అడ్డగోలు హామీలిచ్చి ప్రజలను బురిడీ కొట్టించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సత్తా అనతికాలంలోనే తేలిపోయింది. హామీలు ఇచ్చింది ఎగ్గొట్టడానికే, అధికారం ఎగురవేసుకు పోయేందుకే అని ప్రజలకు తెలిసివచ్చింది. ఇక సీఎం రేవంత్‌రెడ్డి పరిపాలనా సామర్థ్యం గురించి ఎంత తక్కువగా చెప్పుకొంటే అంత మంచిది. ఫలితంగా రాష్ట్రం దివాళా దిశగా అడుగులు వేస్తున్నది. బీఆర్ఎస్ పార్టీ ధర్మబద్ధంగా సర్కారుకు కొంత సమయం ఇచ్చింది. ఆ తర్వాత అడుగడుగునా నిలదీస్తున్నది. హామీల గురించి ప్రశ్నిస్తున్నది. అకృత్యాలను ఎండగడుతున్నది. ఇది సర్కారుకు, ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డికి కంటగింపుగా మారింది. గెలుపు మురిపెం మూణ్నాళ్ల ముచ్చటే కావడం, బీఆర్ఎస్ గ్రాఫ్ రోజురోజుకూ పెరిగిపోతుండటం కాంగ్రెస్ పాలకుల కడుపు మంటకు కారణమవుతున్నది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీఆర్ఎస్దే అధికారం అని విశ్లేషకులు వేస్తున్న అంచనాలతో నిస్పృహ రోజురోజుకూ పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ను రాజకీయంగా ఎదుర్కోలేక కాంగ్రెస్ సర్కారు అడ్డదారుల్లో అక్కసు వెళ్లగక్కుతున్నది. బీఆర్ఎస్ వెనుక ఉక్కు స్తంభంలా నిలిచిన పార్టీ శ్రేణులపై తప్పుడు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడుతున్నది.
రాష్ట్రంలో శాంతిభద్రతలను గాలికివదిలేసి ఈ రాజకీయ వేధింపుల్లో మాత్రం పోలీసులు అత్యుత్సాహం చూపుతున్నారు. కట్టుతప్పిన పోలీసుల తీరు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. రాజును మించిన రాజభక్తితో ‘జీ హుజూర్, జో హుకుమ్’ అంటూ అక్రమ అరెస్టులతో రెచ్చిపోతున్నారు. పోలీసులకూ చట్టం వర్తిస్తుందనే కనీస ఇంగితం మరిచి, విధివిధానాలు, వాటిపై కోర్టులు ఇచ్చిన తీర్పులను గాలికి వదిలేసి తప్పుడు సెక్షన్లతో కేసులు బనాయిస్తున్నారు. రేవంత్ మార్క్ ప్రతీకార రాజకీయాల్లో పావులుగా మారుతున్నారు. కార్యకర్తలను, నేతలను దాడులు, అక్రమ అరెస్టులతో నిర్బంధిస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు. ఏడేండ్ల లోపు శిక్ష పడే కేసుల్లో అరెస్టులు వద్దంటూ ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులు, పోలీసు ఉన్నతాధికారులు జారీచేసిన సర్క్యులర్లు ఉన్నప్పటికీ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రాథమిక హక్కులకూ, భావప్రకటనా స్వేచ్ఛకూ సంకెళ్లు వేస్తున్నారు. సర్కారు పెద్దల ప్రాపకం కోసం తమ విద్యుక్త ధర్మాన్ని విస్మరిస్తున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పదికిపైగా, మాజీ మంత్రి హరీశ్‌రావుపై ఆరు దాకా తప్పుడు కేసులు పెట్టారు. కూసాలు కదులుతున్నాయనే బెంగతో సర్కారు పెట్టించిన కేసులే ఇవి. ఇంకా కొణతం దిలీప్, మన్నె క్రిషాంక్, అశోక్ రెడ్డి, గౌతం పోతగోని, నల్లబాలుపై శరపరంపరగా కేసులు పెడుతూనే ఉన్నారు. అగ్రనేతలు మొదలుకొని సామాన్య కార్యకర్తల దాకా అందరినీ కేసులకు లక్ష్యంగా చేసుకుంటున్నారు.
ఇక ఎఫ్ఐఆర్లకైతే లెక్కే లేదు. ప్రశ్నిస్తే కేసులు, నిలదీస్తే అరెస్టులు అన్నట్టుగా తయారైంది కాంగ్రెస్ ప్రజాకంటక పాలన. తమకు అన్యాయం జరిగిందని ఫిర్యాదు చేసేందుకు వెళ్లేవారిపైనా ఉల్టా ఎఫ్ఐఆర్లు, కేసులు పెడుతుండటం వైపరీత్యమే. వీటిలో ఆవగింజంత పసలేదనే సంగతి చిన్న పిల్లాడికైనా తెలిసిపోతుంది. ప్రశ్నించే గొంతుకలను నొక్కడమే వీటి లక్ష్యం. ప్రభుత్వ అభద్రతాభావానికి ఈ కేసుల పరంపర అద్దం పడుతున్నది. లక్షలమంది హాజరైన వరంగల్ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసుల వేధింపులను ప్రత్యేకంగా ప్రస్తావించడం తెలిసిందే. తప్పుడు కేసులు పెడుతున్న ఖాకీలను ఆయన తీవ్రస్థాయిలోనే మందలించారు. పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా సోషల్ మీడియా వారియర్స్‌కు పార్టీ లీగల్‌సెల్ అండగా ఉంటుందని భరోసా ఇవ్వడం గమనార్హం. అంతేకాకుండా రాబోయేది మన ప్రభుత్వమే అనడం ఆ భరోసాకు కొసమెరుపు.
పార్టీ శ్రేణులను కంటికి పాపలా కాపాడుకొనే బీఆర్ఎస్ పార్టీ పోలీసుల అరాచకానికి అడ్డుకట్ట వేసేందుకు పటిష్ఠమైన వ్యూహంతో ముందుకు కదులుతున్నది. కట్టుతప్పిన ఖాకీలపై న్యాయపోరాటం సాగిస్తున్నది. పోలీసులపైనే ఎదురు కేసులు పెడుతూ చెమటలు పట్టిస్తున్నది. లెక్కాపత్రం లేకుండా కేసులు పెట్టడాన్ని నోటీసులతో ప్రతిఘటిస్తున్నది. గతంలో పోలీసుల అక్రమ వర్తనపై కోర్టులు మొట్టికాయలు వేసిన సందర్భాలు అనేకం మనకు కనిపిస్తాయి. ఆ తీర్పులే అస్ర్తాలుగా బీఆర్ఎస్ న్యాయ విభాగం నోటీసులు సంధిస్తున్నది. చట్టానికి తాము అతీతులు కారని పోలీసులకు తెలియజెప్పేందుకు ఎంతదాకా అయినా పోతామని బీఆర్ఎస్ ఘంటాపథంగా చాటుతున్నది. ప్రభుత్వాలు వస్తాయి, పోతాయి. కానీ, పోలీసులు తాము చట్టానికి జవాబుదారులమని తెలుసుకుంటే వారికీ మంచిది, ప్రజలకూ మంచిది.