అబద్దాన్నే,
పలుమార్లు చెప్పి,
పదిసార్లు చూపి,
అదే నిజమని బొంకుతున్నది కాలం….
సత్యాన్ని ఉరితీసి,
అసత్యాన్ని ఊరేగిస్తున్న
కాలాన్ని చూసి జంకుతున్నది వ్యవస్థ….
బచ్పన్ దోస్తానాల్ని పచ్పన్ ముక్కలు చేసి,
ఫాసిస్ట్ రాబందులకు ఎరగా వేస్తున్నది రాజ్యం….
కల్మషమంటని స్నేహాల మెడకు
స్వార్థపు కండువాలు బిగించి,
రాజ్యం నడిబొడ్డున వేలాడదీస్తున్నది అధికారం….
దాపరికమెక్కడున్నది….?
ఇప్పుడంతా బహిరంగమే….!!
కంచంలో నాలుగు ముద్దల్ని పంచుకుతిన్నా పాపమే…!
కపటమెరగని బంధాలు కలిసి నడిచినా కోపమే…!!
అబద్ధం తలపై కూర్చుని ఊరేగుతున్నారో…?
అబద్దాన్ని తలపైకెక్కించుకుని ఊరేగిస్తున్నారో…?
ఏదైతేనేం…?!
ఇప్పుడు అబద్ధమే అప్రకటిత నియంత
బతుకుల్ని ఏం మార్చలేని వాళ్లే,
మనుషుల్ని ఏమార్చుతున్నారు….
మారని బతుకుల్ని మరిచిన మనుషులు,
మతం మత్తెక్కి వీధుల్లో తూగుతున్నారు….
వాళ్ళు వాగుతున్నారు,
వీళ్ళు తెగ ఊగుతున్నారు…
మనుషుల్ని మట్టిలో కప్పెట్టడం లాగే,
మనసుల్ని విడగొట్టి నిప్పెట్టడమూ ఓ కళే,
సరిగ్గా చూడు….
ఆ కళల్లో ఆరితేరిన వాళ్లే
రాజ్యాన్ని ఏలుతున్నారు…..
– జాబేర్ పాషా, మస్కట్ (ఒమన్ ) 00968 78531638