
మువ్వన్నెల బావుటా
నవ్వుతోంది అంతటా
హిమాలయం ముంగిట
సముద్రాల సందిట
భరతజాతి గౌరవం
భద్రపరచు కేతనం;
ఎంతకాల మైనగాని
ఎపుడు నిత్య నూతనం
భరతమాత చేతిలో
మురియు వైజయంతిక;
అవని పైకి దిగివచ్చే
అభినవ వాసంతిక
సాంద్రవర్ణములు చిందే
ఇంద్రచాపమిదే! యిదే!
స్వాతంత్య్ర ప్రభలీనే
భవ్య దివ్య దీపమిదే
ప్రపంచాన భరతజాతి
విపంచిపై మధురగీతి
పలికించే సమయమిది
ప్రజలకు శుభ తరుణమిది
అరువది కోట్ల జనావళి
ఐక్యంగా వున్ననాడు
ఈ స్వేచ్ఛా పతాకను
యెవ్వడేమి చేయలేడు.
కర్షక, కార్మిక, కవిగణ
హర్షాంచిత సువర్ణాలు
మనజాతి పతాకలోన
కనిపించే త్రివర్ణాలు
దాశరథి కృష్ణమాచార్య
(‘ధ్వజమెత్తిన ప్రజ’ నుంచి..)