స్వాతంత్య్రం, స్వేచ్ఛ, న్యాయం, భద్రత, స్థిరమైన జీవనోపాధి కోసం ఆకాక్షించిన లక్షలాది మందికి 2014 జూన్ 2 నాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భం ఒక చారిత్రక విజయం. 2000వ సంవత్సరం నుంచి కేసీఆర్ చేసిన అవిరళ కృషి ఫలితంగా స్వరాష్ట్రం ఏర్పడింది. 2014 నుంచి 2023 వరకు కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో గణనీయమైన మార్పులు జరిగాయి. దేశంలో అభివృద్ధి, పరిపాలనకు ఒక స్థిరమైన ఆదర్శంగా తెలంగాణ స్థిరపడిపోయింది. గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం కోసం కేసీఆర్ మార్గనిర్దేశంలో కేటీఆర్ ఎంతో కృషి చేశారు.
స్వాతంత్య్రం, ఆత్మగౌరవ నినాదంతో ఉద్యమ జెండా ఎత్తిన కేసీఆర్ స్వరాష్ర్టాన్ని సాధించారు. విద్య, ఉపాధి, నీళ్లు తదితర అంశాల్లో ఆంధ్రా పాలకుల వివక్షకు కేసీఆర్ చరమగీతం పాడారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా గురుతర బాధ్యతను తన భుజాలపై వేసుకున్న కేసీఆర్.. ప్రజల సంక్షేమం, సాధికారత కోసం పాటుపడ్డారు. రైతులు, పేదలు, మహిళలు, దళితులు, గిరిజనులు, బడుగుబలహీనవర్గాల సమగ్రాభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేశారు. ప్రపంచస్థాయి మౌలిక వసతుల కల్పన, నిరంతర విద్యుత్తు, ఐటీ, అర్బన్ డెవలప్మెంట్ ద్వారా తెలంగాణను పునర్నిర్మించారు. సాంకేతిక, సృజనాత్మక విధానాలను అవలంబించిన కేటీఆర్ తన తండ్రి విజన్‌ను ముందుకు తీసుకెళ్లారు. హైదరాబాద్‌ను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దారు.
కేసీఆర్ విజన్ తెలంగాణకు ఒక గళాన్ని ఇచ్చింది. కేటీఆర్ విజన్ ద్వారా గ్లోబల్ దృక్పథంతో భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే సమగ్ర, సమ్మిళిత ఆర్థిక వ్యవస్థ నిర్మితమైంది. వారిరువురి నాయకత్వ కలయిక దశాబ్ద కాలంలోనే తెలంగాణను దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా నిలిపింది.
కేసీఆర్ పాలనలో మన భాష, మన పండుగలు, తెలంగాణ తల్లికి గుర్తింపు దక్కింది. కుమ్రం భీం, చాకలి ఐలమ్మ, కాళోజీ లాంటి తెలంగాణ కవులు, రచయితలు, వీరులు గౌరవం పొందారు.
కేసీఆర్ పాలనలో పదేండ్లపాటు రాష్ట్రంలో భారీగా మౌలిక సదుపాయాల కల్పన జరిగింది. 2014లో లోటు విద్యుత్తులో ఉన్న పరిస్థితి నుంచి 24 గంటల పాటు నాణ్యమైన, నిరంతర కరెంట్ సరఫరా చేసే స్థితికి రాష్ట్రం చేరుకున్నది. అంతేకాదు, రైతులకు ఉచితంగా విద్యుత్తు సరఫరా చేశారు. హైదరాబాద్‌లో మెట్రో రైలు, ఫ్లైఓవర్లు, సిగ్నల్ ఫ్రీ కారిడార్లు, నిరంతర విద్యుత్తు తదితర సదుపాయాలు టెకీలు, డాక్టర్లు, ఇంజినీర్లు, ఎన్నారైలను ఆకర్షించాయి. కేటీఆర్ తరచుగా తెలుగు ఎన్నారైలతో మమేకమై తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహించారు.
కేటీఆర్ కృషి ఫలితంగా ఐటీ, పరిశ్రమల రంగాలు పరుగులు పెట్టాయి. 2014లో రూ.57 వేల కోట్లుగా ఉన్న తెలంగాణ ఐటీ ఎగుమతులు 2023 నాటికి రూ.2.41 లక్షల కోట్లకు చేరుకున్నాయి. సుమారు 7 లక్షలకు పైగా ఉద్యోగాల సృష్టి జరిగింది. కేటీఆర్ తీసుకొచ్చిన విధానాల మూలంగా అమెజాన్, గూగుల్, ఫేస్బుక్, మైక్రోసాఫ్ట్, యాపిల్, ఊబర్ లాంటి బహుళజాతి సంస్థలు హైదరాబాద్‌లో తమ అతిపెద్ద క్యాంపస్‌లను ఏర్పా టు చేశాయి. స్టార్టప్‌లు, యువ పారిశ్రామికవేత్తలు, మహిళా పారిశ్రామికవేత్తలకు సాంకేతిక మద్దతు అందించేందుకు టీ హబ్, వీ హబ్‌లను కేసీఆర్ సర్కారు ఏర్పాటు చేసింది. దళిత బంధు పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసి దళితులను ఆంత్రప్రెన్యూర్లుగా తీర్చిదిద్దారు.
రాష్ట్ర ప్రజల సర్వతోముఖావృద్ధి కోసం కేసీఆర్ అనేక పథకాలను అమలు చేశారు. మిషన్ భగీరథ పథకం కింద రాష్ట్రంలోని అన్ని ఇండ్లకు సురక్షిత మంచినీటి సరఫరా చేశారు. మిషన్ కాకతీయ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 46 వేలకు పైగా చెరువులు పునరుద్ధరించారు. పల్లె, పట్టణ ప్రగతి పథకం కింద గ్రామాలు, పట్టణాలు సుందరంగా మారాయి. స్వయంపాలనలో భాగంగా తండాలు, ఆదివాసీ గూడేలను కేసీఆర్ గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశారు. గ్రామాభివృద్ధి కోసం నెలనెలా (ఏటా రూ.5-25 లక్షల వరకు) నిధులు మంజూరు చేశారు. అనేక ప్రభుత్వ విద్యాసంస్థలు, మెడికల్, ఇంజినీరింగ్ కళాశాలలను కేసీఆర్ నెలకొల్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల పిల్లల కోసం వెయ్యికి పైగా గురుకులాలను ఏర్పాటు చేశారు.
ఆధునిక పరిపాలనా పద్ధతులతోపాటు నిధులు, వినూత్న పథకాలు, స్వయంప్రతిపత్తి ద్వారా గాంధీజీ కలలుగన్న గ్రామస్వరాజ్యం ఆలోచనకు కేటీఆర్ ఆచరణ రూపం ఇచ్చారు. గాంధీజీ గ్రామస్వరాజ్యానికి ప్రాతిపదికలైన స్వయం సమృద్ధి, స్వచ్ఛత, సాధికారతలతో తెలంగాణ దేశంలోని అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా మారింది. గతంలో కేటీఆర్ చెప్పినట్టుగా.. మన పల్లెలు ఆదర్శ పల్లెలుగా మారాయి, ఒకవేళ గాంధీజీ కనుక బతికుంటే, తెలంగాణ గ్రామీణాభివృద్ధిని చూసి సగర్వంగా అభినందించేవారు.
(డాలస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా)
– రావు కల్వల