ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు, రైతుల ఆదాయం రెట్టింపు, ప్రతి కుటుంబానికి సొంత ఇల్లు, విదేశాల నుంచి నల్లధనం తీసుకువచ్చి ప్రతి కుటుంబానికి పదిహేను లక్షలు. ఇవీ నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఎన్నికలకు వెళ్లినప్పుడు ఇచ్చిన ప్రధాన హామీలు. తొమ్మిదేండ్లు అవుతున్నా వీటిలో ఒక్కటీ అమలు కాలేదు. వాటిపై చర్చా లేదు. ఏం హామీలు ఇచ్చాం, వాటిలో ఎన్ని అమలుచేశాం, ఎన్ని చేయలేకపోయామనే మాట ప్రధాని ఎక్కడా మాట్లాడరు. విద్యార్థులు ఆందోళన లేకుండా పరీక్షలు ఎలా రాయాలో ‘మన్ కీ బాత్’లో సుదీర్ఘంగా మాట్లాడగలరు కానీ, ఈ దేశ ప్రజలకు ఇచ్చిన హామీల సంగతి ఏమిటీ? అని మాట్లాడే తీరిక లేదు. తీరికనే కాదు అవసరం కూడా లేదు. ఎందుకంటే ఎన్నికల్లో ఈ అంశాలు చర్చకు వస్తే అధికారపక్షానికి లాభం కన్నా నష్టం ఎక్కువ.
మతం, పాకిస్థాన్ వంటి అంశాల చుట్టే చర్చ సాగాలి. తరుచుగా మతపరమైన ఉద్రిక్తతలు చెలరేగితే శాంతిభద్రతలు వైఫల్యం చెందినట్టు. శాంతిభద్రతలు వైఫల్యం చెందితే ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీకి అది మైనస్ కావాలి, అవుతుంది. కానీ ఇప్పుడు అలా కాదు, మతపరంగా ప్రజల మధ్య చీలిక రావాలని బీజేపీ కోరుకుంటున్నది. అలా జరిగినప్పుడు రాజకీయంగా బీజేపీకి బలమైన ఓటు బ్యాంకు ఏర్పడుతుంది. తొమ్మిదేండ్లలో మోదీ ప్రభుత్వం ఇదే చేసింది. మేం చేసిన ఈ అభివృద్ధిని చూసి గెలిపించాలని కానీ, గెలిపిస్తారని కానీ బీజేపీ చెప్పడం లేదు. మత పరమైన చీలికపైనే బీజేపీ ఆశలు పెట్టుకున్నది.
మత రాజకీయాల ప్రభావం దేశమంతటా ఉంటుంది. అయితే ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాదిలో ఈ ప్రభావం తక్కువ. దేశంలో మత రాజకీయాలను ఎంతో కొంత అడ్డుకట్ట వేసే అవకాశం దక్షిణాదిలోనే ఉంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై ఉంటుంది. ఇప్పటివరకు వచ్చిన సర్వేల ప్రకారం కర్ణాటక ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వబోతున్నారు. అభివృద్ధి, అవినీతి, నిరుద్యోగం వంటి అంశాల ఆధారంగా ఎన్నికలు జరిగితే అప్పటివరకు అధికారంలో ఉన్న ప్రభుత్వం ఎలా పనిచేసిందని చూసి తీర్పు చెప్తారు. కానీ మతపరంగా చీలిక వచ్చి, మతం ఆధారంగా ఎన్నికలు జరిగితే పోలింగ్‌కు ముందురోజు మతపరంగా జరిగే ఏ చిన్న సంఘటన అయినా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపుతుంది.
దక్షిణాదిలో విద్య, ఉద్యోగ అవకాశాలు, ఉపాధి కల్పనకు, అభివృద్ధికి ఎక్కువ ప్రాధా న్యం ఉంటుంది. మతపరమైన ఉద్రిక్తతల వల్ల ఉపాధి అవకాశాలు దెబ్బతింటాయనే భయం ఈ ప్రాంతాల్లో ఉంటుంది. అయినా బెంగళూరులో మతపరమైన ఉద్రిక్తతల ప్రభావం చూశాం. దీనిలో ఏ ఒక్కరిదో, ఏ ఒక్క మతానిదో తప్పు అని చెప్పలేం. మతపరమైన నిప్పు రగిలినప్పుడు మత రాజకీయాలు చేసే అన్ని పార్టీలు ప్రయోజనం పొందాలని చూస్తాయి.
పరస్పర భిన్నమతాలు ఒక రకంగా మత రాజకీయాల్లో పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడతారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు సర్వేల ప్రకారం వస్తే బీజేపీ తన వ్యూహం మార్చుకునే అవకాశం ఇచ్చినట్టవుతుంది. అభివృద్ధి రాజకీయాలు చేయడానికి ఆ ఫలితాలు దోహదం చేస్తాయి. అది దేశానికి మంచిదే. రెండుసార్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు కొనసాగిస్తున్న వ్యూహంతోనే మరోసారి గెలిస్తే, దేశంలో నియంతృత్వాన్ని ప్రశ్నించే గొంతులు కూడా వినిపించవు. మూడవసారి అధికారంలోకి వ స్తే, ఎన్నికల హామీల అమలు గురించి అడగ డం మాట దేవుడెరుగు దేశంలో ప్రజాస్వామ్యం మాజీ ఉంటే మన అదృష్టం అనుకోవాలి.
పిచ్చాపాటి మాటల్లో కొంతమంది మన దేశానికి మిలట్రీ పాలన ఉంటే దేశం బాగుపడుతుందని విచిత్రమైన వాదన చేస్తుంటారు. వీళ్లు మిలట్రీని సినిమాల్లో చూసి ఉంటారు. పొరుగున ఉన్న పాకిస్థాన్ ఎక్కువ కాలం మిలట్రీ పాలనలోనే ఉన్నది. అక్కడ ప్రజాస్వామ్యం నామ మాత్రమే. అసలైన అధికారం ఇప్పటికీ మిలట్రీదే. మిలట్రీ పాలనలో పాకిస్థాన్ ఎంత గొప్ప అభివృద్ధి సాధించిందో చూస్తున్నాం కదా?గోధుమ పిండి కోసం తొక్కిసలాటలు, మరణాలు చూస్తున్నాం. మనుషులైనా, వ్యవస్థలైనా అందుబాటులో ఉన్నపుడు వాటి విలువ తెలియదు. అదే విధంగా ప్రజాస్వామ్యం విలువ తెలియడం లేదేమో? ఒక్కసారి పోయిన తర్వాత విలువ తెలియడం మాట ఎలా ఉన్నా, తిరిగిరాదు. ప్రజాస్వామ్యం వల్లనే దేశం ఇంతగా అభివృద్ధి సాధించింది. అది లేకనే పాకిస్థాన్ తిండికి కూడా తిప్పలు పడుతూ మరోసారి విచ్ఛిన్నానికి సిద్ధమవుతున్నది.
ప్రతి రాజకీయపక్షం అధికారం కోసం ప్రయత్నిస్తున్నది. కానీ, ఈ సారి ప్రజాస్వామ్యాన్ని బతికించడానికి ప్రయత్నించాలి. తమ పార్టీని బతికించుకోవడం కన్నా ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవడం ముఖ్యం. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దుచేయడం, వెంటనే ఆయన ఇంటిని ఖాళీ చేయమని నోటీసు వంటి పరిణామాలు చూస్తుంటే అప్రకటిత నియంతృత్వ ప్రభావం తెలుస్తున్నది.
తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రధానంగా కాంగ్రెస్ నుంచే పోటీ ఉంటుంది. కాంగ్రెస్ నాయకుడు రాహుల్‌గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేసినప్పుడు తమ ప్రత్యర్థి పార్టీ నాయకుడని కేసీఆర్ మౌనంగా ఉండలేదు. తెలంగాణ కాంగ్రెస్ నాయకుల కన్నా తీవ్రంగా స్పందించారు. ఎవరు ఏ పార్టీ అని కాదు. ప్రజాస్వామ్యం బతికి ఉంటేనే కదా? పార్టీలుండేది, అధికారంలోకి వచ్చేది. ప్రజాస్వామ్యమే లేనప్పుడు పార్టీల ఉనికి ఏముంటుంది? బీజేపీ తరపున శాసనసభ్యులను కొనే ప్రయత్నం చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కొందరు బీ జేపీ తరపున వకాల్తా పుచ్చుకొని మాట్లాడారు. విషయం ఏమిటని చూడటం కన్నా తెలంగాణలో బీఆర్ఎస్తో పోటీ కాబట్టి ఆ పార్టీని వ్యతిరేకించాలనే ధోరణితో వ్యవహరించారు.
దక్షిణాదిలో మరో ప్రధాన రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మరీ విచిత్రం. రాహుల్‌గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దు విషయంలో ఆంధ్రాలోని ప్రధాన పక్షాలన్నీ మౌనంగా ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో చంద్రబాబు బీజేపీ మద్దతు కోసం పరితపించకుండా ఉండి ఉంటే ఢిల్లీలో హడావుడి చేస్తూ ఉండేవారు. గతంలో జాతీయ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన బాబు ఇప్పుడు తన శక్తియుక్తులన్నీ బీజేపీ మద్దతు సాధించేందుకు ఉపయోగిస్తున్నారు. కానీ బీజేపీపై పోరాటం చేసే స్థితిలో లేరు.
ఇక తాను వదిలేస్తే బాబు బీజేపీకి చేరువవుతారని జగన్మోహన్రెడ్డి ఆందోళన, బాబుతోనే పవన్ కళ్యాణ్. దీనితో బీజేపీకి ఆంధ్రలో ఓటుబ్యాంకు లేకపోయినా మూడు ప్రధాన పార్టీల మద్దతు లభించింది. ఈ మూడు పార్టీలు తమ పార్టీల విజయం కోసం ప్రయత్నిస్తున్నాయి కానీ, బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే అన్ని పార్టీలను మింగేస్తుంది, ప్రత్యర్థులనే కాదు, ప్రజాస్వామ్యాన్నే మింగేస్తుందనే ప్రమాదాన్ని గుర్తించడం లేదు. ప్రజాస్వామ్యమే లేకుంటే పార్టీలుండి ఏం చేస్తాయి? కాంగ్రెస్ ఢీలా పడింది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల్లో బీజేపీకి పోటీ ఇచ్చే స్థితిలో ఇప్పుడు కాంగ్రెస్ లేదు. ఆయా రాష్ర్టాల్లోని ప్రాంతీయ పార్టీలే బీజేపీకి పోటీ ఇస్తాయి. ప్రాంతీయ పార్టీలు ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే స్ఫూర్తితోనే ఈ ఎన్నికల్లో పోటీ చేయాలి.
పరస్పర భిన్నమతాలు ఒక రకంగా మత రాజకీయాల్లో పరస్పరం ఒకరికొకరు ఉపయోగపడతాయి. కర్ణాటక
ఎన్నికల ఫలితాలు సర్వేల ప్రకారం వస్తే బీజేపీ తన వ్యూహం మార్చుకునే అవకాశం ఇచ్చినట్టవుతుంది. అభివృద్ధి రాజకీయాలు చేయడానికి ఆ ఫలితాలు దోహదం చేస్తాయి. అది దేశానికి మంచిదే. రెండుసార్లు గెలిచిన బీజేపీ ఇప్పుడు కొనసాగిస్తున్న వ్యూహంతోనే మరోసారి గెలిస్తే, దేశంలో నియంతృత్వాన్ని ప్రశ్నించే గొంతులు కూడా
వినిపించవు. మూడవ సారి సొంత బలంతో అధికారంలోకి వస్తే, ఎన్నికల హామీల అమలు గురించి అడగడం దేవుడెరుగు దేశంలో ప్రజాస్వామ్యం ఉంటే మన అదృష్టం అనుకోవాలి.
బుద్దా మురళి: 98499 98087
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)