దేశంలో కష్టపడే ప్రజలున్నారు. రోజురోజుకు సంపద పెరుగుతూనే ఉన్నది. కానీ, ఆ పెరిగిన సంపద కొంతమంది చేతుల్లోకి చేరిపోతున్నది. పాలకులు తమ ఆశ్రిత పెట్టుబడిదారులకు ప్రజల ఆస్తులను, ప్రకృతి సంపదను దోచిపెడుతున్నారు. పెట్టుబడిదారుల నష్టాలను సోషలైజ్ చేస్తూ, వారి లాభాలను మాత్రం ప్రైవేటైజ్ చేస్తున్నారు. అందుకు ఉదాహరణే దేశంలో పేరుమోసిన ఆశ్రిత పెట్టుబడిదారుడు గౌతమ్ అదానీ. అధికార పీఠాలపై ఆసీనులైన వాళ్ల అండదండలతో వ్యాపార సామ్రాజ్యాన్ని అదానీ విస్తరించిన తీరును చూస్తుంటే ప్రజలు కట్టబెట్టిన అధికారాన్ని పాలకులు ఎంత బహిరంగంగా హేళన చేస్తున్నారో అర్థమవుతున్నది. ప్రభుత్వ పెద్దలను మచ్చిక చేసుకోవడం, కీలక వ్యక్తులకు లంచాలు కుమ్మరించడం ప్రభుత్వాల అండదండలతో సంపద పెంచుకోవడం.. ఇదీ అదానీ వ్యాపార సూత్రం.
మన దేశంలోనే కాదు, విదేశాల్లోనూ అదానీ వ్యాపారాలపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. భారత ప్రధాని మోదీ ఒత్తిడి మేరకే విద్యుత్ ప్రాజెక్టును కట్టబెట్టాల్సి వచ్చిందని స్వయంగా శ్రీలంక విద్యుత్ శాఖ ప్రతినిధులు ఆ దేశ పార్లమెంట్లో ప్రకటించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అయితే, ఇలా పెద్దల అండదండలతో దూసుకుపోతున్న అదానీ అమెరికాలో మాత్రం చతికిలపడ్డాడు. అమెరికాలో పెట్టుబడిదారుల నుంచి సేకరించిన డబ్బును భారత్‌లోని పలు రాష్ట్ర ప్రభుత్వాల ముఖ్యులకు లంచాలుగా ఇచ్చారని అగ్రరాజ్యం తాజాగా ఓ కేసు నమోదు చేసింది. అంతేకాదు, అరెస్టుకు వారంట్ కూడా జారీ చేసింది. దీంతో కెన్యా వెంటనే అదానీతో ఉన్న ఒప్పందాలను రద్దు చేసుకున్నది. ప్రధాన విమానాశ్రయ అభివృద్ధి, 30 ఏండ్ల నిర్వహణ కోసం రూ.15,631 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు కెన్యా ప్రభుత్వం అదానీతో గతంలో ఒప్పందం చేసుకున్నది. అలాగే పవర్ లైన్ల నిర్మాణానికి రూ.6,218 కోట్లతో అగ్రిమెంట్ కుదుర్చుకున్నది. ఎప్పుడైతే అమెరికా కేసు నమోదు చేసిందో ఆ వెంటనే ఈ రెండు ఒప్పందాలను రద్దు చేసుకున్నట్టు కెన్యా అధ్యక్షుడు రూటో తేల్చిచెప్పారు.
టీఆర్ఎస్, బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన తర్వాత కేసీఆర్ 2023 ఫిబ్రవరిలో నాందేడ్‌లో తొలి బహిరంగ సభ నిర్వహించారు. ఆ సభ అనంతరం నేషనల్ మీడియాతో మాట్లాడిన కేసీఆర్ బీజేపీ, అదానీ స్నేహాన్ని ఎండగట్టారు. ‘అదానీ కంపెనీలో ఎల్ఐసీ రూ.80 వేల కోట్ల పెట్టుబడి పెట్టడం సరికాదు. ప్రపంచంలోనే అతిపెద్ద బీమా కంపెనీ అయిన ఎల్ఐసీ వ్యవహారంలో కేంద్రం ఎందుకు జోక్యం చేసుకుంటున్నది? అదానీ అవినీతిపై కేంద్రం జాయింట్ పార్లమెంటరీ కమిటీ-జేపీసీ ఏర్పాటు చేయాలి’ అని డిమాండ్ చేశారు.
ఇలా అంతర్జాతీయంగా అవినీతి ముద్ర వేసుకున్న అదానీని అటు భారత్‌లో, ఇటు మన తెలంగాణలో నెత్తికెత్తుకోవడానికి కారణాలేమిటో ఏలికలకే తెలియాలి. అదానీ అరెస్టుకు అమెరికా కోర్టు వారంట్ జారీ చేయడంతో భారత్‌లో అంటకాగినవాళ్లంతా ఉలిక్కిపడ్డారు. ఇక తెలంగాణ విషయానికి వస్తే ప్రతిపాదిత స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇచ్చిన రూ.100 కోట్ల చందాను తీసుకోవడానికి సిద్ధంగా లేమంటూ సీఎం రేవంత్‌రెడ్డి వెనుకడుగు వేశారు. కానీ, అదానీతో చేసుకున్న ఒప్పందాలపై ఆయన స్పష్టత ఇవ్వలేదు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పూణెలో పర్యటించిన రేవంత్ మోదీ, అదానీ కలిసి దోపిడీకి ప్లాన్ చేశారని, మరాఠీలు ఆదమరిస్తే ఆర్థిక రాజధాని ముంబై ఆగమైతుందని విమర్శించారు. మహారాష్ట్రలో దోపిడీ కోసం పెట్టుబడులు పెట్టే అదానీ.. రేవంత్‌రెడ్డితో చేసుకునే ఒప్పందాల ద్వారా తెలంగాణను ఉద్ధరిస్తారా అనే విషయమై ఆయనే సెలవియ్యాలి. ఇక్కడ విషయం రూ.100 కోట్ల చందాకు సంబంధించినది మాత్రమే కాదు, దావోస్‌లో అదానీ కంపెనీలతో రేవంత్‌రెడ్డి చేసుకున్న పెట్టుబడుల ఒప్పందాలు, నల్గొండ జిల్లాలో అదానీకి చెందిన అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి అనుమతులపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ పరిభాషలో చెప్పాలంటే దోపిడీదారుడైన అదానీతో ఆయన చేసుకున్న ఒప్పందాలు పారదర్శకంగా జరిగాయని ప్రజలు ఎలా నమ్మాలి?
అదానీ కంపెనీ నుంచి బొగ్గు కొనుగోళ్లు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రం ఒత్తిడి చేసిన సంగతి తెలిసిందే. కానీ, ఈ ప్రతిపాదనను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యతిరేకించారు. ‘కోల్ ఇండియా మైనింగ్ కంటే సింగరేణి గొప్పగా పనిచేస్తున్నది. ప్రభుత్వరంగ సంస్థలను పరిరక్షించే లక్ష్యంతో సింగరేణిని కాపాడుకుంటాం. టీఎస్జెన్కో ఆధ్వర్యంలోనే బొగ్గు ఉత్పత్తిని కొనసాగిస్తాం. దేశంలో రూ.3 వేల నుంచి రూ.4 వేలకు టన్ను బొగ్గు లభ్యమౌతున్నప్పుడు అదానీ కంపెనీకి చెందిన ఆస్ట్రేలియా బొగ్గును టన్నుకు రూ.30 వేల నుంచి 40 వేలు వెచ్చించి కొనాల్సిన అవసరం ఏమిటి? అదానీ నుంచి బొగ్గు కొనుగోలు చేయాలంటూ రాష్ర్టాలపై కేంద్రం ఒత్తిడి పెంచడంలో ఆంతర్యమేంటి?’ అని 2017లోనే ఆయన ప్రశ్నించారు.
అమెరికాలోని హిండెన్‌బర్గ్ సంస్థ 2023లోనే అదానీపై తీవ్ర ఆరోపణలు చేసింది. స్టాక్మార్కెట్లో అదానీ కంపెనీ షేర్ల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నదని నివేదికను విడుదల చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లో అదానీ షేర్ల విలువ ఘోరంగా పతనమైంది. అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ-జేపీసీ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ కూడా డిమాండ్ చేశారు. దేశంలో ప్రధాని మోదీ, అదానీ కలిసి దోపిడీకి పాల్పడుతున్నారని రాహుల్ ఆరోపణలు చేస్తున్నారు. కానీ, తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అదానీతో వేల కోట్ల రూపాయల ఒప్పందాలు ఎలా చేసుకుంటున్నది? అయితే, దావోస్ వేదికగా అదానీ కంపెనీతో రేవంత్ చేసుకున్న రూ.12,440 కోట్ల ఒప్పందం రాహుల్‌కు తెలియకుండానే జరిగిందా? ఇదిలా ఉంటే.. రామన్నపేటలో అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీకి రెడ్ కార్పెట్ పర్చడం, కొడంగల్‌లో సిమెంట్ ఫ్యాక్టరీకి ప్రతిపాదనలపై రేవంత్ ప్రభుత్వ వైఖరేంటో ప్రజలకు స్పష్టతను ఇవ్వాలి.
అదానీతో రేవంత్ చేసుకున్న నేటి ఒప్పందాలు, రేపటి కుంభకోణాలనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెరవెనుక దోపిడీ మంత్రాంగం నడుపుతూ తెరముందు గారడీ చేస్తున్నారంటూ రాహుల్, రేవంత్ పాలిట్రిక్స్‌ను ప్రజలు తూర్పారపడుతున్నారు. దేశంలో ప్రతిపక్ష పార్టీగా ఒక స్టాండ్, తెలంగాణలో అధికార పార్టీగా మరో స్టాండ్ తీసుకుంటూ అవినీతి ఆరోపిత అదానీకి కాంగ్రెస్ పార్టీ ఎర్ర తివాచీ పరుస్తున్నది. దీని వెనుక ఉన్న మతలబు ఏమిటో ప్రజలకు తెలువదా? దేశ సంపదను ఒకరు, రాష్ట్ర వనరులను మరొకరు పోటీపడి అవినీతి, ఆశ్రిత పెట్టుబడిదారులకు కట్టబెట్టడం భవిష్యత్ తరాలకు నష్టదాయకం.