లోకం విలవిలలాడిన జాలిలో లోకబాంధవుడు మంటల అవతారం చాలిస్తాడు

విరహోత్కంఠితలా ఎదురుచూసిన
పుడమికాంత పిలుపందుకొని
చెట్లగుంపుల డెస్క్‌టాప్ మీద
ఆకుల వర్చువల్ పెయింటింగ్‌ని
రీ-టచ్ చేస్తుంది తొలకరి..!
అదే ఎమ్మెస్ ఆఫీసులో
కొత్త వెర్షన్ వస్తూనే ఉన్నట్లు
ఏటేటా అదే చినుకు
మట్టి పులకింత మాత్రం నిత్యనూతనం!
కాలాన్ని మనం మార్చుకున్నామని
కాలం గతిని మార్చుకోదు
చినుకై రాలి.. వరదై పారి..
ప్రవాహమై పరవళ్లు తొక్కడం దాని నైజం!
డాటాను క్రాప్ అప్ చేసినకొద్దీ
ప్యాటర్న్‌ను కొత్త ప్రయోజనాలకు
ఆపాదించుకున్నట్లు
ఎక్కడి చినుకును అక్కడే
లాలించి పడుకోబెట్టాలి
వరదను మట్టి ఒడిలో నిలబెట్టాలి..
కురిసిన జడులు సుడులై
ప్రవాహం అవతారమెత్తితే
వరదనీరై సముద్రానికి
పయనమవకుండా చూడాలి
చినుకులకు ముందుచూపుల వినతులతో
నీటిని నెత్తికెత్తుకోవాలి
నీళ్లను ఫక్తు నేలమీదనే ఆడించాలి…
ఏనుగు నరసింహారెడ్డి
89788 69183