రధానోపాధ్యాయురాలు. స్తీలు చదువుకోవడానికి అనర్హులంటూ సనాతనవాదులు ఆమెను అడ్డగించేవారు. సావిత్రిబాయి మీద పేడ నీళ్లు, రాళ్లు చెత్త పోసి అవమానించే వారు. సావిత్రిబాయి తొణకలేదు, బెదరలేదు. పేద వర్గాలకు అక్షరాలను బోధించడం మాను కోలేదు. ఇలాంటి అకృత్యాల వల్ల ఆమె సంచి లో మరో చీరను తీసుకొని వెళ్లేవారు. పాఠశాల లో పాఠాలు చెప్పి, సాయంత్రం ఇంటి కి వచ్చేటప్పుడు దుర్మార్గ పీష్వాలు సావిత్రిబాయిపై మళ్లీ పెడనీళ్లు చల్లే వారు. అలాంటి సమాజాన్ని ఎదురించి నిలబడ్డ ధీశాలి సావిత్రిబాయి.
పగలంతా పారిశుధ్య పనులు చేసే కార్మికుల కోసం దేశంలోనే మొదటగా రాత్రిపూట బడి నడపడం ప్రారంభించారు. సమాజంలో అట్టడుగు స్థాయిలో ఉన్న వ్యక్తుల అభివృద్ధి పట్ల తమకున్న ఆలోచనలను ఆచరణలో పెట్టిన మహనీయుడు పూలే. దళిత బాలికలకు చదువు చెప్పడాన్ని జీర్ణించుకోలేని పెత్తందారుల మాటలకు తలొగ్గి గోవిందరావు (పూలే తండ్రి) జ్యోతిరావు-సావిత్రిబాయి దంపతులను ఇంటి నుంచి వెళ్లగొట్టారు. పూలే దంపతులు విద్యకు మాత్రమే పరిమితం కాలేదు. నాటి సమాజంలో వితంతువుల సమస్య అధికం. గర్భవతులుగా ఉన్న వితంతువులను ఆదరిస్తూ భ్రూణ హత్యలను నివారించడానికి, వితంతువుల సంక్షేమానికి సావిత్రిబాయి, జ్యోతిరావుపూలే పూణేలో వితంతు శరణాలయాన్ని స్థాపించారు.
దీన జనుల కోసం నిలబడిన పూలేను చంపేందుకు వచ్చిన వారు ఆయన మాటలతో మనసు మార్చుకుని క్షమించమని కాళ్ల మీద పడి ప్రాధేయపడ్డారు. పూలే వారిని క్షమించారు. ఆయన నడిపే రాత్రి పాఠశాలలో వారిని చేర్చుకొని విద్యాబుద్ధులు నేర్పించారు. వాళ్లు మంచి విద్యావంతులయ్యారు. జ్యోతిరావుపూలే దంపతులకు సంతానం లేకపోవడంతో, ఒక బ్రాహ్మణ వితంతువు (కాశీబాయి)కు పుట్టిన బిడ్డను దత్తత తీసుకొని యశ్వంత్‌రావు అని పేరు పెట్టుకొన్నారు. ఆ కాలంలో ఒక వితంతువు బిడ్డను దత్తత తీసుకోవడం అనేది పెద్ద సామాజిక విప్లవం. యశ్వంత్‌రావు వైద్య విద్యను అభ్యసించి బ్రిటిష్ సైన్యంలో సివిల్ సర్జన్‌గా పనిచేశారు. మహారాష్ట్రలో ప్లేగు వ్యాధి ప్రబలుతున్నప్పుడు, ఆయన తన తల్లిదండ్రులతో కలిసి పూణే శివార్లలో ఒక దవాఖాన ప్రారంభించి రోగులకు సేవలు అందించారు.
పూలే కలంలోంచి నిప్పు కణికల్లా వచ్చిన అక్షరాలు మతఛాందసత్వాన్ని దగ్ధం చేసే ఫిరంగి గుండ్ల వంటి వ్యాఖ్యలు. భారతీయ కుల వ్యవస్థలోని అణచివేతను మనువాద శాస్ర్తాల్లోని బానిసత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తూ తిరుగుబాటు చేసిన రచన ‘గులాంగిరీ’. గులాంగిరీలోని ఆలోచనలు కోట్ల మందిని ప్రభావితంచేస్తూ నూతన ఆలోచనలు రేకెత్తించాయి. వర్ణ వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడేలా చైతన్యపరిచాయి. సేద్యకారుడు, చర్నాకోల, తృతీయరత్న కావ్యాలతోపాటు ఛత్రపతి శివాజీ మహారాజ్‌ను కీర్తిస్తూ పూలే పావడాలు రాశారు. విస్మరణకు గురైన శివాజీ సమాధిని పూలే వెలుగులోకి తెచ్చి పునఃప్రతిష్టించి ఏటా ఉత్సవాలు జరపాలని నిర్ణయించారు.
సమాజంలో అగ్ర వర్ణాలు నిమ్మ వర్గాల ప్రజలను ఏ విధంగా అణచివేస్తూ అజ్ఞానంలోనికి నెడుతున్నారో చెప్తూ, సర్వజనులకు సత్యం, ధర్మం ఒకే విధంగా ఉండాలని, కులాల్ని బట్టి సత్యధర్మాలు ఉండవని తెలిపిన గ్రంథమే ‘సార్వజనిక సత్యధర్మ’ 1873 సెప్టెంబర్ 24న పూలే తన సహచరులతో కలిససి ‘సత్యశోధక్ సమాజ్’ సంస్థను ఏర్పాటు చేశారు. మూఢనమ్మకాలు, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా అణగారిన వర్గాలకు, మహిళలకు విద్య, సామాజిక హక్కులు కల్పించడం, కుల వివక్షకు వ్యతిరేకంగా, స్వేచ్ఛా సమానత్వం సౌబ్రాతృత్వాలు సమాన అవకాశాల కోసం పోరాడారు. బాల్యవివాహాలను వ్యతిరేకిస్తూ, వితంతు పునర్వివాహాలను, సమానత్వాన్ని సామాజిక, సాంఘిక అసమానతలపై ఈ సంస్థ నిరంతరం పోరాటం చేసింది. భారతీయ సాంస్కృతిక పునర్జీవనంలో సత్యశోధక్ సమాజ్ పాత్ర శ్లాఘనీయమైనది.
జ్యోతిరావుపూలే పూణే మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. ఆ కాలంలో పూణే ప్రాంతంలో తీవ్ర కరువు ఏర్పడింది. మున్సిపల్ సభ్యుని హోదాలో కరువు సమస్య పరిష్కారం కోసం పోరాటం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి పూణే ప్రాంతంలో యాభై రెండు ఉచిత భోజన కేంద్రాలను ఏర్పాటు చేయించారు. చరిత్రలో ప్రముఖంగా నిలిచిన విక్టోరియా శరణాలయం ప్రత్యేకమైనది. దీనబంధు పత్రిక స్థాపించి శూద్రుల తరఫున ప్రధాన గొంతుకలై నిలిచారు. ఈ పత్రికకు ఎడిటర్ కృష్ణాజీరావు భాలేకర్ సంపాదకత్వం వహించారు. కన్నాట్ దొర రైతుల కోసం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాధారణ రైతు వేషం ధరించి ఆంగ్లేయుల పాలనలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాల్ని కన్నాట్ దొర, విక్టోరియారాణి దృష్టికి తీసుకొస్తూ పూలే ఆంగ్లంలో ప్రసంగించారు.
జ్యోతిరావు చేసిన మరొక ముఖ్యమైన పని హంటర్ కమిషన్‌కు సమర్పించిన విజ్ఞాపన. శూద్రులు, అతిశూద్రుల విద్యకోసం అధిక ధనాన్ని ఖర్చు చేయాలని, బ్రిటిష్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఉద్యోగాలన్నీ అగ్రవర్ణాల గుత్తాధిపత్యంగా మారిపోయాయని అవిద్య వల్ల శూద్ర వర్ణాలు బానిసలుగా మిగిలిపోతున్నారని పేర్కొన్నారు. అగ్ర వర్ణాల విద్య కోసం బ్రిటిష్ ప్రభుత్వం లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తున్నట్టే బడుగు విద్యార్థుల కోసం కూడా ఖర్చు పెట్టాలని డిమాండ్ చేశారు.
1888 మే 11న పూణేలో పౌర సన్మానం ఏర్పాటు చేసి ప్రజలు స్వచ్ఛందంగా ప్రజల ముందుకువచ్చి జోతిరావు పూలేను ‘మహాత్మా’ అనే బిరుదు ఇచ్చి పిలుచుకున్నారు. ఆ సన్మాన సభకు హాజరు కాలేకపోయినా బరోడా మహారాజు శాయాజీరావు గైక్వాడ్ తాను పంపిన సందేశంలో జ్యోతిబాను ‘అమెరికాలోని నీగ్రో బానిసల విద్య కోసం శ్రమించిన బూకర్ టీ వాషింగ్టన్’ తో పోల్చారు. చివరిదశలో కూడా శూద్ర, అతి శూద్ర వర్ణాల విద్య కోసం శ్రమిస్తూనే 1889 నవంబర్ 28న జ్యోతిరావుపూలే తుదిశ్వాస విడిచారు.
పూలే జీవితాంతం శూద్ర, అతిశూద్ర వర్ణాల విద్య కోసం తీవ్రంగా శ్రమించిన పోరాటయోధుడు. అవిద్య వల్ల కలిగే ప్రమాదం జ్యోతిరావు మాటల్లో, అవిద్య అజ్ఞానానికి దారితీస్తుంది. అజ్ఞానం అనైతికతకు దారితీస్తుంది. అనైతికత వలన అభివృద్ధి నశిస్తుంది. అభివృద్ధి లేకపోతే ధనం ఉండదు. ధనం లేకపోవడం వల్ల శూద్ర జాతులు పీడనలకు గురవుతాయని తెలిపారు. విద్య లేకపోవడం వల్ల ప్రజలు విపత్కర పరిస్థితులు ఎలా ఎదుర్కొంటారో స్పష్టంగా చెప్పారు.
యుగయుగాల మతమౌఢ్యాన్ని మూఢాచారాలను హేతువాద భావాలతో ప్రశ్నిస్తూ ప్రజలందరి ఆలోచనలను చైతన్యం వైపు మళ్లించిన ప్రసిద్ధుడు పూలే. ఆధునిక వైతాళికుల్లో హేతువాద దృక్పథం ఉన్న పూలే ప్రపంచ తాత్వికుడు. భారతదేశ సామాజిక ఉద్యమకారుడు, సమాన ప్రాతినిధ్యం, సమానత్వం సామాజిక న్యాయంకోసం పోరాడిన సత్యాన్వేషి జోతిరావు. ఆయన ద్విశత జయంతి ఉత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం భారతరత్న అవార్డు ప్రకటించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా జయంతి, వర్దంతి నిర్వహిచాలి.
ఫూలే పేరిట యూనివర్సిటీని ఏర్పాటు చేయాలి. తెలుగు అకాడమీ, యూనివర్సిటీలు ఆయన సమగ్ర రచనలను తెలుగు అనువాదంతో సంపుటాలుగా అందించాలి. ఏడాది వయస్సులో తల్లిని కోల్పోయి, 22 ఏండ్లకే ఇంటి నుంచి గెంటివేతకు గురై 42 సంవత్సరాల పాటు సామాజిక ఉద్యమాలు నడిపి నిస్వార్థంగా సామాజిక వికాసానికి విలువలు నేర్పుతూ మార్గదర్శిగా నిలిచారు పూలే. నేడు భారత రాజ్యాంగాన్ని రద్దుచేసి సత్యానికి సామాజిక న్యాయానికి సమాధి కట్టాలని కొన్ని శక్తులు చూస్తున్నాయి. కులరహిత సమాజం కోసం, బహుజన రాజ్యం కొసం పోరాడటమే మహాత్మా పూలేకు మనం ఇచ్చే ఘనమైన, నిజమైన నివాళులు.
– వనపట్ల సుబ్బయ్య 9492765358