తెలంగాణ స్వేచ్ఛా స్వాతంత్య్రాల కోసం పుట్టిన పార్టీ బీఆర్ఎస్. ఆ లక్ష్యానికి అనుగుణంగా కేసీఆర్ నాయకత్వంలో పద్నాలుగేండ్ల పాటు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకున్నాం. గెలుపోటములు రాజకీయాల్లో సహజమే అయినా, ‘తెలంగాణ ఫస్ట్’ అనే మాటను శాశ్వతం చేయడమే కేసీఆర్ లక్ష్యం. ఈ లక్ష్యంతోనే టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారి, కొత్త దిశలో పయనిస్తున్నది.
గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి చవిచూసినప్పటికీ, ఆ ఓటమి పార్టీ బలహీనత వల్ల కాదు. కొన్ని రాజకీయ సమీకరణాలు, ప్రజల్లోకి వెళ్లని నిజాలు, కొన్ని వ్యూహాత్మక లోపాల కారణంగానే బీఆర్ఎస్ తాత్కాలికంగా అధికారం కోల్పోయింది కానీ, శాశ్వతంగా కాదనే మాటను గుర్తుంచుకోవాలి. గెలిస్తే తలెత్తుకొని, ఓడిపోతే తలదించుకునే పార్టీ బీఆర్ఎస్ కాదు. దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు వేరు తెలంగాణలోని బీఆర్ఎస్ వేరు. దాదాపుగా రాష్ట్రంలోని 40 వేల పోలింగ్ బూత్‌లలో 4.5 లక్షల మంది బీఆర్ఎస్ కార్యకర్తలు పనిచేశారు. అంటే ఆ పార్టీ 100-50 ఓట్లకు ఒక కార్యకర్త చొప్పున వ్యవస్థీకృతమైన రాజకీయ శక్తిని కలిగి ఉన్నది. పార్టీ సభ్యత్వం 60 లక్షల పైచిలుకు ఉన్నది. దాదాపు 20 లక్షల క్రియాశీలక సభ్యులున్న బీఆర్ఎస్ ఆర్థిక పరిపుష్ఠి కలిగి, బలమైన క్యాడర్‌తో నిండి ఉన్నది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. దేశ రాజధానిలో పార్టీ కార్యాలయం కలిగి ఉన్న ఏకైక ప్రాంతీయ పార్టీ బీఆర్ఎస్. మహారాష్ట్రలోని పుణె, నాందేడ్ లాంటి ప్రాంతాలకూ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలు విస్తరించాయి.
ఒకే ఒక్కడితో ప్రారంభమైన పార్టీ, నేడు కొన్ని లక్షల మంది కార్యకర్తలతో ముం దుకు సాగుతున్నది. 2018లో బీఆర్ఎస్ దాదాపు కోటి ఓట్లను సాధించింది. 20 23లో 4 లక్షల ఓట్ల తేడాతో అధికారాన్ని కోల్పోయింది. ఇది తాత్కాలికంగా మారిన ఓటింగ్ సరళి మాత్రమే. కానీ, బీఆర్ఎస్ క్యాడర్‌ను దెబ్బతీసే స్థాయి ఓటమి రాలేదనే విషయాన్ని కాంగ్రెస్, బీజేపీ గుర్తుంచుకోవాలి. కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అభివృద్ధికి చేసిన సేవలు, అమలుచేసిన సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ శక్తిసామర్థ్యాలను నిరూపించాయి. బీఆర్ఎస్ కార్యాలయ ఇంఛార్జిగా రిటైర్డ్ ప్రొఫెసర్ మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిని నియమించడం, ఒక ఉద్యమ నాయకుడిని పార్టీ నిర్వహణకు తీసుకురావడం బీఆర్ఎస్ పాలనాకౌశల్యాన్ని తెలుపుతున్నది. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకుంటూ కేసీఆర్ అభివృద్ధి పరంగా దూసుకువెళ్లారు. ఆ చాకచక్యమే పార్టీకి సమయాన్ని, వ్యవస్థీకృతంగా ముందుకువెళ్లే అవకాశాన్నిస్తున్నది.
కేసీఆర్ గత పదేండ్లుగా ప్రభుత్వ, పార్టీ నిర్వహణను సమతుల్యం చేశారు. కానీ, ఇప్పుడు అధికారంలో లేకపోవడం కారణంగా ఆయన పూర్తి సమయాన్ని పార్టీకే కేటాయిస్తారు. తద్వారా కార్యకర్తలకు శిక్షణ, నాయకత్వ మార్గదర్శనం మరింత బలంగా కొనసాగుతుంది. ఆ దిశగానే అనుభవం కలిగిన నాయకుడిగా, తన యాభై ఏండ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న వ్యూహకర్తగా కేసీఆర్, పార్టీని మరింత పటిష్ఠం చేసేందుకు కంకణం కట్టుకున్నారు.
అందులో భాగంగానే గత ఏడాదిన్నర కాలంగా దాదాపు ఒక లక్ష మందికి పైగా కార్యకర్తలను ప్రత్యక్షంగా కలిశారు. పార్టీ నేతలను, కార్యకర్తలను ఒకే తాటిమీదికి తేవడంలో ఆయన విజయవంతంగా ముందుకుసాగుతున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ మరోసారి తెలంగాణ గడ్డమీద తన బలాన్ని నిరూపించుకోబోతున్నది. ఓటమి అనేది పార్టీ అంతం కాదు, అది మరింత బలంగా తిరిగి రావడానికి అవకాశం. ప్రజా సంక్షేమ పరమావధిగా ముందుకువెళ్లే బీఆర్ఎస్ పార్టీ నిలబడటమే కాదు, మరింత పాతుకుపోతుందనడంలో ఏ మాత్రం సంశయం అక్కరలేదు.
– కార్తీక్ రెడ్డి కోరుట్లపేట, 9848176545