‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’ అన్న ఏకైక నినాదంతో 2009 నవంబర్ 29న ఆమరణ నిరాహారదీక్ష ప్రారంభించిన కేసీఆర్ డిసెంబర్ 9 రాత్రి దీక్ష విరమించిన రోజు నేడు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ప్రజల పోరాట ఫలితంగా తొలిసారిగా కేంద్రం సాధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన చేసిన రోజు నేడు. ఆ చారిత్రక సందర్భానికి పదహారేండ్లు. కేసీఆర్ దీక్ష కొనసాగిన ఆ 11 రోజులు తెలంగాణ ఒక నిప్పుల ఉప్పెన. నాటి ఉద్యమం ఢిల్లీ సింహాసనాన్ని కదిలించిన అగ్నిపర్వత విస్ఫోటనం. ఆ నేపథ్యంలో ఎప్పటిలాగే బీఆర్ఎస్, వివిధ ప్రజాసంఘాలు, ఉద్యమకారులు, అభిమానులు కేసీఆర్ దీక్ష చేపట్టిన 29న ‘దీక్షాదివస్’ను జరుపుకొన్నారు. నాటి ఉద్విగ్న సందర్భాన్ని స్వాగతించి గౌరవించాల్సిన కాంగ్రెస్ నేతలు మాత్రం కేసీఆర్ దీక్షను కించపరుస్తూ అవమానకరంగా మాట్లాడారు. అది వారి బుద్ధిమాంద్యానికి, భావదారిద్య్రానికి అద్దం పట్టింది. ఆ చరిత్ర నిప్పులాంటిది. చెదపురుగులు తాకలేవు.
జయశంకర్ సార్ ఎప్పుడూ చెబుతూ ఉండేవారు ‘తెలంగాణకు ప్రధాన శత్రువు కాంగ్రెస్’ అని. ఆరు దశాబ్దాల పాటు కాంగ్రెస్ తెలంగాణకు చేసిన అన్యాయాలకు తాను సజీవ సాక్షినని అంటూ ఉండేవారు. కేసీఆర్ నాయకత్వంలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అంతిమ విజయం సాధిస్తుందని ఆయన ప్రగాఢంగా విశ్వసించేవారు. ఆ నమ్మకం వమ్ముకాలేదు. కేసీఆర్ దీక్షకు తలవంచిన కేంద్రం తెలంగాణ ప్రకటించింది. దీక్ష విరమించాల్సిందిగా నాటి కేంద్ర హోంమంత్రి చిదంబరం ప్రభుత్వం తరఫున సాధికారికంగా విజ్ఞప్తి చేశారు. కేంద్రం ఆదేశాలతో కేసీఆర్ దీక్ష విరమింపజేయడానికి ప్రత్యేక విమానంలో నాటి ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య ఢిల్లీ నుంచి బయలుదేరారు.
ఆయన చేతులమీదుగా దీక్షను విరమించడం కేసీఆర్‌కు ఇష్టం లేదు. అందుకే గురుతుల్యులైన జయశంకర్ సార్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. టీఆర్ఎస్ పార్టీకి చెందిన అగ్రనేతలు సహా ఎమ్మార్పీఎస్ అధినేత మందకృష్ణ మాదిగ, ఉద్యోగ సంఘాల నేతలు స్వామి గౌడ్, శ్రీనివాస్ గౌడ్, జలవనరుల నిపుణులు ఆర్.విద్యాసాగర్‌రావు, కవులు, కళాకారులు, ఉద్యమకారులు అక్కడే ఉన్నారు. ఆరోజు ఉదయం నుంచి రాత్రి దీక్ష విరమించేంత వరకు నేనూ కేసీఆర్ వెన్నంటే ఉన్నాను.
‘అసలు అది దీక్ష కాదు, అంతా నటన’ అన్నారు. అట్లయితే మరి కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం దీక్ష విరమించాలని దేశం సాక్షిగా విజ్ఞప్తి చేశారెందుకు? దీక్ష జరుగుతున్నప్పుడే నాటి ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సహా మంత్రి సామంతులంతా ఉత్తిదే అని చెప్పలేకపోయారా? భయంతో వణికిపోయారెందుకు?
చరిత్రను మలుపు తిప్పిన ఆ దృశ్యాన్ని ప్రసార మాధ్యమాలలో కోట్లాదిమంది దేశ విదేశీయులు కండ్లారా చూశారు. తెలంగాణ సహా ప్రపంచవ్యాప్తంగా ఉద్యమకారులు, అభిమానులు సంబురాలు చేసుకున్నారు. దీక్ష కొనసాగిన సమయంలో ప్రాణాలర్పించిన కానిస్టేబుల్ కిష్టయ్య, శ్రీకాంతాచారి, భూక్య ప్రవీణ్ కుమార్, ఉగునూరి శ్రీకాంత్, టేకులపల్లి పరశురాం, పల్లెబోయిన రాజ్‌కుమార్ వంటి అమరులను తలచుకొని కేసీఆర్ కన్నీరుమున్నీరయ్యారు.
వాస్తవాలు ఇలా ఉంటే, నేటి కాంగ్రెస్ నేతలు బరితెగించి మాట్లాడారు. కేసీఆర్ దీక్షను ఉద్దేశించి వికృత వ్యాఖ్యానాలు చేశారు. ‘అసలు అది దీక్ష కాదు, అంతా నటన’ అన్నారు. అట్లయితే మరి కేంద్ర హోంమంత్రి హోదాలో చిదంబరం దీక్ష విరమించాలని దేశం సాక్షిగా విజ్ఞప్తి చేశారెందుకు? దీక్ష జరుగుతున్నప్పుడే నాటి ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ సహా మంత్రి సామంతులంతా ఉత్తిదే అని చెప్పలేకపోయారా? భయంతో వణికిపోయారెందుకు? కేసీఆర్‌కు జరగరానిదేదైనా జరిగితే విద్యార్థులు, ఉద్యమకారుల తిరుగుబాటుతో తెలంగాణ అగ్నిగుండం అవుతుందని నిఘావర్గాలు కేంద్రానికి సమాచారం ఇచ్చింది వాస్తవం కాదా? కేసీఆర్ ఆరోగ్యం విషమంగా ఉందని, దీక్ష విరమించకపోతే ప్రాణాపాయం పొంచి ఉందని నిమ్స్ వైద్యుల బృందం మీడియాకు వెల్లడించలేదా? అయినా ఎవరికి లేని చివరికి సోనియమ్మ, రాహుల్, ఖర్గేలకు లేని పనికిమాలిన అనుమానాలు, దిక్కుమాలిన ఆలోచనలు తెలంగాణ కాంగ్రెస్‌కే ఎందుకొస్తున్నట్టు? ఇంతకీ ఆ 11 రోజులు ఏం జరిగింది?
పోలీసు ఉద్యోగాల విషయంలో హైదరాబాద్‌ను ఫ్రీజోన్ చేస్తూ సుప్రీంకోర్ట్ ఆ ఏడాది అక్టోబర్ 9న తీర్పు ఇచ్చింది. దానిని వ్యతిరేకస్తూ సిద్దిపేటలో నవంబర్ 11న పెద్దఎత్తున ఉద్యోగ గర్జన జరిగింది. ఆ వేదికగా కేసీఆర్ ‘తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో’, ‘తెలంగాణ జైత్రయాత్ర లేదంటే కేసీఆర్ శవయాత్ర’ అంటూ పోరాట శంఖం పూరించారు. తెలంగాణ ఇస్తానన్న కాంగ్రెస్ కాలయాపనకు అప్పటికే ఆరేండ్లు పూర్తయ్యాయి. 2004, 2009 అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు గడిచిపోయాయి.
ఆ రెండుసార్లు రాష్ట్రంలో, కేంద్రంలో గద్దెనెక్కిన కాంగ్రెస్ పబ్బం గడుపుకొని ప్లేట్ ఫిరాయించింది. ఓపిక నశించిన కేసీఆర్.. పార్టీ శ్రేణులు, శ్రేయోభిలాషులు ఎంత వారిస్తున్నా వినకుండా రంగధాంపల్లిలో ఆమరణదీక్షకు నవంబర్ 29న కరీంనగర్ నుంచి బయలుదేరారు. పట్టణ పొలిమేరల్లోనే కేసీఆర్‌ను అరెస్టు చేసిన పోలీసులు వరంగల్‌కి, రాజమండ్రికి అంటూ లీకులు వదిలి మీడియా కన్నుగప్పి ఉద్యమం అంతగాలేని చోటంటూ ఖమ్మంకు తరలించారు. ఆ కాన్వాయ్‌ని దారిలో చూసిన పూర్వాశ్రమంలో పీడీఎస్‌యూలో పనిచేసిన ఒక విలేకరి ఖమ్మం న్యూ డెమోక్రసీ శ్రేణులకు ఉప్పందించారు.
గంటల్లోనే పెద్దఎత్తున న్యూ డెమోక్రసీ శ్రేణులు, ఉద్యమకారులు కేసీఆర్‌ను ఉంచిన జిల్లా జైలును, ప్రధాన ఆసుపత్రిని చుట్టుముట్టారు. ఏమీ లేదనుకున్న చోట ఉద్యమం భగ్గుమనడం పోలీసులను, ప్రభుత్వాన్ని నిరుత్తరులను చేసింది. 30న ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. హైకోర్టు న్యాయవాదులు విధులను బహిష్కరించారు. డిసెంబర్ 1న ఖమ్మంలో హైడ్రామా చోటుచేసుకుంది. మగతలో ఉన్న కేసీఆర్‌కు రంగు నీళ్లు ఇచ్చి దీక్ష విరమించినట్లు వీడియో క్లిప్పింగ్‌లను ఆగమేఘాల మీద చానళ్లకు పంపించారు. వెంట ఉన్న జయశంకర్ సార్ మీడియా ముందుకువచ్చి కేసీఆర్ దీక్షలోనే ఉన్నారంటూ సందేహ నివృత్తి చేశారు.
కేసీఆర్‌ను ఖమ్మంలోనే ఉంచుతామని డిసెంబర్ 2న ప్రభుత్వం తరఫున దూతగా వచ్చిన మంత్రి రామిరెడ్డి వెంకటరెడ్డి ప్రకటించారు. కానీ, మానవ హక్కుల సంఘం ఆదేశాలతో మూడవ తేదీన కేసీఆర్‌ను హైదరాబాద్‌లోని నిమ్స్‌కు తరలించారు. మరోవైపు 15 రోజులపాటు అన్ని కాలేజీలను మూసివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రమంతటా మూలమూలకు ఉద్యమం వ్యాపించి తీవ్రరూపం దాల్చింది.
నాలుగవ తేదీన లోక్‌సభ సభ్యులు మధుయాష్కి, పొన్నం ప్రభాకర్, మంద జగన్నాథం, గుత్తా సుఖేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, ఎస్.రాజయ్య తదితరులు నాటి ప్రధాని మన్మోహన్సింగ్ను కలిసి దీక్ష నేపథ్యంలో రాష్ట్రంలో సంభవించిన పరిణామాలను వివరించారు. ఐదవ తేదీ నాటికి హీట్ మరింత పెరిగింది. కేసీఆర్‌ను ఐసీయూలోకి మార్చారు. 48 గంటల బంద్ ప్రారంభమైంది. సీనియర్ సంపాదకులు పొత్తూరు వెంకటేశ్వరరావు, కె.రామచంద్రమూర్తి, ఐఐటీ రామయ్య, హరగోపాల్‌లు రోశయ్యను కలిసి కేసీఆర్ దీక్ష విరమింపజేయాలని కోరారు. రోశయ్య క్యాబినెట్ మంత్రులు సహా ప్రజారాజ్యం నేత చిరంజీవి తదితరులు కేసీఆర్‌ను పరామర్శించారు. ఆరవ తేదీన రోశయ్య రాత్రి 10 గంటల సమయంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దానం నాగేందర్, మర్రి శశిధర్‌రెడ్డి, షబ్బీర్ అలీతో కలిసి భద్రతా కారణాల దృష్ట్యా నిమ్స్ వెనక వైపు నుంచి వచ్చి కేసీఆర్‌ను పరామర్శించి దీక్ష విరమించాల్సిందిగా కోరారు.
తెలంగాణ ప్రకటిస్తే విరమిస్తానని తెగేసి చెప్పారు కేసీఆర్. అదే రోజు ఆంధ్ర యూనివర్సిటీలో ‘సమైక్యాంధ్ర ముద్దు తెలంగాణ వద్దు’ నినాదంతో ఉద్యమం ప్రారంభమైంది. ఏడవ తేదీన మూడు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్లమెంట్ ఉభయసభల నేతలు వెంకయ్య నాయుడు, సుష్మా స్వరాజ్ తెలంగాణకు మద్దతిస్తూ.. టీడీపీ అడ్డుకోవడం వల్లే వాజపేయి హయాంలో తెలంగాణ ఏర్పాటు చేయలేకపోయామని వెల్లడించారు. టీడీపీ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు, అనుముల రేవంత్ రెడ్డి వెంటరాగా కేసీఆర్‌ను చంద్రబాబు పరామర్శించారు. నాటి ముఖ్యమంత్రి రోశయ్య అఖిలపక్ష సమావేశంలో కాంగ్రెస్ అధిష్ఠానంపై భారం మోపగా, ఎంఐఎం మినహా మిగతా పక్షాలు తెలంగాణకు జై కొట్టాయి. ఆ వివరాలను చీఫ్ విప్ మల్లు భట్టి విక్రమార్క కేంద్రానికి నివేదించారు.
అటువైపు నిమ్స్‌లో కేసీఆర్ ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకినట్లు, దీక్ష విరమించకపోతే కష్టమేనని వైద్యులు ప్రకటించారు. ఎనిమిదవ తేదీన కేసీఆర్ ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. ‘ఏ క్షణంలో ఏమైనా జరగొచ్చు. మేం బాధ్యులం కాదు’ అంటూ నిమ్స్ డైరెక్టర్ డి.ప్రసాదరావు ప్రభుత్వాన్ని తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 9వ తేదీన తెలంగాణ అంశంపై ఢిల్లీలో కాంగ్రెస్ కోర్ కమిటీ ఐదుసార్లు సమావేశమైంది. తుదకు రాత్రి 11:30 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం తరఫున చిదంబరం తెలంగాణ ఏర్పాటు ప్రకటన చేశారు. కేసీఆర్ దీక్ష విరమించారు. ఇదీ జరిగిన సంగతి.
ఈ 11 రోజుల్లో కేసీఆర్‌ను ఉంచిన ఖమ్మం ప్రధాన ఆసుపత్రి, నిమ్స్ ఉద్యమకారులతో, ప్రముఖ నేతలతో కిటకిటలాడిపోయాయి. కేసీఆర్ ను పరామర్శించి దీక్ష విరమించాలని నాడు కోరి న అతిరథ మహారథుల్లో నేటి సీఎం రేవంత్ సహా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రులు జూపల్లి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు. అయినా పీసీసీ అధ్యక్షుడు సహా కాంగ్రెస్ నేతలు దీక్షా దివస్ సందర్భంగా కేసీఆర్ దీక్షను అభూత కల్పనలతో అవ మానించడం వారి దివాలాకోరు, దిగజారుడు రాజకీయానికి పరాకాష్ఠ. కాంగ్రెస్ ఎంత మొత్తుకున్నా కేసీఆర్ దీక్ష రాజకీయాల్లో పెను సంచలనం. ఒక చరిత్ర. ఆరు దశాబ్దాల ఉద్యమం, అమరుల బలిదానం అందించిన జయకేతనం.
– డాక్టర్ అయాచితం శ్రీధర్ 98498 93238