తమ్ముడు ముఖ్యమంత్రిగా ఉంటేనే అన్నదమ్ముల హవా కొనసాగుతున్న కాలం ఇది. అలాంటిది తండ్రి ముఖ్యమంత్రిగా ఉండి.. ఆ తండ్రి ప్రభుత్వంలో మంత్రిగా కొనసాగుతూ…అధికారంలో ఉన్న పార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉండే వ్యక్తి ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? సాధారణ పరిస్థితుల్లో అయితే ఊహించటం పెద్ద కష్టమేమీ కాదు. ఆ నాయకుడిని మచ్చిక చేసుకోవటానికి, ప్రసన్నం చేసుకోవటానికి వ్యక్తులు, సంస్థలు పోటీపడటం సహజం.
అధికారం లేనప్పుడూ ఆ నాయకుడికి దేశ, విదేశాల్లో అదే గౌరవం, అదే మర్యాద దక్కటం ఎలా సాధ్యం? అంటే అధికారం ఉన్నా లేకపోయినా నిరంతరం తనలో సహజసిద్ధంగా ఉన్న అధ్యయనం, కార్యశీలత, కమిట్మెంట్, విషయ నైపుణ్యంతోపాటు అధికారంలో ఉన్నప్పుడు తన రాష్ర్టానికి తన చొరవ, ముందుచూపుతో చేసిన పనులు, వాటి ద్వారా వచ్చిన ఫలితాలు కారణమని చెప్పాలి. ఆ అరుదైన ఆవిష్కరణ తెలంగాణది అయితే, ఆ ఆవిష్కరణల వెనుక దాగిన కార్యశీలత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్)ది. కేటీఆర్ సుదీర్ఘకాలం ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కాలంలో దేశ, విదేశీ సంస్థల నుంచి ఆహ్వానాలు అందాయి. అధికారంలో ఉన్నపార్టీకి వర్కింగ్ ప్రెసిడెంట్‌గా కంటే తాను ప్రాతినిధ్యం వహిస్తున్న శాఖలకు తన పనితీరుతో జాతీయ, అంతర్జాతీయ ఇమేజ్ను తెచ్చారనటంలో ఎవరికీ అభ్యంతరం లేదు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో ప్రైవేట్ రంగంలో 16 లక్షలకుపైగా ఉద్యోగాల కల్పన జరిగింది. పెట్టుబడులూ అదే దామాషాలో రాష్ర్టానికి వచ్చాయి. దేశ, విదేశాల్లో ఐటీ, పరిశ్రమలు, పట్టణాభివృద్ధి రంగాలకు కేటీఆర్ తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. అందువల్లే అధికారం లేకపోయినా కేటీఆర్‌కు దేశ, విదేశాల్లో అదే క్రేజీ..అదే ఇమేజ్ కొనసాగుతున్నది.
సుదీర్ఘ పోరాటాల ద్వారా సాధించుకున్న తెలంగాణను అన్నిరంగాల్లో తిరుగులేని శక్తిగా రూపొందించుకోవాలనే బలమైన లక్ష్యంతో కేసీఆర్ పాలన కొనసాగింది. తెలంగాణను బాగు చేసుకోవాలనే తపన, భవిష్యత్తును ఊహించే దార్శనికత, తెలంగాణ ప్రజల అవసరాలను అర్థం చేసుకోగలిగే మనసు, అంతకు రెట్టింపు తెలంగాణను అమితంగా ప్రేమించగలటం వల్ల కేసీఆర్ హయాం అద్భుత ఫలితాలు సాధించింది. కేసీఆర్ టీంలో ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్ శాఖలను నిర్వహించిన కేటీఆర్‌కు అధికారం లేకపోయినా దేశ, విదేశాల్లో అదే గౌరవం దక్కుతుందనటానికి కేరళలోని కొచ్చిలో ఈ జనవరిలో జరిగిన ‘ది ఇండస్ ఆంత్రప్రెన్యూర్స్’ (టీఐఈ) సదస్సే నిదర్శనం. ఆ సదస్సులో కేటీఆర్‌ను ఐటీ మంత్రిగా సంబోధించారు. తాను ‘ఐ టీ శాఖ కాదు అసలు మంత్రినే కాను’ అని కేటీఆర్ వారించినా నిర్వాహకులు ‘మేము మాత్రం మంత్రిగా నే భావిస్తాం’ అని చెప్పేశారు. అలాగే దేశంలోనే అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో మొదటి వరుసలో నిలిచే ఐఐటీ మద్రాస్ ఏటా నిర్వహించే ఆంత్రపెన్యూరల్ ఫెస్టివల్ ఈ- సమ్మిట్‌లో ఇటీవలే కేటీఆర్ కీలకోపన్యాసం చేశారు. అక్కడా అదే ఆదరణ, అభిమానం.
ఇక లండన్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ప్రముఖ ఆటోమొబైల్ -ఇంజినీరింగ్ సర్వీసెస్ సంస్థ ప్రాగ్మాటిక్ డిజైన్ సొల్యూషన్స్ లిమిటెడ్ యూకేలోని -వార్విక్ టెక్నాలజీ పార్ ఏర్పాటుచేసిన తమ నూతన కేంద్రాన్ని ప్రారంభించాలని కేటీఆర్‌ను ఆహ్వానించింది. ప్రపంచంలోనే అతి పెద్దదైన, అత్యంత విలువైన కారు బ్రాండ్ అయినా మైక్లారెన్, ఆస్టన్ మార్టిన్, జాగ్వార్, ల్యాండ్ రోవర్ వంటి ప్రముఖ ఆటో దిగ్గజాలకు ఆ సంస్థ సేవలందిస్తున్నది.
తెలంగాణ రాష్ర్టాన్ని ఐటీ, ఇండస్ట్రీయల్ ఇన్నోవేషన్‌లో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత కేటీఆర్‌దని ఆ సంస్థ ఆహ్వాన పత్రంలో ముద్రించింది. బ్రిటన్‌లో జరిగే ‘ఐడియాస్ ఫర్ ఇండియా-2025’ సదస్సుకు అతిథిగా రావాలని ‘బ్రిడ్జ్ ఇండియా’ సంస్థ కేటీఆర్‌ను ఆహ్వానించింది. ఈ 30వ తేదీన లండన్‌లోని రాయల్ లాంకాస్టర్లో జరిగే సదస్సులో ముఖ్య వక్తగా ప్రసంగించాలని కోరింది. 2023లో కేటీఆర్ చేసిన ప్రసంగం అందరినీ ఆకట్టుకున్నదని, ఆ ప్రసంగం కొత్త ఆలోచనలకు పురిగొల్పిన కారణంగానే ఈసారి కూడా తాము కేటీఆర్‌ను ఆహ్వానిస్తున్నామని ఆ సంస్థ నిర్వాహకులు ఓపెన్‌గానే చెప్పారు. ‘తెలంగాణలో ప్రభుత్వం మారినప్పటికీ కేటీఆర్‌ను ప్రత్యేకంగా ఈ ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానిస్తున్నామని బ్రిడ్జ్ ఇండియా ఫౌండర్ ప్రతీక్ దత్తానీ కేటీఆర్‌కు రాసిన లేఖలో పేర్కొనటం గమనార్హం. అలాగే వచ్చే నెల (జూన్) 20, 21వ తేదీల్లో ఇంగ్లండ్‌లో జరిగే ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. ‘భారత అభివృద్ధికి అత్యాధునిక సాంకేతికతలు’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్న ఈ సదస్సులో బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో తెలంగాణలో అమలుచేసిన వినూత్న విధానాలు, సాంకేతిక ఆధారిత అభివృద్ధి నమూనాల ఆచరణ అనుభవాలను వివరించాలని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం నిర్వాహకులు కేటీఆర్‌ను కోరారు. తెలంగాణ రాష్ర్టాన్ని టెక్నాలజీ హబ్‌గా మార్చడంలో, హైదరాబాద్ అనేక అంతర్జాతీయ ఐటీ కంపెనీలను స్థాపించడంలో కేటీఆర్ చేసిన కృషి, టీ-హబ్, వీ-హబ్, టీ-వర్స్ వంటి వినూత్న కార్యక్రమ స్టార్టప్‌ల సృష్టిలో అనుసరించిన వైఖరిని వివరించాలని ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరం కోరింది.
జాతీయ, అంతర్జాతీయ సంస్థలు కేటీఆర్‌ను ఐకానిక్‌గా చూడటం వెనుక బలమైన నేపథ్యం ఉన్నది. ఐటీ రంగంలో తెలంగాణ సాధించిన విజయగాథ. దానికి భూమిక కేసీఆర్ నాయకత్వంలో రూపొందిన టీఎస్ ఐపాస్ విధానం. వీటికితోడు 2017లో జరిగిన గ్లోబల్ ఆంత్రప్రెన్యూర్‌షిప్ సమ్మిట్‌లో నాటి ఐటీ శాఖమంత్రిగా కేటీఆర్ ప్రదర్శించిన చొరవ, ఆ సమ్మిట్‌లో ఆయన వాక్పటిమకు నాటి (ప్రస్తుతం కూడా) అమెరికా అధ్యక్షులు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ముగ్ధురాలయ్యారు. బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్ సతీమణి చెర్రీ, నాటి డెల్ ఈఎంసీ కరేన్ క్వింటోస్ వంటి ఎంతోమంది కేటీఆర్ విజన్‌కు ఫిదా అయ్యారు. అలా తెలంగాణ ఐటీ రంగానికి ఒక్కొక్కటిగా పడిన అడుగుల ఫలితంగా హైదరాబాద్ దేశంలోనే కాకుండా ప్రపంచ ఐటీపటంలో చిరస్థాయిగా నిలిచేలా చేసింది. ఐటీ ఉత్పత్తుల్లో తెలంగాణ సాటిలేని మేటి రికార్డును సృష్టించటం వెనుక కేటీఆర్ చోదకశక్తిగా పనిచేశారని దేశ, విదేశం గుర్తిస్తున్నది. కీర్తిస్తున్నది. ఆ కీర్తికిరిటాలనే తమకు అనుభవపాఠాలుగా చెప్పాలని ఆయనను సంస్థలు ఆహ్వానిస్తున్నాయి. అదీ తెలంగాణకు దక్కుతున్న గౌరవం.