మట్టి పరిమళంబు మనసార గ్రోలెడు
మహిన ఘనుడుజూడ మనదు రైతు
సాలుసాలులోన సాగించునాగలి
గీత దప్పనట్టి గింజ పోత!
వానజల్లు కురియ వర్ధిల్లు భూమాత
హాలికుల మదికి హాయి గూర్చు
మణిమయంబు కన్న మడులె మాణిక్యాలు
కన్నులార గాంచు కలల పంట!
వర్షమొచ్చు వేళ వరముగ భావించి
తాను హర్షమొందు తనివి దీర
హాలికుండు భువిన ఆత్మీయ బంధువు
వాని ఋణము దీర్చ వశము గాదు!
పంటలన్ని తాను పండించినను గాని
పరుల మేలు గోరు పావనుండు
రైతులేక యున్న రాదురా కబళంబు
ప్రజల జీవనాడి పరమ హితుడు!
రైతు కాలుమోప రంజిల్లు మట్టియు
పసుపు గంధమోలె కాళ్ళు కడిగి
కోరు పంటలిచ్చి కోర్కెలన్నియు దీర్చి
గొంతు గోయునపుడు కోరు జయము!
భూమి లేనియెడల భుక్తిలేదు మనకు
రైతు దున్నకున్న రాజనాల
పంటలన్ని పుడమి పండకున్నను గాని
కుడువడానికింత కూడు యేది?!
వానకాలమందు వనరుగా వర్షాలు
కురిసినపుడె ప్రజకు కూడు గల్గి
సస్యలక్ష్మి తోడ సంపదల్ విలసిల్లి
సంతసంబు లమర సంబరంబె!
డాక్టర్ గన్నోజు
శ్రీనివాసాచారి
85558 99493