తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఆ అధ్యాయానికి కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం తన జీవితం మొత్తాన్ని అంకితం చేసిన నాయకుడు. దశాబ్దాల పాటు సాగిన ఆయన. నేతృత్వంలో తెలంగాణ నాయకత్వం ఒక దిశానిర్దేశక శక్తిగా నిలిచింది. అన్యాయాన్ని ప్రశ్నించే ధైర్యం, ప్రజల బాధను తన బాధగా మార్చుకునే ఆత్మీయత, లక్ష్యాన్ని సాధించే వరకూ వెనక్కి తగ్గని స్వభావం ఇవన్నీ తెలంగాణ ప్రజల కలను నిజం చేశాయి. ఉద్యమ కాలంలో ఎదురైన అవమానాలు, నిర్బంధాలు, రాజకీయ ఒత్తిళ్లు ఆయన సంకల్పాన్ని మరింత గట్టిపరిచాయి.
కేసీఆర్ నాయకత్వాన్ని అర్థం చేసుకోవాలంటే ఆయన రాజకీయ ప్రయాణాన్ని మాత్రమే కాదు, ఆయన ఆలోచనా విధానాన్ని కూడా గమనించాలి. ఆయన రాజకీయాలు అధికారానికి పరిమితం కాలేదు. అవి ఒక భావజాలానికి ప్రతిరూపం. తెలంగాణ అంటే కేవలం ఒక పరిపాలనా యూనిట్ కాదు. అది ప్రత్యేక చరిత్ర, సంస్కృతి, భాష, జీవన విధానం కలిగిన ప్రాంతం. రాష్ట్ర నిర్మాణంలో కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు దీర్ఘకాలిక ప్రభావం కలిగినవే. సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి, పరిశ్రమల స్థాపన, ఐటీ విస్తరణ తెలంగాణను ఆర్థికంగా నిలబెట్టాయి. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్ అందించడం ద్వారా వ్యవసాయాన్ని సంక్షోభం నుంచి బయటకు తీసుకువచ్చారు. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. సామాజిక రంగంలో కూడా కేసీఆర్ పాలన ప్రత్యేక ముద్ర వేసింది. బడుగు, బలహీన వర్గాలకు గౌరవం కల్పించేలా పథకాల రూపకల్పన చేశారు. పెన్షన్ల పెంపు, దళిత బంధు వంటి వినూత్న ఆలోచనలు సామాజిక సమానత్వంపై కేసీఆర్ నిబద్ధతను చూపిస్తాయి. విద్య, వైద్య రంగాల్లో తీసుకున్న చర్యలు, గురుకులాల విస్తరణతో పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించారు. కంటి వెలుగు, ఆరోగ్యశ్రీ విస్తరణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు నిదర్శనం.
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా కేసీఆర్ నాయకత్వం ఉద్యమ స్పూర్తినే కొనసాగించింది. రైతుబంధు, రైతు బీమా పథకాలు రైతుకు ఆర్థిక భద్రత కల్పించడమే కాకుండా, రైతేరాజు అనే భావనకు ప్రాణం పోశాయి. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి తాగునీటిని అందించి, నీరు ఒక మానవ హక్కు అని నిరూపించారు. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించి, సాగును బాగు చేశారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పెన్షన్లు వంటి సంక్షేమ పథకాలు సమాజంలోని అట్టడుగు వర్గాల జీవితాల్లో గౌరవాన్ని నింపాయి. ఈ పథకాలు కేవలం సంక్షేమమే కాదు, సామాజిక న్యాయానికి ప్రతీకలు. రాష్ట్ర హక్కుల విషయంలో రాజీపడకుండా, తెలంగాణకు రావాల్సిన వాటి కోసం నిలబడిన నాయకత్వం ఆయనది. అధికారానికి లొంగని స్వభావం, ప్రజల తరఫున పోరాడే తత్వం కేసీఆర్‌ది. రాష్ట్ర సాధన నుంచి రాష్ట్ర నిర్మాణం వరకు, ఉద్యమం నుంచి అభివృద్ధి వరకు ప్రతి దశలోనూ కేసీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తుంది. తెలంగాణ చరిత్రలో ఆయన పేరు ఒక వ్యక్తిగా కాదు, ఒక యుగంగా నిలిచిపోతుంది. అందుకే కేసీఆర్ నాయకత్వం ఒక రాజకీయ పదవికి మాత్రమే పరిమితం కాలేదు. అది ఒక కాలాన్ని, ఒక చైతన్యాన్ని, ఒక ఉద్యమాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ భూమిపై తెలంగాణ ఉన్నంతకాలం కేసీఆర్ పేరు చరిత్రలో ఉంటుంది.