తెలంగాణ ఉద్యమంలో ఆన్యపుకాయ, సొరకాయ పేర్లు మార్మోగాయి. పుంటికూర, గోంగూర పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు తెలంగాణ సొంతమైతే, మిగిలిన పదాలు మాత్రం పరాయి ప్రాంతానియి. రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తున్న సమయంలో కొంత మంది తీరును తెలుసుకోవడం కోసం ఉపయోగించిన ఈ పద ప్రయోగం ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
ఓ రకంగా తెలంగాణ సోయికి ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు ప్రాథమిక ఆదర్శ సూత్రమయ్యాయి. తొలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్పినట్టుగా ‘ఇడ్లీ, సాంబార్ గో బ్యాక్’ మాదిరిగానే పై రెండు కూరగాయల పేర్లు కూడా అదే స్థాయిలో ప్రతిధ్వనించాయి. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే స్వరాష్ట్రంలో పదేండ్లు తెలంగాణ సోయి అడుగడుగునా కనిపించింది. కానీ ఇప్పటి పాలకుల్లో ఆ సోయి క్రమంగా మాయమవుతున్నది. ఏనాడూ ‘జై తెలంగాణ’ అని నినదించని వ్యక్తులే పరిపాలనకు సారథ్యం వహిస్తున్న ఈ సమయంలో ఇలాంటిది కాక మరేం ఆశించినా తప్పు మనదే అవుతుంది. తెలంగాణ అంటేనే ఓ ఉత్తేజం. ఓ నూతనోత్సాహం. పోరాటానికి స్ఫూర్తి పదం. అలాంటి తెలంగాణను తిరిగి ఉద్యమకాలం నాటి పరిస్థితులకు నేటి పాలకులు తీసుకుపోతున్న తీరు చూస్తూంటే ఒళ్లు గగుర్పొడుస్తున్నది. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో మిలియన్ మార్చ్ తర్వాత అంత గొప్పగా జరిగిన నిరసన కార్యక్రమం సాగరహారం. 2012, సెప్టెంబర్ 30న తలపెట్టిన సాగరహారంతో హైదరాబాద్ అతలాకుతలమైంది. అష్టదిగ్భంధనంతో సమైక్య పాలకుల కండ్లు బైర్లు కమ్మాయి. ఎక్కడికక్కడ ఉద్యమకారులను కట్టడి చేద్దామనుకున్న ఆంధ్రా పెత్తందారుల ఆలోచనలన్నీ బెడిసికొట్టాయి.
పుట్టల నుంచి చీమలు బయటికి వచ్చినట్టుగా ఉద్యమకారులు గుంపులు గుంపులుగా వచ్చిపడ్డారు. నాడు అదీ ఉమ్మడి రాష్ట్ర సచివాలయం. ఎదురుగా బానిస సంకెళ్లకు గుర్తుగా తెలుగు తల్లి విగ్రహం. ఆ పక్కనే కొండా లక్ష్మణ్ బాపూజీ పూర్వపు నివాస ప్రాంతం జలదృశ్యం. ఆబిడ్స్ నుంచి వేల మంది పరుగులు తీస్తూ నెక్లెస్ రోడ్డుకు కదిలారు. కాగ్ బిల్డింగ్ నుంచి కొందరు, బీఎస్ఎన్ఎల్ నుంచి మరికొందరు, జీహెచ్ఎంసీ, ట్యాంక్‌బండ్ నుంచి తండోపతండాలుగా వస్తున్న ఉద్యమకారుల ఆవేశానికి సమైక్య బలగాలు కంగుతిన్నాయి. తెలుగుతల్లి ఫ్లై ఓవర్ కింద సచివాలయం జంక్షన్ వద్ద పోలీసు బలగాలు కసిగా లాఠీలు పట్టుకొని కొట్టేందుకు సిద్ధమవుతున్న పరిస్థితులు. ఓ వైపు సమైక్య ఖాకీల కవ్వింపులు, మరోవైపు ఉద్యమకారుల ఆక్రందనలు. వెరసి పోలీసుల లాఠీఛార్జి, బాష్పవాయువు ప్రయోగం, రబ్బర్ బుల్లెట్ల దాడి. ప్రతిగా ఉద్యమకారుల నుంచి రాళ్ల దాడి. దాదాపుగా గంటల కొద్దీ ప్రవాహంలా జరిగిన దాడి, ప్రతిదాడిలో నాటి కాంగ్రెస్ సర్కార్ వారి బల ప్రయోగం తలవొంచాల్సి వచ్చింది. క్షణాల్లో సాగరహారం జనహారమైంది. వేల నుంచి లక్షల మంది ఒకే గొంతుకగా ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు. ఓ వైపు చీకటి పడుతున్నా, మరో వైపు భారీ వర్షమే కురుస్తున్నా ఉద్యమకారులంతా ఉక్కు పిడికిలితో బైఠాయించి కూర్చున్నారు. స్వరాష్ట్ర కోరికను నాటి పాలకులకు వినిపించారు. ఇదొక ఉద్విగ్న క్షణం. మరిచిపోలేని మహా రణం. 20 రోజుల కిందటే పుష్కర కాలాన్ని పూర్తిచేసుకున్న సాగరహారం ఘటన ఇప్పుడు మరోసారి యాదిలోకి వచ్చింది.
అచ్చం అలాగే.. సాగరహారం జరిగిన చోటనే, బుల్లెట్ల వర్షం కురిసిన ప్రాంతంలోనే అక్టోబర్ 19 శనివారం రోజు జరిగిన గ్రూప్-1 అభ్యర్థుల ఉద్యమ సెగ నాటి పరిస్థితిని కండ్లకు కట్టింది. పదేండ్ల కాలంలో ప్రజల ఆకాంక్షలు, ఆలోచనలకు తగ్గట్టుగా తెలంగాణ రాష్ట్రం పరుగులు తీసింది. అభివృద్ధిలో మేటిగా నిలిచింది. సొంత ఆలోచనలకు ప్రజల కోరికలను జోడించి ముందుకు పోవడంతోనే ఇదంతా జరిగింది. మంకుపట్టు లేకుండా ప్రజలు ఏమనుకుంటున్నారు? వారికేం కావాలి? అన్న ఏకైక ఆలోచనతోనే ఇదంతా సాధ్యమైంది. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ ప్రజలపై పాలకులకు ప్రేమాభిమానాలే కరువయ్యాయి. నాటి పరాయి పాలకులకు తొత్తులుగా మెదులుతూ ఉద్యమకాలాన్ని గడిపినవారికి జనాలపై ప్రేమ ఎక్కడ ఉంటుంది? ముమ్మాటికీ ఉండదు. అందుకు మూసీ బాధితుల ఆక్రందనలు ఒక్కటే సాక్ష్యం కాదు, నిన్న కాక మొన్న అక్టోబర్ 19న తెలంగాణ సచివాలయం ఎదుట జరిగిన ఉద్యమమే ఇందుకు ఉదాహరణ. తెలంగాణ ఏర్పాటుకు ఊపిరి పోసిన సాగరహారం ఉద్యమ ఘటనకు పుష్కరకాలం పూర్తి చేసుకున్న రోజుల వ్యవధిలోనే తెలంగాణ యువతపై తెలంగాణ పోలీసుల లాఠీలు విరగడం దారుణం. ఇంతకంటే దౌర్భాగ్యపు పరిస్థితి మరొకటి ఉండదేమో. నాడు, నేడు అదే జాతీయ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. వారి చేతల్లో మార్పు కనిపించడం లేదు. నాడు ఉద్యమకారులను తొక్కిపెట్టి తెలంగాణ ఏర్పాటును తొక్కేయాలని అడుగడుగునా ప్రయత్నం చేశారు. కానీ, వారంతా సమైక్యవాదులు. ఇప్పుడు తెలంగాణ వ్యక్తులే పాలకులుగా ఉన్నప్పటికీ వారి మనసుల్లో, వారి చేతల్లో తెలంగాణ యాస, తెలంగాణ భాష, తెలంగాణ అనే భావోద్వేగం కనిపించడం లేదు. ఒకవేళ ఆ సోయి ఉండి ఉంటే గ్రూప్-1 అభ్యర్థులపై, అందులో తెలంగాణ ఆడబిడ్డలపై కర్కశంగా, అన్యాయంగా లాఠీలు ఝళిపించే పరిస్థితి ఉండకపోయేది.