ఈ మధ్య మా ప్రాంతానికి
తడి తాకిడి ఎక్కువైంది
అడుగు తీసి అడుగేస్తే
మనిషినే చిమ్మటిస్తున్నది
గాలికీ సందివ్వట్లేదు
నింగికి నేలకు సోపతి పెరిగింది
చీకటి మిలమిలలు
పగటికీ ఎదురీదుతున్నయ్
మబ్బులు గొర్రెల్లా తలలాడిస్తున్నయ్
ఇది నడమంత్రపు వానే
ఓట్ల సందడోలె
కిందా మీదా ఆనట్లేదు
పంటలేమైతేనేం వర్షానికేమవసరం
ప్రజలేమైతేనేం రాజకీయానికేమవసరం
చేనూ చెలుకల దుఃఖం మాత్రం
వాన నీటిలో కలిసి ఎవరి కంటా పడటం లేదు
ఆ చాటున వీధుల్లోకి దూసుకొచ్చిన వరద
గత సందేహాల్ని మటుమాయం చేస్తున్నది
వాన కాలమిప్పుడు
అధికమాసపు జెండా నెత్తుకున్నది
ఎంత అవసరమో గాని
జనమంతా తీరుబాటుగ
నాటకం చూస్తున్నరు
ఇలాంటి నడకలకు విస్తుపోయి
కాలమూ ఓర కంట చూస్తున్నది
బురదనంటుకున్న ప్రతి అడుగూ
ఇంకింత లోతుకు తొయ్యబడుతున్నది
వనిపాకల లచ్చిరెడ్డి: 9966 897001