సచ్చిదానంద తత్త్వాన్ని భారతీయ సంస్కృతిలో కొందరు పురుష రూపంగా, కొందరు స్త్రీ రూపంగా, మరికొందరు ఏ రూపం లేని నిరాకార నిర్గుణ తత్త్వంగా ఆరాధిస్తుంటారు. ఏ విధంగా ఆరాధించినా తత్త్వం ఒకటే. నిర్గుణ నిరాకార తత్త్వమే పరమాత్మ అని ఉపనిషత్తులు స్పష్టం చేశాయి. సగుణ నిరాకార తత్తం అనంత గుణాలు కలిగి ఏ ఆకారం లేని ఉపాసన విధానం. సగుణ సాకార తత్వంలో అనంత గుణాలతో ఆకారంగా ఉపాసించడం. ఏ రకంగా ఉపాసించినా అది ఒకే తత్తానికి సంకేతం.
సర్వవ్యాపకమైన ఈశ్వర చైతన్యాన్ని మహర్షులు తమ తపశ్శక్తితో దర్శించారు. భగవంతుడి గురించి, ఆత్మ తత్త్వం గురించి అనేక ధర్మశాస్ర్తాలు, దర్శన శాస్ర్తాలు, ఉపాసనా విధానాలు మనకు అందించారు. మనం పరమేశ్వరుడి చైతన్యాన్ని ‘అమ్మ’ అని పిలుస్తున్నాం. అమ్మ ప్రేమతత్త్వం విశ్వవ్యాప్తమైన ఈశ్వర చైతన్యంలో ఉంది. ‘ప్రేమరూపా ప్రియంకరీ’ అంటుంది లలితా సహస్రనా మం. ఆ తల్లి ప్రేమే సూర్యుడి వేడిలో, చంద్రుడి చల్లదనంలో, గాలిలో, నీటిలో, భూమిలో ఈ విశ్వమంతా వ్యాపించి, మనకు వివిధ రూపాల్లో కనిపిస్తుంది. ఆమె ప్రేమలో అనంతశక్తి దాగి ఉంది.
సృష్టికి పూర్వం పరమాత్మ ఒకటిగా ఉన్నాడు. ఈ విశ్వాన్ని సృష్టించాలని తనను రెండుగా చేసుకున్నాడు. అంటే ఆ పరమాత్మ తత్త్వానికి ఒక స్పందన కలిగింది. పరమాత్మ సంకల్పంలోనే అన్ని శక్తులు దాగిఉన్నా యి. ఆ శక్తులు అనేక రూపాలుగా వ్యక్తమయ్యాయి. ఆ సంకల్పాన్ని ఇచ్ఛాశక్తిగా అభివర్ణిస్తారు. ఈ ఇచ్ఛాశక్తి నుంచి పరమాత్మకు జ్ఞానశక్తి, క్రియాశక్తి సంప్రాప్తించాయి. ఏ పని చేయాలన్నా ఈ మూడుశక్తులూ ఉండాలి. ఈ శక్తులతోనే విశ్వ నిర్మాణం జరిగింది. సంకల్పానికి మరో పేరు కామం. అంటే కోరిక. సంకల్పశక్తి, ఇచ్ఛాశక్తులకు అర్థం కామం. అందుకే ఆ పరమాత్మకు కామేశ్వరుడు అని పేరు. కామేశ్వరుడి శక్తి రూపమే కామేశ్వరి. అందుకే అమ్మవారికి కామేశ్వరి అని పేరు. ఈ శక్తి ఆవిర్భావం తర్వాత జగత్తు నిర్మాణం జరిగింది. అందుకే వీరిని ఆదిదంపతులుగా అభివర్ణించారు. వారిరువురినీ జగత్తుకు మాతాపితరులుగా భావిస్తున్నాం.
ఆగమాల్లో శక్తి తంత్రం, శివ తంత్రం, విష్ణు తంత్రం.. ఇలా అనేక తంత్రశాస్ర్తా లు ఉన్నాయి. శక్తి తంత్రంలో ప్రధానంగా దశ మహావిద్యల గురించి చెప్పారు. కాళీ, తార, త్రిపుర సుందరి మొదలైన పది మహావిద్యలను ఎలా ఉపాసన చేయాలో మంత్ర, యంత్ర, తంత్ర శాస్ర్తాల గురించి అనేక గ్రంథాలున్నాయి. దశమహావిద్యల్లో ఒకే అమ్మవారిని పది రూపాలుగా ఉపాసన చేస్తారు. మనం ఏ అమ్మవారిని ఉపాసన చేసినా.. ఆమెలోనే మిగిలిన శక్తులన్నీ ఉన్నాయనే భావన కలిగి ఉండాలి. దశమహావిద్యల్లో మూడోది షోడశి విద్య. ఆవిడే లలితాదేవి. ఈ తల్లే లలితా త్రిపుర సుందరి. లలితా సహస్రనామాల్లో ‘మహాలక్ష్మి మృడప్రియ’గా లక్ష్మీదేవిని, ‘సరస్వతి శాస్త్రమయి’ అని సరస్వతిని, ‘మహాకాళి మహాశన’ అని కాళీమాతను ఆరాధిస్తారు. లలితాంబను.. మహాలక్ష్మిగా, సరస్వతిగా, కాళిగా భావన చేస్తూ ఉపాసిస్తారు. మూడుశక్తులనూ ఇముడ్చుకున్న మహాశక్తిగా లలితాంబను భావిస్తారు.
ఉపనిషత్తుల్లో ఏక, అనేక అని రెండు శబ్దాలు కనిపిస్తాయి. ఏక అంటే ఒక్కటి. అంటే విశ్వవ్యాప్త చైతన్యం ఒక్కటే. అనేక అంటే అనంత రూపాలు అని. జగదాంబ అయిన లలితాదేవిని ఏకానేక రూపాల్లో ఆరాధిస్తారు. నిరాకార శక్తిని సాకారంగా చూసినప్పుడు ఆ తల్లి లలితాదేవిగా ఒక చేతిలో చెరుకు విల్లు, ఇంకో చేతిలో ఐదు పూల బాణాలు, పైరెండు చేతుల్లో పాశం, అంకుశం ధరించిన రూపాన్ని దర్శిస్తాం. ప్రతి క్షణంలో, ప్రతి కణంలో జరిగే సృష్టి, స్థితి, లయ కారకులైన మహా చైతన్యాన్ని అమ్మగా ఆరాధిస్తున్నాం. సర్వదేవతా స్వరూపిణిగా ఉపాసిస్తూ ప్రార్థిస్తున్నాం. ఆ తల్లి కరుణ సదా మనపై ఉండుగాక.
– వేముగంటి శుక్తిమతి
99081 10937