పీవీ ప్రధానిగా బాధ్యతలు నిర్వహిస్తునప్పుడు ‘మీరు ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఎలా ఆలోచిస్తారు’ అని ఒక విలేకరి ప్రశ్నించగా ‘నేను ఏదైనా నిర్ణయం తీసుకునేముందు కాళోజీ స్పందన ఏ రకంగా ఉంటుందోనని కొద్దిసేపు మననం చేసుకుంటాను’ అని బదులిచ్చారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి ప్రభుత్వాధినేతగా కూర్చున్న పీవీ పక్కా కాంగ్రెస్ వ్యక్తి. అయినా, పీవీపై ఉన్న ప్రభావం అది. ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ అంతటి చైతన్యవంతమైన సమాజం బహు శా భారతదేశంలోనే లేదు. అందుకే, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం మొదలు కమ్యూనిస్టు, విప్లవ, ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమాల్లో తెలంగాణ ప్రజల సాహిత్య, సాంస్కృతిక పరిణతి, అదే సమయంలో ఉదారవాద, మానవీయ, ప్రజాస్వామిక లక్షణాలు కనబడుతాయి. తెలంగాణ తొలి దశ ఉద్యమంలో జరిగిన పొరపాట్లను ఆత్మవిమర్శ చేసుకున్న సమాజం, మలిదశ ఉద్యమంలో మరింత పరిణతిని ప్రదర్శించడమే కాకుండా, తన మిలిటెంట్ స్వభావాన్ని రాజ్యాంగ పరిధిలోనే కొనసాగించింది. అందుకే, ఉద్యమ సమయంలో భాషాపరంగా నినాదాలు, పాటలు ఆంధ్రా ప్రజల నాలుకలపై కూడా నాట్యమాడాయి.
తెలంగాణ ఏర్పాటు అనివార్యతను సృష్టించడంలో కేసీఆర్, జేఏసీ, యావత్ తెలంగాణ సమాజం విజయవంతమైంది. కాబట్టే తెలంగాణ స్వప్నం సాకారమైంది. దక్కన్ పీఠభూమి, బంగారు తునక తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ అనంతరం సహజంగానే తనకున్న భౌగోళిక అనుకూలతలను అందిపుచ్చుకొని సమర్థవంతమైన నాయకత్వంలో శరవేగంగా అభివృద్ధి దిశగా పయనించింది. అభివృద్ధి, సంక్షేమాలను సమన్వయ పరచుకొని సాగు, తాగు నీరు, కరెంటు, రోడ్లు, ఐటీ, పారిశ్రామిక తదితర రంగాలన్నింటిలోనూ ఆశించినంత మేర ప్రజ లు సంతృప్తి చెందేటట్లుగా పునర్నిర్మాణం చేసుకున్నది. ఉద్యమ సమయంలో ప్రజలను ఉత్తేజపరచడానికి ప్రజలకు చేరేవిధంగా ప్రసంగాలు, మాటలు, పాటలు గ్రామీణ జీవన శైలిని, యాసను పల్లె పదాలను సంతరించుకున్నయి తప్ప బూతును దరి చేరనీయలేదు.
ఆంధ్ర నాయకత్వం తెలంగాణ ఉద్యమాన్ని నీరుగార్చడానికి, కేసీఆర్ వ్యక్తిగత జీవితాన్ని బహిరంగంగా దిగజార్చడానికి కుయుక్తులతో, కృత్రిమ కవిత్వంతో, అసంబద్ధ కల్పనలతో, అవాస్తవ కథనాలతో ప్రయత్నం చేసినా కేసీఆర్ లక్ష్యపెట్టలేదు. అంతేకాదు, వాళ్లు ప్రవర్తించిన విధంగా ఆంధ్ర నాయకుల వ్యక్తిగత జీవితాల్లోకి తొంగిచూడలేదు. ఉమ్మడి ఏపీ కాలంలోనూ, తెలంగాణ ఆవిర్భవించిన అనంతరం సుమారు దశాబ్ద కాలం పాటు తెలంగాణలో ఏపీ రాష్ట్రం విడిపోయిన ఐదేండ్ల వరకు ఆయా రాష్ర్టాలలో రాజకీయ పరిస్థితులు కొంతవరకు హుందాగా ఉండేవి. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల మధ్య పరస్పర నిందారోపణలు వ్యక్తిగత స్థాయికి దిగజారి కుటుంబంలోని మహిళల వరకు వెళ్లడం జుగుప్సాకర సంఘటనలుగా చెప్పవచ్చు. ఒక దశలో కొంతమంది రాజకీయ నాయకుల మాటల్లోని బూతులు మూడో తరగతి సినిమాల స్థాయి కంటే దిగజారాయి.
హైదరాబాద్ ఏకైక ముఖ్యమంత్రిగా సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి, వాగ్వైభవ సంపన్నులు స్వర్గీయ బూర్గుల రామకృష్ణారావు అసెంబ్లీలో చూపించిన వ్యవహారదక్షత నేటి తరానికి పాఠ్యాంశాల వంటివి. అవసరమైనప్పుడు సభలో ఆయన ప్రత్యర్థులను తన సునిశితమైన మాటలతో చీల్చి చెండాడేవారు కానీ, ఆ ప్రయత్నంలో ఎదుటివారు ఆవగింజంతైనా నొచ్చుకునేవారు కాదు. కారణం తన ప్రసంగంలో వ్యవహార సంబంధమైన వ్యాఖ్యలే కానీ, వ్యక్తిగత విషయాలను స్పృశించని హుందాతనం వారిది.
దురదృష్టవశాత్తు గత రెండున్నరేండ్ల కాలం నుంచి తెలంగాణలో రాజకీయ విలువలు క్షీణించాయి. పరస్పర వ్యక్తిగత దూషణలతో హుందాతనం కోల్పోతున్న వైనం ప్రజలను అసహనానికి గురిచేస్తున్నది. పార్టీ వేదికల మీదనే కాకుండా దిగజారిన భాషా ప్రయోగం సర్వవ్యాపితమై కూర్చున్నది. పాలకులు.. ప్రతిపక్షాలు, ప్రజల నుంచి వచ్చే విమర్శలకు సంయమనంతో స్పందించాలి. వ్యక్తిగత దాడులు చేయకుండా, సైద్ధాంతికపరమైన చర్చలు ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్మాణాత్మకంగా సాగాలి. అసెంబ్లీలో అధికార, ప్రతిపక్ష నాయకులు ఆవేశపూరిత, నిందాపూర్వక ఉపన్యాసాలకంటే వాస్తవిక దృష్టితో ఈ ప్రజా సమస్యలను విశ్లేషించి, పరిష్కార మార్గాలను సూచించే విధంగా మాట్లాడాలి. అటువంటివారినే సమర్థవంతమైన నాయకులుగా, పరిపాలనాదక్షులుగా, ప్రజాప్రతినిధులుగా తెలంగాణ సమాజం చిరస్థాయిగా
గుర్తుంచుకుంటుంది.
తెలుగు, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, మరాఠీ, పర్షి యా, సంస్కృతం వంటి భాషల్లో ప్రావీణ్యం ఉన్న బూర్గుల, పీవీలతో పాటు జలగం వెంగళరావు, తరిమెల నాగిరెడ్డి, ఓంకార్, ఈశ్వరీబాయి, సూదిని జైపాల్ రెడ్డి, అయ్యదేవర కాళేశ్వరరావు, రోశయ్య లాంటివారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఇటువంటి వక్తలతో కూడిన అసెంబ్లీలో సమావేశాలు, ప్రసంగాలు జ్ఞానబోధనలుగా సాగేవి. హాస్యోక్తులతో, పరస్పర వ్యంగ్యోక్తులతో ప్రజా సమస్యల మీద అర్థవంతమైన చర్చలు జరిగేవి. కాగా, దురదృష్టవశాత్తు ప్రస్తుతం అధికారపక్ష నాయకులు రాష్ట్ర ప్రభుత్వాధినేత తరచుగా ప్రయోగిస్తున్న భాష ఆక్షేపణీయమని సర్వత్రా చర్చించుకుంటున్నారు.
ప్రతిపక్షాలు నిగ్రహం కోల్పోయి, నిస్పృహతో అప్పుడప్పుడు సంయమన రేఖను దాటినప్పటికీ ప్రభుత్వం, ప్రభుత్వాధినేతలు బాధ్యతగా వ్యవహరిస్తేనే ప్రజలు హర్షిస్తారు. ఎన్నికల సమయంలో, కార్యకర్తల్లో జోష్ నింపడానికి కొన్ని మాటలు తూలినప్పటికీ ప్రజలు పట్టించుకోకపోవచ్చు, కానీ, ఎన్నికలు పూర్తయి అధికారపీఠం ఎక్కి ఏడాదిన్నర దాటిన తర్వాత కూడా భాష మెరుగుపడకపోవడం గర్హణీ యం. భాషా ప్రయోగం లాగులు, తొండలు, పేగులు, తోడ్కలు మీదుగా నడిబజారులో బట్టలిప్పడం వరకు రావడం అవాంఛనీయం మాత్రమే కాదు, ఆత్మవిమర్శ చేసుకోవలసిన సందర్భం. ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని సాటి రాజకీయ నాయకులపై స్వీయ నియంత్రణ పాటిస్తూ హుందాగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉన్నది. లేనిపక్షంలో భవిష్యత్తు తరాల దృష్టిలో దోషులుగా మిగిలిపోవడమే కాకుండా, చైతన్యవంతులైన తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుంది.
అసెంబ్లీ.. కృష్ణదేవరాయల భువన విజయం, కుతుబ్షాహీల అజరామరంల వలె కాకపోయినా, బసవపురాణం నుంచి మహాప్రస్థానం వరకు, క్యాపిటలిజం నుంచి సోషలిజం వరకు చదువుకున్న గతకాలపు పార్లమెంటేరీయన్ల వారసత్వాన్ని కొనసాగించాలని తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నారు.
– తుల్జారాం సింగ్ ఠాకూర్ 78930 05313