మహాత్మా గాంధీ, జయప్రకాశ్ నారాయణ్ తరహాలో శాంతియుతంగా తెలంగాణ మహోద్యమాన్ని నిర్వహించి విజయం సాధించిన యుగ పురుషుడు కేసీఆర్. ఉద్యమాన్ని ప్రజల హృదయాల్లోకి తీసుకెళ్లి, వారందరినీ కదిలించ గలిగిన అలాంటి మహా నాయకుడు ఇటీవల కాలంలో ఆయన తప్ప మరొకరు కనిపించరు. తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఆయనను ప్రజలు ఒక తండ్రిలాగా, ఒక సోదరుడిలాగా ఆరాధిస్తున్నారు. నేటి కాలంలో ఇంతటి గౌరవాభిమానాలు దక్కిన రాజకీయ నేత మరెక్కడా కనిపించరు.
కేసీఆర్ వంటి మహానేత ముందు గాలివాటున రాజకీయాల్లోకి వచ్చి, మిడి మిడి జ్ఞానంతో మిడిసి పడుతున్న కొందరు నాయకులను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. తమ స్థాయిని తెలుసుకోకుండా నోటి దురుసుతనంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడే చిల్లర నాయకులను ప్రజలు తరిమికొట్టే రోజు దగ్గరకొచ్చింది. కేసీఆర్ ఏ అంశంపైనైనా అనర్గళంగా మాట్లాడి అందరినీ మెప్పించగలరు. ప్రతిపక్షాల నిరాధార ఆరోపణలు సమర్థంగా తిప్పి కొట్టగలరు. ఆయన గొప్ప పరిపాలనా దక్షుడు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తంగా ఉండేది. కానీ కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిపాలనను గాడిలో పెట్టారు. అభివృద్ధికి దారులు వేశారు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి తనకు సాటి రారని నిరూపించుకున్నారు. ఒకనాడు పెద్ద గా గుర్తింపుకు నోచుకోని తెలంగాణ ఈనాడు దేశంలోని అగ్రగామి రాష్ర్టాలలో ఒకటిగా ఎదగడానికి కారణం కేసీఆర్ తీసుకొచ్చిన సంస్కరణలే కారణం.
కేసీఆర్ ముఖ్యమంత్రిగా పాలనా పగ్గాలు చేపట్టిన వెంటనే అనేక విభాగాల్లో సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేయడానికి రాష్ర్టాన్ని 33 జిల్లాలుగా విభజించారు. 43గా ఉన్న రెవెన్యూ డివిజన్లను 74 చేశారు. మండలాల సంఖ్యను 459 నుంచి 594 పెంచారు. గిరిజన గూడేలు, తండాలకు గ్రామ పంచాయితీలుగా మార్చారు. గ్రామ పంచాయతీలను 8690 నుంచి 12769కి పెంచా రు. చేనేత కారులకు అనేక రాయితీలు ఇస్తున్నారు. గ్రామీణులు, పట్టణ ప్రజల ఆదాయ వనరులను పెంచడానికి ‘పల్లె ప్రగతి’, ’పట్టణ ప్రగతి’ పథకాలను ప్రారంభించారు. రైతు బంధు పథకం ప్రవేశపెట్టి, వ్యవసాయ ఖర్చుల కోసం ప్రతి రైతుకు సంవత్సరానికి రూ.10 వేల సాయం అందిస్తున్నారు. దళిత బంధు పథకం ద్వారా ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందించి వారు స్వయం ఉపాధి పొందేందుకు చేయూత అందిస్తున్నారు. 2020 అక్టోబర్లో ధరణి పోర్టల్ ప్రారంభించి ఆస్తుల రిజిస్ట్రేషన్ల విధానాన్ని ఆన్ లైన్ చేసి వివిధ రకాల సేవలను సులభతరం చేశారు. మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు పెంపొందిస్తున్నారు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టి విద్యార్థుల భవితకు బాటలు వేస్తున్నారు. కొత్తగా వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలు, కళాశాలు ఏర్పాటు చేశారు. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను భర్తీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రజలందరికీ ఏటా ఉచిత వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచారు.
తెలంగాణ రాష్ట్రం ఏమి చేస్తున్నదో, దేశం అదే ఆచరిస్తున్నది. తెలంగాణ పథకాలను కేంద్రం, వివిధ రాష్ర్టాలు వేరు వేరు పేర్లతో అమలు చేస్తుండటమే ఇందుకు నిదర్శనం. పంజాబ్, ఉత్తర్ ప్రదేశ్, కేరళ, పశ్చిమ బెంగాల్ మొదలైన రాష్ర్టాల రైతు నాయకులు కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పరిశీలించి, దేశానికి ఆయన నాయకత్వం వహించాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. మరో వైపు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బీజేపీ పాలనలో దేశం అధోగతి పాలవుతున్నది. ధరాభారంతో పేదల బతుకులు దుర్భరమయ్యాయి. స్కూళ్లు, కాలేజీల ఫీజులు పెరిగాయి. కేవలం 8 ఏండ్లలోనే కేసీఆర్ తెలంగాణను అగ్రగామి రాష్ట్రంగా తీర్చిదిద్దితే, మోదీ నాయకత్వంలో దేశం యాభై సంవత్సరాల వెనుకకు పోయింది. ఈ నేపథ్యంలో కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాలని ఈనాడు దేశమంతా ఎదురుచూస్తున్నది.
ఈ నేపథ్యంలో జరుగుతున్న మునుగోడు ఉప ఎన్నిక రామాయణంలో పిడకల వేట లాంటి చిన్న ఘట్టం. మహా నాయకుడైన కేసీఆర్ వ్యక్తిత్వానికి దేశా ప్రజలు ఫిదా అవుతూ, భారత్ రాష్ట్ర సమితి దేశమంతటా విస్తరించాలని కోరుకుంటూ ఉంటే, ప్రతి పక్షాల్లోని గల్లీ నాయకులు హంగామా చేస్తున్నారు. జాతి, కుల, మత వివక్ష లేకుండా ఈనాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్నది. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, 24 గంటల ఉచిత కరెంటు ద్వారా వ్యవసాయాభివృద్ధికి అండగా నిలుస్తున్నది. మునుగోడు నియోజక వర్గంలో అర్హులైన వారందరికీ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అందుతున్నాయి. కానీ మునుగోడు ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేసిన రాజగోపాల్ రెడ్డి తన పదవీ కాలంలో నియోజక వర్గానికి చేసింది శూన్యం. పైగా ఉప ఎన్నిక తెచ్చి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని వృథా చేయిస్తున్నారు. ఈ విషయం మునుగోడు నియోజకవర్గ ప్రజలకు కూడా బాగా తెలుసు.
నియోజకవర్గంలోని ప్రతి వ్యక్తి ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల లబ్ధి పొందుతున్నవారే. ఈ నేపథ్యంలో వారు టీఆర్ఎస్వైపే మొగ్గు చూపుతున్నారు. మునుగోడు ప్రజలు చాలా తెలివైన వారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి వారి రక్తంలోనే ఉన్నది. అలాంటి మునుగోడు ప్రజలు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లాంటి వారి తొండి మాటలకు ఏనాటికీ మోసపోరు. ఈ ఉప ఎన్నిక తరువాత మునుగోడు నియోజకవర్గంలో నూతన వెలుగులు విస్తరించబోతున్నాయి.
(వ్యాసకర్త: చైర్మన్, తెలంగాణ రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)
కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. పోలీస్ శాఖను ఆధునీకరించి, స్కాట్లాండ్ యార్డ్ తరహాలో తీర్చిదిద్దారు. అత్యాధునిక పోలీస్ వ్యవస్థ నిర్మాణం కోసం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు చేశారు. కొత్తగా ఏడు పోలీస్ కమీషనరేట్లను ఏర్పాటు చేశారు. పోలీసులకు అధునాతన ఆయుధాలు, వాహనాలు సమకూర్చారు.
కోలేటి దామోదర్