తెలంగాణలో గత పదేండ్ల కాలంలో జరిగిన విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు, కొత్త థర్మల్ విద్యుత్తు కేంద్రాల నిర్మాణంపై విచారణ జరిపేందుకు గత మార్చి 14న రాష్ట్ర ప్రభుత్వం విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి నేతృత్వంలో ఏకసభ్య విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. అయితే, ఈ కమిషన్ విచారణ తీరును వ్యతిరేకిస్తూ మాజీ సీఎం కేసీఆర్ 12 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు. ఈ లేఖపై కాంగ్రెస్ నాయకులు భట్టి విక్రమార్క, నిరంజన్ తదితరులు అంతెత్తున లేచారు. ఈ విషయంపై హైకోర్టు జోక్యం చేసుకోవాలని, కోర్టు ధిక్కారం కింద పరిగణించాలని నానా హడావుడి చేశారు. దీంతో రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ ఏమిటి? అసలు అది న్యాయ విచారణ కమిషనా? లేక కేవలం విచారణ సంఘమా? దాని పరిమితులు ఏమిటి? కోర్టు ధిక్కారమనే ప్రస్తావన ఇందులో ఎందుకు వచ్చింది? అనే పలు ప్రశ్నలు సామాన్యుల నుంచి మేధావుల వరకూ అందరినీ తొలిచివేస్తున్నాయి. దీనిపై లోతుల్లోకి వెళ్తే.. రేవంత్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది విచారణ సంఘం మాత్రమేనని, న్యాయ విచారణ కమిషన్ కాదని అర్థమవుతున్నది. దేశంలోని పలు హైకోర్టులు, సుప్రీంకోర్టు జడ్జిలు, న్యాయస్థానాల తీర్పులు ఈ విషయాన్ని సుస్పష్టం చేస్తున్నాయి కూడా.
కేసీఆర్ హయంలో జరిగిన పనులకు సంబంధించి అటు విద్యుత్తు కొనుగోళ్ల మీద జస్టిస్ నర్సింహారెడ్డి విచారణ కమిషన్‌ను, ఇటు కాళేశ్వరం మీద జస్టిస్ ఘోష్ విచారణ కమిషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే, అంతకు ముందే విద్యుత్తు కొనుగోళ్లు, కాళేశ్వరం ప్రాజెక్టుపై సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటు చేస్తామంటూ రేవంత్ సర్కారు పేర్కొంది. ఇదే విషయమై హైకోర్టును ఆశ్రయించింది. అయితే, సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం.. సిట్టింగ్ జడ్జిని ఇవ్వడం కుదరదని ఉన్నత న్యాయస్థానం తేల్చిచెప్పింది. దీంతో చేసేదేమీలేక.. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్-1952 ప్రకారం.. రేవంత్ సర్కారు రిటైర్డ్ జడ్జిలతో విచారణ సంఘాలను ఏర్పాటు చేయవలసి వచ్చింది.
సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో న్యాయ విచారణ కమిషన్ ఏర్పాటుకు సంబంధించి టీ ఫెన్ వాల్తేర్ అండ్ అదర్స్ వర్సెస్ కేంద్రప్రభుత్వం అండ్ అదర్స్ కేసులో సుప్రీంకోర్టు గతంలోనే స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్-1952 ప్రకారం.. న్యాయ విచారణ కమిషన్‌కు సిట్టింగ్ జడ్జి నేతృత్వం వహించవచ్చు. అయితే ఈ నియామకంతో ఇతర న్యాయపరమైన (కోర్టు) పనులకు ఎలాంటి ఆటంకాలు జరుగకూడదని సుప్రీం వెల్లడించింది. అలాగే, కోర్టు కేసులు పెండింగ్‌లో ఉండకూడదు. విచారణ సమయంలో సిట్టింగ్ జడ్జి పదవికి గౌరవభంగం కలుగకూడదు. న్యాయవ్యవస్థ స్వతంత్రతను కాపాడేలా విచారణ ఉండాలి. ముఖ్యంగా జాతి ప్రయోజనాలకు, తీవ్రమైన అంశాలకు సంబంధించిన కేసుల విషయంలోనే న్యాయ విచారణ కమిషన్ల ఏర్పాటు జరగాలంటూ సుప్రీంకోర్టు పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. ఒకవిధంగా విచారణ కమిషన్లకు సిట్టింగ్ జడ్జిలను ఇవ్వడం కుదరదంటూ పరోక్షంగా ధర్మాసనం తేల్చిచెప్పింది. దీంతో తర్వాతి కాలాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు రిటైర్డ్ న్యాయమూర్తులతో విచారణ కమిటీలను ఏర్పాటు చేయడం మొదలుపెట్టాయి. అలా అనేక విచారణ కమిటీలు ఏర్పాటయ్యాయి.
కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్-1952 ప్రకారం ఏర్పాటైన కమిటీకి పదవీ విరమణ చేసిన న్యాయమూర్తిని నియమిస్తే అది న్యాయ విచారణ అనుకొంటే పొరపాటే. న్యాయ విచారణ కమిషన్‌కు, విచారణ సంఘానికి చాలా తేడాలు ఉన్నాయి. కమిషన్ ఆఫ్ ఎంక్వయిరీస్ యాక్ట్-1952 ప్రకారం ఏర్పాటైన ప్రతీ కమిషన్ న్యాయ విచారణ కమిషన్ కాదు. సాధారణ విచారణ సంఘం కూడా కావొచ్చు.
1958లో శ్రీరామకృష్ణ ధాల్మియా వర్సెస్ జస్టిస్ ఎస్ఆర్ టెండూల్కర్, కేంద్ర ప్రభుత్వం కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాలి. విచారణ సంఘాన్ని.. న్యాయ విచారణ కమిషన్‌గా పరిగణించలేమని కోర్టు ఆ సందర్భంగా తేల్చిచెప్పింది. కమిషన్‌ను ఏర్పాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉన్నప్పటికీ.. ఆ కమిషన్‌కు న్యాయపరమైన అధికారాలు ఉండబోవని గుర్తు చేసింది. కమిటీ విచారణ తీరుపై న్యాయ సమీక్ష చేసే అధికారం ఉంటుందని తెలిపింది. అలాగే, సివిల్ లేదా క్రిమినల్ కేసులకు సంబంధించి భవిష్యత్తులో ఏదైనా విచారణకు సాక్ష్యంగా ఈ కమిటీ నివేదికను పరిగణించడానికి వీల్లేదని గుర్తు చేసింది. పరిహారం చెల్లించాలని, జరిమానా విధించాలని లేదా ఫలానా శిక్ష విధించాలనే పరిధి ఈ కమిటీకి ఉండబోదని.. ఆ అధికారం పూర్తిగా కోర్టులదేనని తెలిపింది. న్యాయస్థానం ముందు విచారణ కమిటీ అసలు ప్రత్యామ్నాయం కానేకాదని తేల్చిచెప్పింది. ప్రభుత్వం లేదా చట్టసభల అభీష్టం మేరకు ఏర్పాటైన కమిషన్ ఇచ్చే నివేదిక కోర్టు తీర్పు కాబోదు. ఒక వేళ దానిని తీర్పుగా భావిస్తే, హైకోర్టు, సుప్రీంకోర్టుల పాత్రలను ప్రభుత్వం, చట్టసభలే పోషించినట్లు అవుతుంది. న్యాయ ప్రక్రియలో శాసన వ్యవస్థ పూర్తిగా చొరబడినట్లు అవుతుంది. కమిషన్ నియామక అధికారం ద్వారా ప్రభుత్వం తమకు లేని న్యాయపరమైన అధికారాలను కల్పించుకుందనే వాదన కూడా ఉంది. కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడమంటే న్యాయ విచారణాధికారాలను చేపట్టినట్టు కాదని, దాని అధికారం శాసన, పరిపాలనా వ్యవహారాలకే పరిమితమని చెప్పడం జరిగింది. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన కమిషన్ కూడా ఇలాంటిదే. అలాంటి కమిషన్ విచారణ తీరును వ్యతిరేకించడం కోర్టు ధిక్కారంగా కాంగ్రెస్ నేతలు అభివర్ణించడం సమంజసంగా లేదు.
విచారణ సంఘాన్ని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తాయి. ఈ కమిటీకి హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డు న్యాయమూర్తి నేతృత్వం వహిస్తారు. రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వం వహించడంతో ఇది న్యాయ విచారణ కమిషన్ అనుకోవడానికి వీలులేదు. ఎందుకంటే, ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు న్యాయ విచారణ కమిషన్లు కాబోవని, అవి న్యాయపరమైన ప్రక్రియను పూర్తి చేయబోవని 66 ఏండ్ల కిందటే దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు విస్తృత ధర్మాసనం తీర్పు చెప్పింది. ఇలాంటి కమిటీలు ఇచ్చే నివేదికలకు లీగల్‌గా బైండింగ్ ఉండబోదు. ఈ కమిటీలు తీర్పులు ఇవ్వలేవు. ప్రభుత్వానికి సిఫారసులు మాత్రమే చేయగలవు. ఆ సిఫారసులను ప్రభుత్వం పరిగణించవచ్చు, లేదా పక్కన పెట్టవచ్చు కూడా. నివేదికలోని అంశాలను భవిష్యత్తులో సాక్ష్యాలుగా కూడా పరిగణించడానికి వీలులేదు. ఎలాంటి శిక్షలను సూచించే పరిధి ఈ కమిటీలకు ఉండదు. స్వాతంత్య్రానంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన ఇలాంటి కమిటీలు ఇచ్చిన నివేదికలను తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలు బుట్టదాఖలు చేసిన ఘటనలు కోకొల్లలు. ఇక, ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలపై అభ్యంతరాలు ఉంటే కోర్టులకు వెళ్లే వీలు కూడా ఉన్నది.
హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు ఏదైనా అంశంపై విచారణ చేసేందుకు న్యాయ విచారణ కమిషన్‌ను ఏర్పాటు చేస్తే, ఆ కమిషన్‌కు ఆయా కోర్టుల అధికారాలు కూడా ఉంటాయి. సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో ఈ కమిషన్లు ఏర్పాటవుతాయి. న్యాయ విచారణ కమిషన్ విచారణ పూర్తిగా కోర్టుల మాదిరిగానే ఉంటుంది. తమ ముందుకొచ్చిన కేసులోని వాదప్రతివాదులకు నోటీసులు జారీ చేయడం, ఇరుపక్షాల వాదనలు వినడం, క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించడం.. ఇవన్నీ చేశాకే నివేదిక తుదిరూపునకు వస్తుంది. న్యాయ కమిషన్ ఇచ్చే నివేదికపై ఆయా కోర్టులకు వాదప్రతివాదులు, సాక్షులు, కక్షిదారులు జవాబుదారీగా ఉండాలి. న్యాయ విచారణ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆయా కోర్టులు ఆమోదిస్తే.. ఆ కోర్టు తీర్పు వెలువరించినట్లే అవుతుంది. న్యాయ విచారణ కమిషన్ ఇచ్చే నివేదికకు లీగల్ బైండింగ్ ఉంటుంది. నివేదికలోని అంశాలు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చే తీర్పుతో సమానం. కమిషన్ ఇచ్చే నివేదికలను కోర్టులు ప్రామాణికంగా తీసుకుంటాయి. భవిష్యత్తులో సాక్ష్యాలుగానూ పరిగణిస్తారు. శిక్షలను సూచించే అధికార పరిధి కూడా ఈ కమిషన్లకు ఉంటుంది.
పై విషయాలన్నింటినీ క్షుణ్ణంగా విశ్లేషిస్తే.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన ఈ కమిటీలు న్యాయ విచారణ కమిషన్లు కావనేది స్పష్టమవుతున్నది. ఇవి కేవలం విచారణ సంఘాలే. వీటికి ఎటువంటి లీగాలిటీ అనేది లేదు. రిటైర్డ్ న్యాయమూర్తుల నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిటీలు సాక్షుల వాంగ్మూలాలను రికార్డు చేస్తాయే తప్ప.. ఏది న్యాయమో? ఏది అన్యాయమో? విచారణ చేసి తీర్పులు చెప్పే అధికారం వీటికి ఉండదు. ఇలాంటి కమిటీలు ఇచ్చే నివేదికను రాజ్యాంగ ధర్మాసనం (హైకోర్టులు లేదా సుప్రీంకోర్టు) ఇచ్చే తీర్పుతో సమానంగా చూడలేం. అలాగే, తాము సూచించే సిఫారసులను అమలు చేయాలని ప్రభుత్వాన్ని ఈ కమిటీలు కనీసం ఆదేశించనూలేవు. మరి, కోర్టులు గతంలో న్యాయ విచారణ కమిషన్లను ఏర్పాటు చేయలేదా? అంటే.. చేశాయి కూడా. అయితే, నేరారోపణలు తీవ్రమైన ఘటనల్లో మాత్రమే సాధారణంగా న్యాయ విచారణ కమిషన్లను కోర్టులు ఏర్పాటు చేస్తాయి. ఉదాహరణకు.. 1985 జూలై 17న కారంచేడులో జరిగిన మారణకాండ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన కమిషన్.. జ్యుడీషియల్ ఎంక్వెయిరీ కమిషనే. ఈ కమిషన్ నివేదికను ఆధారంగా చేసుకొనే సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువరించింది. న్యాయ విచారణ కమిషన్ల నివేదికలకు కోర్టుల్లో విలువ ఉంటుంది. ఒకవిధంగా ఆ నివేదికలు కోర్టు తీర్పుల్లాంటివే.
అయితే, ఇవేమీ పట్టించుకోని రేవంత్ సర్కారు ఇప్పుడు విచారణ సంఘాన్ని ఏర్పాటు చేసింది. అంటే ఇది ఒక విధంగా సివిల్ కోర్టు తీర్పుపై (ఎస్ఈఆర్సీ ఆమోదించిన నిర్ణయంపై) సర్కారు విచారణకు ఆదేశించడమే అవుతుంది. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా విధులు నిర్వహించిన జస్టిస్ నర్సింహారెడ్డికి ఈ విషయాలు తెలియదనుకోవడానికి లేదు. ఆయనైనా ఈ విషయాన్ని ప్రభుత్వ పెద్దలకు తెలియజేస్తే బాగుండేది. అయితే, అలా జరగలేదు. అంతేకాదు.. విచారణ పూర్తికాకుండానే మీడియా సమావేశం నిర్వహించడం కూడా నిబంధనల ఉల్లంఘన కిందికే వస్తుందని నిపుణులు అంటున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుంటే జస్టిస్ నర్సింహారెడ్డి కమిటీ.. కేసీఆర్ పాలనలోని గత సర్కారుపై దురుద్దేశపూర్వకంగా వ్యవహరిస్తున్నదని స్పష్టమవుతున్నది.
– ఎడిటోరియల్ డెస్క్