గత రెండు మూడు రోజులుగా మరోసారి ఉచితాల చర్చ ప్రముఖంగా ముందుకు వచ్చింది. అందుకు రెండు కారణాలున్నాయి. మొదటిది ఎల్అండ్టీ కంపెనీ చైర్మన్ సుబ్రమణ్యన్ ఉచిత పథకాలతో పరిశ్రమలకు కార్మికుల కొరత ఏర్పడుతున్నదని చేసిన వ్యాఖ్యలు. రెండోది ఉచితాల వల్ల ప్రజలు సోమరిపోతులుగా మారుతారన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. ఏడాది క్రితం పలు అసెంబ్లీలకు వరుసగా ఎన్నికలు జరిగినప్పుడు ఉచితానుచితాలపై పెద్ద చర్చే జరిగింది. కొన్ని ఉచితాలు సంక్షేమం ఖాతాలోకి వచ్చేవీ ఉంటాయి. వృద్ధులకు, వికలాంగులకు ఇచ్చే పింఛన్లు అలాంటివే. కానీ రాజకీయ పార్టీలు ఆ పరిధి ఎప్పుడో దాటిపోయాయి. కర్ణాటక, తెలంగాణ రాష్ర్టాల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీని కాంగ్రెస్ ఇచ్చింది. అలాగే, ప్రధాని నరేంద్ర మోదీ ఉచితాలను ‘రేవడీలు’ (తాయిలాలు) అంటూ ఈసడించారు.
కానీ, ఆయన సొంతపార్టీ బీజేపీ మాత్రం ఏమాత్రం తొణకకుండా, బెణకకుండా మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘లాడ్లీ బెహనా’ వంటి ఉచితాలను ప్రకటించింది. బీఆర్ఎస్ హయాం లో ఉచితాలు సామాజిక పెట్టుబడి కోణంలో అమలయ్యాయి. సమాజ సంపద పెంచే సాధనాలుగా కేసీఆర్ ప్రభుత్వం వాటిని ఉపయోగించుకున్నది. గొర్రెలు, చేపల పంపిణీ వంటివి ఈ కోవలోకే వస్తాయి. రైతుబంధు పథకం ద్వారా వ్యవసాయంలో వచ్చిన విప్లవాత్మక మార్పులు జాతీయంగా, అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకున్న సంగతి తెలిసిందే. అదే విధంగా నేతన్నలకు ఉపాధి కల్పించే లక్ష్యంతో బతుకమ్మ చీరల పంపిణీ అమలైంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం అధికారం కోసం పోటాపోటీగా ఉచితాల ఆశచూపింది. తీరా అధికారం చేజిక్కాక అమలు చేయలేక నోరెళ్ల బెడుతున్నది.
తాజాగా ఉచితాల అంశంపై సర్వోన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ సందర్భంగా పలు ప్రశ్నలు కూడా సంధించింది. ‘సమాజ అభివృద్ధిలో ప్రజలను భాగం చేయకుండా వారికి ఉచితాలు పంపిణీ చేయడం ద్వారా ‘పరాన్నజీవుల’ వర్గాన్ని తయారు చేస్తున్నామా?’ అని విస్తుపోయింది. ఎన్నికల రాజకీయాల కోసం ప్రకటించే ఉచితాలు పూర్తిగా అనుచితమేనని స్పష్టం చేసింది. పేదరిక నిర్మూలన మిషన్ ఎంతకాలం కొనసాగిస్తారని పార్టీలను, ప్రభుత్వాలను నిలదీసింది. తాయిలాల ఆచారం కారణంగా వ్యవసాయ కూలీలు కూడా దొరకని పరిస్థితి తలెత్తుతున్నదని కోర్టు ఎత్తిచూపింది. ఉచితాల వల్ల పేదలు సోమరిపోతులై పనిచేయాలన్న ఆసక్తిని కోల్పోతున్నారని అభిప్రాయపడింది.
బహుశా సుబ్రమణ్యన్ చెప్తున్నది కూడా ఇదే. గతంలో పనిగంటలు పెంచాలని సంచలన వ్యాఖ్యలు చేసి ఈ పారిశ్రామికవేత్త వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వాల సంక్షేమం కారణంగా పనివాళ్లు పనిలోకి రావడం లేదని అంటున్నారు. దీనివల్ల మౌలిక సదుపాయాల నిర్మాణంపై ప్రభావం పడుతున్నదని ఆయన వేలెత్తి చూపడం గమనార్హం. కార్మికుల శ్రమ నుంచి లాభాలు పిండుకోవాలనే యాజమాన్య ధోరణి కింద ఆయన వ్యాఖ్యలను కొట్టిపారేయలేం. సుప్రీం వెలిబుచ్చిన అభిప్రాయాల వెలుగులో సమస్య మూలాలను అర్థం చేసుకోవడం ముఖ్యం.
కాలు కదపకుండా కూచున్న చోటనే ఎవరైనా సర్కారు నుంచి పూర్తి నిర్హేతుకంగా ఏదైనా లబ్ధి పొందితే అది ఉచితం లేదా తాయిలం కిందకు వస్తుందని ఓ నిర్వచనం. ఈ రోజుల్లో ఉచితాల జోలికి వెళ్లని పార్టీ అంటూ దాదాపు లేదనే చెప్పాలి. ఉచితాల నిర్వచనంపై ఏకాభిప్రాయం లేదనేది తెలిసిందే. ఆహార భద్రత కింద నిస్సహాయ వర్గాలకు ధాన్యం పంపిణీ జరుగుతున్నది. ఈ తరహా సాయం తప్పనిసరి అనే వాదనా ఉన్నది. సంక్షేమం ఎక్కడ ముగుస్తుంది.. సంతర్పణ ఎక్కడ మొదలవుతుందీ అనేది తెలిపేందుకు స్పష్టమైన విభజన రేఖ అంటూ లేదు.
ఈ మధ్య అభివృద్ధి ఎజెండా ప్రకటించకుండా మ్యానిఫెస్టోలను పూర్తిగా ఉచితాలతో నింపేసే ధోరణి బాగా పెరిగిపోయింది. అయితే సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీలు ఒక అవగాహనకు రావాల్సిన అవసరముందనేది వాస్తవం. ఏవి సామాజిక అభ్యున్నతికి దారి తీస్తాయి? ఏవి శుష్కమైన ఉచితాలు? అనే విషయంలో ఒక నిర్వచనం రూపొందించుకోవాలి. ఈ విషయంలో ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే పార్టీలు తాయిలాలు ప్రకటించేస్తాయి కనుక ఏమీ చేయలేమనే నిస్సహాయత ప్రకటించుకునే ఎన్నికల సంఘానికి మించిన సంధానకర్త ఎవరుంటారు?