నిజమే…: ఏక్నాథ్ షిండేలు స్వయంభువులుగా పుట్టరు. పుట్టినవారిలో ఏక్నాథ్ షిండేలను గుర్తించి, శిక్షణ ఇచ్చి, పెంచి, పోషించి.. తయారుచేయాలి. అలా పుట్టించిన ఏక్నాథ్లు అనాథలు కారు. వారిని తామే పుట్టించామని గర్వంగా చెప్పుకోవాలి. ఎక్కడెక్కడ చోటు దొరకదో అక్కడక్కడ ఏక్నాథ్లను పుట్టిస్తామని ఒక బహిరంగ విజయ రహస్యంగా సూత్రీకరించాలి.
నిజమే…: దాగుడు మూతల్లేవు. దాపరికాల్లేవు. ముసుగులో గుద్దులాటల్లేవు. గెలవాలి. ఎలాగైనా గెలవాలి. థానే ఏక్నాథ్.. తనను తానే నమ్మనంతగా ఎదిగిన రాజకీయ పరమపద సోపానచిత్రం.. ఇప్పుడొక ఆదర్శం. పార్టీల చీలిక ఇప్పుడొక అంగీకార యోగ్యమైపోయిన పాచిక.
నిజమే…: పేరు గొప్ప ప్రజాస్వామ్యం అలసిసొలసి రిసార్ట్లో సేదతీరి బలం కూడగట్టుకుంటున్నది. లేని బలం వైస్రాయ్ హోటల్లో రాత్రికిరాత్రి వాపు బలుపుగా పరిణమిస్తుంది. రాని బలం గౌహతి ఐదు నక్షత్రాల హోటల్లో విమానాల రెక్కలు కట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. హోటల్ లాబీల్లో ప్రజా ప్రభుత్వాలు కూలిపోతూ ఉంటాయి. ప్రజలు గెలిపించని కలయికలు రిసార్ట్ రూముల నుంచి ప్రభుత్వం ఏర్పాటుచేయడానికి బయల్దేరుతాయి.
నిజమే…: ప్రజాస్వామ్యం అంటే అంకెల ఆట. సంఖ్యల సఖ్యత. తలలు లెక్కించడమే. ప్రజావాణి అంటే మూజువాణి. బలపరీక్ష అంటే బలవంతులు గెలవడమే. ప్రజలు ఓడించినవారు గద్దెనెక్కడమే. ప్రజా తీర్పును పరిహసించడమే.
నిజమే…: ఏక్నాథ్ ఇప్పుడొక విజయ సంకేతం. ఆసేతుహిమాచలం నేనెందుకు ఏక్నాథ్ కాకూడదనుకుని ఎవరికివారు తమలో ఏక్నాథ్ను చూసుకుని ఓటమిలో గెలుపును చూసుకోగలుగుతున్నారు. ఏక్నాథ్ల కోసం ముఖ్యమంత్రులు ఉపముఖ్యమంత్రులయ్యే ఔదార్యాలు కొత్త రాజకీయపాఠాలు చెప్తున్నాయి. వెన్నుపోటు గాయాలతో పార్టీ స్థాపకులు వెన్నెముకలేని వారిగా మిగిలిపోయే సందర్భాలు వస్తున్నాయి.
నిజమే…: వంచన ఇప్పుడు నింద కాదు. మోసం ఇప్పుడు అగౌరవం కాదు. వెన్నుపోటు ఇప్పుడు తప్పు కాదు.
మారీచులు బంగారు చుక్కల తొడుగు కప్పుకొని అరుస్తున్నారు.
– కాశ్యప్