ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలకు ప్రతి ఐదేండ్లకు ఒకసారి పీఆర్సీ అమలు చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసి సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడం ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు నుంచి జరుగుతున్న ప్రక్రియ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తరువాత అప్పటికే నిజాం పరిపాలనలో సర్కారీ ములాజీం యూనియన్ చేసిన అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా హైదరాబాద్ రాష్ట్రంలో మద్రాస్ రాష్ట్రం కంటే వేతనాలు ఎక్కువగా ఉండేవి. కానీ భాషా రాష్ర్టాల పేరిట ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత మొదటి పీఆర్సీలో ఉద్యోగుల జీతాలు ఆంధ్ర ప్రాంత ఉద్యోగులతో సమానంగా చేయడం వలన అప్పటికే ఎక్కువ వేతనాలు పొందుతున్న తెలంగాణ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా తగ్గాయి. జయశంకర్ సార్ అన్నట్లు మొదటి పీఆర్సీ ‘పే రిడక్షన్ కమిటీ’గా మారిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వలన నష్టపోయిన తొలి వర్గం ఉద్యోగ వర్గమే. అప్పటినుంచి వేతనాల అసమానతలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ విషయాన్ని తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఒక ప్రధాన అంశంగా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరిగింది. 1956 నుంచి 2014 వరకు పాలించిన వివిధ ప్రభుత్వాలు 10 సార్లు పీఆర్సీని ఏర్పాటు చేశాయి. అయితే, 1958, 1965 పీఆర్సీల్లో జీతాలు ఏమాత్రం పెంచకపోవడం వల్ల ఉద్యోగుల వేతనాల్లో పెద్దగా మార్పు రాలేదు. 1982, 1986, 1993 పీఆర్సీలు 10 శాతం హెచ్చింపు చేయాలని కమిషన్ ప్రతిపాదిస్తే అప్పటి ప్రభుత్వాలు ఆమోదించి మూడు పీఆర్సీల్లో కేవలం 10 శాతం ఫిట్మెంట్ అమలు చేశాయి. దీనివల్ల ఉద్యోగుల జీతాల విషయంలో ఇతర రాష్ర్టాల కంటే తక్కువ జీతాలు ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచిపోయింది.
1999లో జస్టిస్ పున్నయ్య పీఆర్సీ కమిటీ 15 శాతం సిఫారసు చేసింది. ఉద్యోగ సంఘాలు చేసిన పోరాటాల ద్వారా అప్పటి సీఎం చంద్రబాబునాయుడి ప్రభుత్వం 25 శాతం అమలు చేసింది. చంద్రబాబు అనుసరించిన ప్రజా, ఉద్యోగ వ్యతిరేక విధానాల వలన ఉద్యోగులు అనేక ఇబ్బందులు పడ్డారు. ఉద్యోగులకు 9 విడతల కరువు భత్యం ఇవ్వకుండా వేధించారు. ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ కోసం ప్రయత్నాలు కొనసాగించి ప్రభుత్వ సర్వీసుల్లో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ విధానాలను తీవ్రతరం చేశారు. ఉద్యోగులు నిత్యం అభద్రతాభావంతో ఉంటేనే పనిచేస్తారని ప్రకటించి నిత్యం వివిధ కారణాలతో వేధించడం వలన ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆందోళనలు, నిరసనలు చేపట్టాయి. చివరికి టీడీపీ ఓటమికి ఉద్యోగులు కూడా ప్రజలతో పాటు కారణమయ్యారు. అనంతరం వైయస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉద్యోగ సమస్యలు పరిష్కారం అవుతాయని ఆశించారు. కానీ 2005 పీఆర్సీ కమిటీ జస్టిస్ జగన్నాథరెడ్డి నేతృత్వంలో 15 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదించగా కేవలం 16 శాతం మాత్రమే ప్రభుత్వం అమలుచేసింది. చంద్రబాబును అధికారంలోకి రాకుండా చేశామనే సంతోషంలో ఉద్యోగులు పెద్దగా పీఆర్సీపై ఆందోళనలకు దిగలేదు. దీంతో ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగులకు జరిగిన అన్యాయం సరిచేయలేని స్థాయికి దిగజారింది.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమం తీవ్రంగా కొనసాగుతున్న తరుణంలో 2010లో సీఎస్ అగర్వాల్ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసింది. ఆ కమిటీ 27 శాతం సిఫారసు చేస్తే రోశయ్య ప్రభుత్వం 39 శాతం ఫిట్మెంట్ ఇచ్చింది. దీనికి ప్రధాన కారణం ఉద్యోగుల ఉద్యమాలతో పాటు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం కూడా కొనసాగింది. తెలంగాణ ఉద్యమం తీవ్ర స్థాయిలో జరుగుతున్న తరుణంలో 2013లో ప్రభుత్వం 10వ పీఆర్సీ ఏర్పాటు చేసింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమం వలన రాజకీయ అనిశ్చితి వాతావరణం ఏర్పడింది. దీని వలన 29 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదిస్తూ కమిషన్ తన నివేదికను గవర్నర్‌కు సమర్పించింది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు తరువాత పీఆర్సీ కోసం ఉద్యోగులు ఆందోళనలు చేయడం, ప్రభుత్వంతో దీర్ఘకాలిక చర్చలు జరుపడం వంటి వాటిని నిలిపివేయాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చరిత్రలో నిలిచిపోయింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా ప్రభుత్వానికి అందిన పీఆర్సీ నివేదికను టీఎన్జీవో అధ్యక్షుడిగా ఉన్న నాతోపాటు ఇతర ఉద్యోగ మిత్రులకు అందించి..‘ప్రభుత్వం ఎలా స్పందించాలో మీరే చెప్పాలి..ప్రభుత్వం మీది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ పాత్ర కీలకం’ అంటూ కేసీఆర్ చెప్పడం మా అందరికీ గర్వకారణం. ఉద్యోగ సంఘాల జాక్ చర్చించి 42 శాతం ఇవ్వాలని కేసీఆర్‌కి చెప్పిన వెంటనే ఎలాంటి చర్చలు జరుపకుండా, అధికారులతో రివ్యూ చేయకుండానే 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. ఉద్యోగుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకుని వారు అడిగిన 42 శాతం కంటే ఎక్కువ 43 శాతం ఇవ్వడం వల్ల జీతాలు రెట్టింపయ్యాయి. తొలిసారి అసంతృప్తి లేని తొలి తెలంగాణ పీఆర్సీగా రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయింది.
రెండవ పీఆర్సీ అమలుకు కేసీఆర్ ప్రభుత్వం సకాలంలో బిశ్వాల్ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. కమిషన్ 7.50 శాతం ఫిట్మెంట్ ప్రతిపాదన చేయడంతో 30 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి నెలకొన్నది. అయినప్పటికీ రాష్ట్ర ఉద్యోగుల పరిస్థితిని అర్థం చేసుకుని పీఆర్సీ రికమండ్ చేసిన ఫిట్మెంట్ కంటే నాలుగు రెట్లు ఫిట్మెంట్ ఇవ్వడం ద్వారా ఉద్యోగ, ఉపాధ్యాయుల జీతాలు పెరిగాయి. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో 39 శాతం, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ సర్కార్ ఇచ్చిన రెండు పీఆర్సీలు కలిపి 73 శాతం ఫిట్మెంట్ ఇవ్వడం వల్ల దేశంలోనే మెరుగైన వేతనాలు పొందుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ నిలిచింది. మూడవ పీఆర్సీ కోసం కేసీఆర్ ప్రభుత్వం 2023 జూలైలో శివశంకర్ నేతృత్వంలో కమిషన్‌ను వేయడమే కాకుండా తొలిసారిగా పీఆర్సీ ఉత్తర్వులతోపాటు 5 శాతం మధ్యంతర భృతి ప్రకటించింది.
అదే ఏడాది అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 6 నెలల్లోపు పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చింది. కానీ రెండున్నరేండ్లు గడుస్తున్నా పీఆర్సీ అమలు ముందుకు సాగలేదు. కానీ పీఆర్సీ కమిటీ మూడేండ్లు గడిచినా నివేదిక ఇవ్వలేదని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం విడ్డూరం. ఐదేండ్ల కాలానికి అమలు కావలసిన పీఆర్సీ తయారు చేయడానికి ఐదేండ్లు పడుతుందా? అని ఉద్యోగులు ప్రశ్నించారు. పీఆర్సీ వెంటనే అమలు చేయాలని అసెంబ్లీలో కేటీఆర్, హరీశ్‌రావు డిమాండ్ చేస్తే మరుచటి 30/9/26 వరకు గడువు పొడిగించడం ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వైఖరి తెలియ జేసింది.
ఉద్యోగుల 5 విడతల కరువుభత్యం పెండింగ్‌లో ఉన్నది. రిటైర్డ్ ఉద్యోగులకు రావలసిన బకాయిలు నిలిపివేయడం వలన ఇప్పటికే 86 మంది ఉద్యోగులు మరణించడం బాధాకరం. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో ప్రభుత్వం రూ.4.17 లక్షల కోట్ల అప్పులు తెచ్చి అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టింది. ఉద్యోగులకు మెరుగైన జీతాలు ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేండ్లలో రూ.3.44 లక్షల కోట్లు అప్పు చేసింది. ఒక్క సంక్షేమ పథకమూ లేదు, అభివృద్ధి జాడ లేదు. ఉద్యోగులకు ఏమీ ఇవ్వలేదు. పైగా ‘మీకు పీఆర్సీ ఇవ్వాలంటే ఏ సంక్షేమ పథకం ఆపాలో చెప్పండి’ అని సీఎం బెదిరిస్తూ కాలం గడుపుతున్నారు. ఉద్యోగులు రెండున్నరేండ్లుగా ఎదురుచూస్తున్నా ప్రభుత్వ స్పందన లేకపోవడం వారిలో తీవ్ర ఆందోళన నెలకొన్నది. ఈ నేపథ్యంలో ఉద్యోగ సంఘాలు ఆందోళనకు దిగుతున్నాయి.
మరోవైపు అన్ని శాఖల్లో ఆంధ్రా అధికారుల పెత్తనం పెరిగిపోయింది. నీటి పారుదల, విద్యుత్, ఎక్సైజ్ శాఖల్లో జరిగిన పరిణామాలు పరాకాష్టకు చేరుకున్నాయి. జీతం కోసమే కాకుండా తెలంగాణ అస్తిత్వం కోసం, ఆంధ్రా పెత్తనం అంతం కోసం పోరాడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం వెంటనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి వారి సమస్యలు పరిష్కరించాలి. లేకపోతే పరిపాలన స్తంభించడం ఖాయం.
(రచయిత: టీఎన్జీవో మాజీ అధ్యక్షుడు)
– దేవీప్రసాద్